Rains In Telugu States: తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు.. మళ్లీ వానలు..!

వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ చెప్పింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

  • Written By:
  • Publish Date - August 14, 2023 / 08:06 PM IST

Rains In Telugu States: పది రోజుల కింది వరకు వెన్నులో వణుకు పుట్టించిన వరుణుడు.. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు కనీసం పత్తా లేకుండా పోయాడు. వాన జాడ కూడా కనిపించడం లేదు. ఇది ఎండాకాలమా.. వర్షాకాలమా అనే రేంజ్‌లో ఉక్కపోత జనాలను ఇబ్బంది పెడుతోంది. కూలర్లు మళ్లీ మోతపెడుతున్నాయి. ఏసీలు మళ్లీ ఆన్ చేయాల్సిన పరిస్థితులు వచ్చాయంటే అర్థం చేసుకోవచ్చు సీన్ ఏంటో..!

ఇలాంటి పరిణామాల మధ్య వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ చెప్పింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీంతో వచ్చే మూడు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అల్పపీడనం బంగ్లాదేశ్, మయన్మార్ మధ్యలో విస్తరించిందని.. ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారిపోయే అవకాశం ఉందని.. చిరుజల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక అటు ఏపీకి కూడా వాతావరణ శాఖ కూల్‌కూల్‌ న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉక్కపోతతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. ఐతే వచ్చే రెండు రోజులపాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. ఏపీ తీరాన్ని ఆనుకుని సముద్ర మట్టానికి నాలుగున్నర కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. దీంతో పాటు 9వందల మీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోందని అధికారులు చెప్తున్నారు. ద్రోణి ప్రభావంతో రాబోయే రెండు రోజుల్లో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశముందని స్పష్టం చేసింది. ఏపీలో గత కొన్ని రోజులుగా ఎండలు తీవ్రంగా ఉన్నాయి. వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. దీంతో తాజా వర్షాలతో వారికి ఊరట లభించే అవకాశం ఉంది.