RAIN ALERT: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన.. ఆరెంజ్ అలర్ట్ జారీ..!

తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఏపీకి సంబంధించి దక్షిణ కోస్తాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో గాలులు బలంగా వీస్తాయి.

  • Written By:
  • Publish Date - September 3, 2023 / 03:47 PM IST

RAIN ALERT: కొద్ది రోజులుగా మొహం చాటేసిన వరుణుడు మళ్లీ కరుణిస్తున్నట్లే ఉంది. ఏపీ, తెలంగాణలో మంగళవారం వరకు కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం ప్రభావంతో వర్షాలు కురవడంతోపాటు, గంటకు 30 కిలో మీటర్లు వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీకి సమీపంలో పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని ఐఎండీ పేర్కొంది. వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో మరో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. దీని కారణంగా తెలంగాణ రాష్ట్రం వైపు దిగువస్థాయిలో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆవర్తనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. సెప్టెంబర్ 7వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శాఖ హెచ్చరించింది. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్‌, కొమరం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. హైదరాబాద్ నగరంలోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని కొన్ని జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
ఏపీకి సంబంధించి దక్షిణ కోస్తాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో గాలులు బలంగా వీస్తాయి. రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురిస్తాయి. కొన్ని చోట్ల బలమైన గాలులు అవకాశం ఉంది. సత్యసాయి, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, అన్నమయ్య, నెల్లూరు జిల్లాల్లో వర్షాలు పడతాయి. భారీ వర్షాలతో పాటు పిడుగులు కూడా పడే అవకాశం ఉన్న నేపథ్యంలో బయటకు వెళ్లేవాళ్లు, ప్రయాణాలు చేసే వాళ్లు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
గత నెలలో తెలుగు రాష్ట్రాల్లో వర్షాల జాడ పెద్దగా కనిపించలేదు. దీంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మహారాష్ట్రలో అయితే, అనేక చోట్ల కరువు చాయలు కనిపించాయి. ఏపీలో, తెలంగాణలో మాత్రం అక్కడక్కడా చిరు జల్లులు కురిశాయి. ఈ పరిస్థితికి తెరదించేలా ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లోనూ కొన్నిచోట్ల చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షాలు పడుతున్నాయి.