ప్రపంచం చాలా చిన్నది అందరినీ ఒకే చోట కలిపేస్తుంది. ఇది జనతా గ్యారేజ్ సినిమాలోని ఒక డైలాగ్. దీనిని డైలాగ్ రూపంలో కాకుండా మన జీవిత వాస్తవికతకు దగ్గరగా అన్వయం చేసుకొని లోతైన విశ్లేషణ చేస్తే చాలా గొప్ప అర్థం వస్తుంది. చిన్న కాలువలు సరస్సుల్లో కలుస్తాయి. సరస్సులు నదులుగా మారతాయి. నదులు ఉపనదులుగా విడిపోతాయి. ఇలా వివిధ రూపాంతరాలు చెందినప్పటికీ చివరకు సాగర హృదయాన్ని చేరుతాయి. అంటే ఎవరు ఎంత ఎత్తు ఎదిగినా చివరకు తినేది రైతు పండించే అన్నమనే అర్థం ఒకటి. అలాగే ఎన్ని కోట్ల రూపాయల సంపద ఉన్నా నడవాల్సింది భూమిపైనే అనే అద్భుత సందేశాన్నిస్తుంది ప్రకృతి. కానీ ఇక్కడ అలా జరగలేదు. సముద్రంలోనే సరస్సు ఉద్భవించింది. ఆ వింత ఎక్కడ ఉందో ఇప్పుడు చూసేద్దాం.
ఈ సముద్రానికి చాలా పెద్ద చరిత్రే ఉంది. బ్రిటీష్ అధికారులు ఆక్రమణ మొదలు రెండవ ప్రపంచ యుద్దం నాటి పరిస్థితులను గుర్తుచేస్తుంది. అలాగే ఒక ప్రాంతంలోని ఇరు వర్గాల మధ్య పోరుకు కూడా సంకేతంగా నిలుస్తుంది. ఇక ప్రకృతిని ఆస్వాదించాలనుకునే వారికి అనంత ఆనందాన్ని అందిస్తుంది. అలాగే మరో చివరి అంశం ఏమిటంటే చాలా తక్కువ ఎత్తులో ఉన్నప్పటికీ అందనంత ఎత్తులో ఉన్నట్లుగా కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇలాంటి సుందరమైన సాగర సరస్సు ఎక్కడ ఉందో తెలుసుకుందాం.
డెన్మార్క్ సమీపంలోని దీవుల్లో వాగర్ ద్వీపం వద్ద సర్వాగ్ స్వాటన్ అనే పెద్ద సరస్సు ప్రవహిస్తుంది. ఇది సుమారు 3.4 చదరపు కిలో మీటర్ల పొడవుగా విస్తరించింది. ఒకవైపు పెద్ద సముద్రం. అందులో ఎత్తైన శిఖరం. ఆ శిఖరంలో వయ్యారాలు ఒలకపోస్తూ జలపాతంలా మారిపోయే సరస్సు. దీనిని దూరం నుంచి చూస్తే సరస్సు అనే అనుకుంటారు. చాలా దగ్గరకి వెళితే కానీ తెలియదు పెద్ద పెద్ద శబ్ధాలు చేస్తూ సముద్రంలోకి జాలువారుతుందని. ఈ వింతైన ప్రకృతి పరవళ్లను ఆస్వాదించేందుకు వివిధ దేశాల నుంచి పర్యాటకులు క్యూ కడుతూ ఉంటారు. ఈ సరస్సు పై చిన్న వివాదం కూడా ఉంది. దీనిపేరు సర్వాగ్ స్వాటన్ అని కొందరు చెబుతూ ఉంటారు. దీనిని ఖండించే వర్గం వారు లైట్ స్వాటన్ అని పిలుస్తారు. వీరందరూ స్థానికంగా ఉంటూ సరస్సుకు పశ్చిమ సర్వాగుర్ లో నివసించే వారుగా చెబుతారు. ఇక్కడ రెండు గ్రామలు ఉన్నాయి ఒకటి సర్వాగుర్ అయితే మరొకటి మియోవాగర్ అనమాట. ఈ రెండు గ్రామాలలో మియోవాగర్ ప్రాంతం ఈ సరస్సుకు చాలా దగ్గర ఉంది. అందుకే ఈ ప్రాంతీయులు తమ ప్రాంతంపేరుతో పిలుచుకుంటారు.
దీనిని చూడాలంటే ఎండాకాలం చివర్లో అయినా.. వానా కాలం ప్రారంభంలో అయినా సందర్శించాలి. అప్పుడే ఈ ప్రదేశాన్ని చూసేందుకు అనువైన సమయంగా అక్కడి వారు చెబుతారు. ఈ కాలంలో అక్కడి జలపాతాల హోరు శబ్ధాలు వింటే మనసు పులకరించక తప్పదు. ఈ సరస్సు నుంచి సముద్రంలోకి దూకే జలపాతానికి బోస్ దలా ఫోజర్ అని పేరు పెట్టారు. సముద్రమట్టానికి 40 మీటర్ల ఎత్తులో కొండ శిఖరాల మధ్య ఈ సరస్సు ప్రవహించడం వల్ల వాటి గోడలు నీటిని సాగరంలోకి ఒక్కసారిగా వెళ్లకుండా నియంత్రిస్తాయి. కేవలం తక్కువ ఎత్తులో ఉన్నప్పటికీ అందనంత ఎత్తులో ఉందనే భావనను కలిగిస్తుంది. ఈ సరస్సు బ్రిటీష్ కాలంటో యుద్దాలకు ఆశ్రయం ఇచ్చేదిగా చెబుతారు. రెండో ప్రపంచ యుద్దంలో ఈ దీవులన్నీ బ్రిటీష్ పాలకుల చేతిలో ఉండేవి. జర్మన్ నుంచి వచ్చే యుద్ద నౌకలను అడ్డుకునేందుకు ఈ ప్రాంతంలో ఒక వైమానికి నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ఈ సరస్సుకు పడమర తీరం వైపు విమానాశ్రయాన్ని కూడా నిర్మించారు. ప్రత్యర్థులపై దాడి చేసేందుకు ఈ స్థావరాన్ని ఏంచుకున్నారు. రాయల్ ఎయిర్ ఫోర్స్ కోస్టల్ కమాండ్ కి సంబంధించిన కెటలినా అనే విమానం 1941లో ఇక్కడ ల్యాండ్ అయినట్లు ఆధారాలున్నాయి.
ఇంతటి వినోదం, విజ్ఞానాన్ని అందించే ఘనచరిత్ర కలిగిన సాగర సరస్సును ప్రతి ఒక్కరూ చూడాల్సిందే.
T.V.SRIKAR