Heron Mark 2 drone: వాయుసేనలోకి హెరాన్ మార్క్-2 డ్రోన్లు.. చైనా, పాక్ సరిహద్దుల్లో శత్రువులకు చుక్కలే..!

భారత ఉత్తర సరిహద్దులోని సెక్టార్‌లో నాలుగు హెరాన్ మార్క్ 2 డ్రోన్లను ప్రవేశపెట్టారు. ఇవి శాటిలైట్లతో లింకై, ఒకేసారి దాదాపు 36 గంటలు ప్రయాణించగలవు. ఇవి గాలిలో ప్రయాణిస్తూ.. శత్రువుల విమానాలు, ఇతర లక్ష్యాలను గుర్తిస్తాయి. వాటిని లేజర్ల ద్వారా టార్గెట్ చేస్తాయి.

  • Written By:
  • Publish Date - August 13, 2023 / 06:27 PM IST

Heron Mark 2 drone: భారత వాయు సేన (ఇండియన్ ఎయిర్‌ఫోర్స్-ఐఏఎఫ్)లోకి అధునాతనమైన హెరాన్ మార్క్-2 డ్రోన్లు చేరాయి. ఇవి చైనా, పాక్ సరిహద్దులో వాయుసేన బలాన్ని మరింత పెంచగలవు. శత్రువులపై దాడిలో కీలకంగా పని చేస్తాయి. ఈ డ్రోన్లు క్షిపణులు, ఆయుధాల్ని మోసుకెళ్లగలవు. వీటిని శాటిలైట్ ద్వారా ఆపరేట్ చేయొచ్చు.

భారత ఉత్తర సరిహద్దులోని సెక్టార్‌లో నాలుగు హెరాన్ మార్క్ 2 డ్రోన్లను ప్రవేశపెట్టారు. ఇవి శాటిలైట్లతో లింకై, ఒకేసారి దాదాపు 36 గంటలు ప్రయాణించగలవు. ఇవి గాలిలో ప్రయాణిస్తూ.. శత్రువుల విమానాలు, ఇతర లక్ష్యాలను గుర్తిస్తాయి. వాటిని లేజర్ల ద్వారా టార్గెట్ చేస్తాయి. చాలా దూరం నుంచి శత్రు విమానాలు, ఆయుధాల రాకను గుర్తించి అప్రమత్తం చేస్తాయి. వాటిపై కాంతి పడేలా చేస్తాయి. దీంతో మన యుద్ధ విమానాల ద్వారా వాటిని గురిపెట్టి దాడి చేయొచ్చు. వీటిని ఎక్కడినుంచైనా ప్రయోగించవచ్చు. ఏ ఉపరితలం నుంచైనా ప్రయాణించి, లక్ష్యాన్ని గుర్తిస్తాయి. ఏ తలంలోనైనా, ఏ వాతావరణంలోనైనా ఇవి దూసుకెళ్తాయి. సున్నాకంటే తక్కువ ఉష్ణోగ్రతలో కూడా పని చేస్తాయి. సాధారణ కంటికి కనిపించని లక్ష్యాలను కూడా కనిపెడతాయి. ఒకసారి వెళ్తే.. చైనా, పాక్‌లోని లక్ష్యాలప నిఘా పెట్టి, వాటికి సంబంధించిన సమాచారాన్ని ఇవ్వగలవు. ఇవి గాలిలోంచి, నేల మీద నుంచి ప్రయోగించవచ్చు. అలాగే క్షిపణుల్ని, ఇతర ఆయుధాల్ని మోసుకెళ్తాయి.

సరిహద్దు దేశాలైన చైనా, పాక్ నుంచి మనకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో శత్రు దేశాలను ఎదుర్కొనేందుకు ఆయుధ సంపత్తిని, సాంకేతికతను అభివృద్ధి చేసుకునేందుకు రక్షణశాఖ ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా అధునాతన ఆయుధాలను తయారు చేయడం, కొనుగోలు చేయడం చేస్తోంది. దీనిలో భాగంగా తాజా డ్రోన్లను ప్రవేశపెట్టింది. వీటి రాకతో సరిహద్దుల్లో భద్రత మరింత పటిష్టం అవుతుంది. ఇటీవలే జమ్ము-కాశ్మీర్‌లో మిగ్-29 యుద్ధ విమానాలను కూడా మోహరించింది. గతంలో ఇక్కడ మిగ్-21 విమానాలుండేవి.. ఇప్పుడు వీటి స్థానంలో మిగ్-29లను తీసుకొచ్చింది.