Operation Ajay: ఇజ్రాయెల్ యుద్ధం.. భారతీయుల్ని క్షేమంగా తెచ్చేందుకు ఆపరేషన్ అజయ్ ప్రారంభం..!

ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయుల్ని ఇండియా తరలించేందుకు ఆపరేషన్ అజయ్ ప్రారంభిస్తున్నట్లు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్ వెల్లడించారు. ఇజ్రాయెల్‌లో భారతీయులు భారీ సంఖ్యలో ఉన్నారు. దాదాపు 18,000 మంది అక్కడ ఉన్నట్లు ప్రభుత్వ అంచనా.

  • Written By:
  • Publish Date - October 12, 2023 / 02:33 PM IST

Operation Ajay: ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. ఇరువైపులా వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అంతకు ఎన్నో రెట్లు గాయపడుతున్నారు. మహిళలు, చిన్నారులు కూడా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అయితే, ఈ యుద్ధ రంగంలో భారతీయులు చిక్కుకున్నారు. వివిధ కారణాలతో ఇజ్రాయెల్ వెళ్లిన భారతీయులు.. యుద్ధ ప్రభావిత దేశంలో చిక్కుకుపోయారు. వాళ్లంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని, సాయం కోసం అర్థిస్తున్నారు. వాళ్లందరినీ రక్షించేందుకు భారత ప్రభుత్వం సిద్ధమైంది.

ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయుల్ని ఇండియా తరలించేందుకు ఆపరేషన్ అజయ్ ప్రారంభిస్తున్నట్లు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్ వెల్లడించారు. ఇజ్రాయెల్‌లో భారతీయులు భారీ సంఖ్యలో ఉన్నారు. దాదాపు 18,000 మంది అక్కడ ఉన్నట్లు ప్రభుత్వ అంచనా. వీళ్లందరినీ ఇండియాకు సురక్షితంగా తెచ్చేందుకు ఆపరేషన్ అజయ్‌ను ప్రారంభించింది. దీనిలో భాగంగా చార్టెడ్ ఫ్లైట్స్ ఉపయోగించి భారతీయుల్ని ఇండియా తరలిస్తారు. అవసరమైతే నేవీ విమానాల్ని కూడా వాడబోతున్నట్లు జై శంకర్ తెలిపారు. ఈ మేరకు అక్కడి భారతీయ రాయబార కార్యాలయం భారతీయులకు మెయిల్ ద్వారా సందేశం పంపింది. మొదటి బ్యాచ్ భారతీయుల్ని గురువారం తీసుకురాబోతుంది. ఈ ఆపరేషన్ అజయ్ గురించిన సమాచారంతోపాటు ఇతర సహాయం కోసం ప్రభుత్వం ఢిల్లీలో ఒక కంట్రోల్ రూమ్ హెల్ప్‌లైన్ కూడా ఏర్పాటు చేసింది. ఇజ్రాయెల్‌లోని భారతీయుల శ్రేయస్సుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని జైశంకర్ తెలిపారు. భారతీయులు.. సహాయం కోసం అక్కడి రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని సూచంచారు.

హమాస్ దాడుల్లో ఇజ్రాయెల్‌లో ఉన్న పలువురు విదేశీయులు కూడా ప్రాణాలు కోల్పోయారు. 20 మందికిపైగా అమెరికా పౌరులు కూడా మరణించారు. విదేశీయుల్ని హమాస్ తీవ్రవాదులు బందీలుగా చేసుకున్నారు. వాళ్లపై దాడులు చేస్తూ హతమారుస్తున్నారు. దీంతో ఇతర దేశాలు కూడా ఇజ్రాయెల్‌లోని తమ పౌరుల్ని సురక్షితంగా రక్షించేందుకు చర్యలు చేపట్టాయి. ఈ యుద్ధంలో ఇప్పటివరకు అధికారికంగా 2200 మంది ప్రాణాలు కోల్పోయారు. గురువారం నాటికి ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం ఐదో రోజుకు చేరింది. రెండింటి మధ్యా భీకరయుద్ధం సాగుతోంది. హమాస్ అధీనంలో ఉన్న గాజాపై ఇజ్రాయెల్ భారీ దాడులు చేస్తోంది.