Covid-19: దేశవ్యాప్తంగా కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతోంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 12,591 మందికి పాజిటివ్ వచ్చింది. బుధవారం నాటికంటే ఇది 20శాతం అధికం. అంతకుముందు రోజు 10,542 కేసులు మాత్రమే నమోదయ్యాయి.
కేసుల పెరుగుదలకు ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ఎక్స్‌బీబీ.1.16 కారణమని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఎనిమిది నెలల్లో ఒకేరోజు ఇంత పెద్దసంఖ్యలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. కొత్తగా 29 మంది కరోనా కారణంగా చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 5.31 లక్షలు దాటింది. రోజువారీ పాజిటివిటీ రేటు 5.46 శాతం కాగా, 0.15 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 98.67 శాతం మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా 220.66 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 4.48 కోట్లకు పెరిగింది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ఎక్స్‌బీబీ.1.16 ప్రభావం మరో వారం నుంచి పది రోజుల వరకు ఉంటుందని వైద్యులు అంచనా వేస్తున్నారు. మహారాష్ట్ర, ఢిల్లీల్లో కేసుల సంఖ్య ఎక్కువగా నమోదు అవుతోంది.
రెండు రాష్ట్రాల్లోనూ తాజాగా అయిదుగురు చొప్పున మరణించారు. హిమాచల్ ప్రదేశ్‌లో ఇద్దరు, కర్ణాటకలో ముగ్గురు, పాండిచ్చేరీ, తమిళనాడు, ఉత్తరాఖండ్, పంజాబ్‌లో ఒకరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో ఆరుగురు మరణించగా, రాజస్థాన్, కేరళలో ఇద్దరు చొప్పున మరణించినట్లు అధికారులు వెల్లడించారు. మహారాష్ట్ర, ఢిల్లీలో కేసుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని రెండు రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండడతో.. కేంద్రం అలెర్ట్ అయింది. ఈనెల 10, 11వ తేదీల్లో మాక్ డ్రిల్ కూడా నిర్వహించింది. ఇక అటు డాక్టర్లు కూడా కీలక సూచనలు చేస్తున్నారు. కేసులు పెరుగుతున్న వేళ.. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. మాస్క్, పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యం వహించొద్దని అంటున్నారు.