INDIA TRAVEL: మార్చిలో చూడదగ్గ ప్రదేశాలివే.. మౌంట్ అబు వెళ్తారా..?

చాలా తక్కువ మందికి తెలిసిన బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ మౌంట్ అబు. రాజస్థాన్‌లోని మౌంట్ అబు.. వేసవి ప్రారంభానికి ముందు, మార్చిలో చూడదగ్గ మరో సుందర ప్రదేశం. సైట్ సీయింగ్‌కు అనువైనది. ఇదే సమయంలో ఇక్కడ గాంగ్వార్ ఫెస్టివల్ జరుగుతుంది.

  • Written By:
  • Publish Date - February 22, 2024 / 07:35 PM IST

INDIA TRAVEL: కొన్ని ప్లేసెస్ చూడాలంటే కొన్ని సీజన్సే బెస్ట్. ఏ సమయంలో ఎక్కడికి వెళ్తే ఎంజాయ్ చేయొచ్చో.. ఆ సమయంలోనే ఆ ప్రదేశానికి వెళ్లాలి. రాబోయే మార్చి నెలలో దేశంలోని కొన్ని పర్యాటక ప్రాంతాలు ప్రత్యేకంగా ఉంటాయి. మార్చిలో చూడదగ్గ ఇండియాలోని కొన్ని బెస్ట్ టూరిస్ట్ ప్లేసెస్ ఇవి.
తాబేళ్ల ఫెస్టివల్
మహారాష్ట్రలోని రత్నగిరి దగ్గర్లో ఉన్న చిన్న గ్రామం వేలాస్. ఇది ముంబైకి 220 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇంత దూరంలో ఉన్నప్పటికీ మార్చిలో పర్యాటకులు ఇక్కడి వెళ్తుంటారు. దీనికో కారణం ఉంది. ఎందుకంటే ఇక్కడి అరేబియా సముద్ర తీరంలో ఉండే తాబేళ్లు. ఇవి ఈ సీజన్‌లో ఇక్కడ పిల్లల్ని కంటాయి. పిల్ల తాబేళ్లు మార్చిలోనే గూళ్ల నుంచి బయటకు వస్తాయి. వేలాది తాబేళ్లు ఇసుకలోనుంచి అరేబియా సముద్రంలోకి వెళ్తాయి. ఇలాంటి జీవ వైవిధ్యాన్ని చూసేందుకే ఇక్కడికి పర్యాటకులు వస్తుంటారు. అయితే, ఇక్కడి అందమైన బీచ్, ఇసుక వంటివి కూడా పర్యాటకుల్ని మెప్పిస్తాయి.
గోవా
గోవా ఎప్పుడు వెళ్లినా బాగానే ఉంటుంది. అయితే, కొన్ని సమయాల్లో ఇంకాస్త స్పెషల్‌గా కనిపిస్తుంది. అలాంటి సమయాల్లో మార్చి ఒకటి. కారణం.. ఇక్కడి షిగ్మో ఫెస్టివల్. ఇది గోవాలో జరిగే అతిపెద్ద హిందూ సంప్రదాయ వేడుక. గోవాలోని అసలైన లైఫ్‌ చూసేందుకు కూడా ఇది మంచి సమయం. స్థానికంగా ఉన్న హిందువులు జరుపుకొనే షిగ్మో ఫెస్టివల్‌లో వాళ్ల నృత్యాలు, ప్రాచీన సంప్రదాయాలు ఆకట్టుకుంటాయి.
ఊటీ
తమిళనాడులోని ఊటీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఏడాదిలో ఎప్పుడొచ్చినా ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. అందులోనూ మార్చి అయితే, మరింత ఎంజాయ్ చేయొచ్చు. ఈ హిల్ స్టేషన్ మార్చిలోనూ పర్యాటకుల్ని ఆకర్షిస్తుంది. పచ్చని చెట్లు, బొటానికల్ గార్డెన్స్, సరస్సులు, టీ తోటలు, స్పైస్ గార్డెన్స్ కనువిందు చేస్తాయి. ఈ ప్రాంతం మొత్తం రంగురంగులతో పెయింటింగ్ చేసినట్లు ఉంటుంది.
వయనాడ్
కేరళలోని వయనాడ్ మరో మార్చి డెస్టినేషన్. ఇది ప్రాచీన సంప్రదాయాల్ని ఇప్పటికే పాటించే ప్రదేశం. పశ్చిమ కనుమల్లోని వయనాడ్‌‌లో మార్చిలో వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంటుంది. పచ్చని చెట్లు, కొండలు, దట్టమైన అడవులు ఆకట్టుకుంటాయి. ట్రెక్కింగ్, హైకింగ్ చేయాలనుకునే వాళ్లకు, అటవీ జంతువుల్ని చూడాలనుకునే వాళ్లకు ఇదో మంచి డెస్టినేషన్.
మౌంట్ అబు
చాలా తక్కువ మందికి తెలిసిన బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ మౌంట్ అబు. రాజస్థాన్‌లోని మౌంట్ అబు.. వేసవి ప్రారంభానికి ముందు, మార్చిలో చూడదగ్గ మరో సుందర ప్రదేశం. సైట్ సీయింగ్‌కు అనువైనది. ఇదే సమయంలో ఇక్కడ గాంగ్వార్ ఫెస్టివల్ జరుగుతుంది. బయట ఎండ ఎంత ఎక్కువగా ఉన్నా.. ఈ సీజన్‌లో ఇక్కడ 33 డిగ్రీలు దాటదు. అందువల్ల వేసవి ప్రారంభంలో ఇక్కడ చల్లని వాతావరణాన్ని ఆస్వాదించొచ్చు.