Dengue: డెంగ్యూపై హైదరాబాద్ వార్.. కొత్త డెవలప్‌మెంట్ ఏంటో తెలుసా..?

2026 జనవరి నాటికి డెంగ్యూ జ్వరానికి వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకొస్తామని హైదరాబాద్ కు చెందిన ఇండియన్ ఇమ్యూనోలాజికల్స్ లిమిటెడ్ (ఐఐఎల్‌) ప్రకటించింది.

  • Written By:
  • Publish Date - August 25, 2023 / 10:31 PM IST

Dengue: ఏటా వర్షాకాలంలో ప్రజలకు దడపుట్టిస్తున్న డెంగ్యూ మహమ్మారికి విరుగుడు రెడీ అవుతోంది. మేడిన్ ఇండియా ఔషధం తయారీకి ముమ్మర రీసెర్చ్ జరుగుతోంది. ప్రత్యేకించి మన హైదరాబాద్ కేంద్రంగా ఇందుకోసం శక్తివంతమైన అస్త్రం ఒకటి సిద్ధమవుతోంది. ఇతర వ్యాధుల్లాగే డెంగ్యూకు కూడా చెక్ పెట్టే సామర్ధ్యం కలిగిన వ్యాక్సిన్ ను మన భాగ్యనగరిలో అభివృద్ధి చేస్తున్నారు. 2026 జనవరి నాటికి డెంగ్యూ జ్వరానికి వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకొస్తామని హైదరాబాద్ కు చెందిన ఇండియన్ ఇమ్యూనోలాజికల్స్ లిమిటెడ్ (ఐఐఎల్‌) ప్రకటించింది. ప్రాథమిక దశ ప్రయోగాల్లో భాగంగా 90 మందికి ఈ వ్యాక్సిన్‌ ను ఇవ్వగా ఎలాంటి నెగెటివ్ ఫలితాలు రాలేదని తెలిపింది. అన్ని రకాల ప్రయోగ పరీక్షలను పూర్తి చేసేందుకు మరో రెండు, మూడేళ్ల సయయం పడుతుందని పేర్కొంది. ఈ వ్యాక్సిన్‌ అభివృద్ధికి అవసరమైన వైరస్‌ను అమెరికాలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ (ఎన్‌ఐహెచ్‌) నుంచి సేకరించినట్టు చెప్పింది.
కేసుల లెక్కలివీ..
నిలకడగా ఉన్న నీటిలోనే ఈ డెంగ్యూకి కారణమయ్యే ఏడిస్ ఏజిప్టి దోమ వృద్ధి చెందుతుంది. ఏప్రిల్‌లో రుతుపవనాలకు ముందు వర్షాలు ప్రారంభమైనప్పుడు.. నిల్వ ఉన్న నీటిలో ఏడిస్‌ దోమలు వృద్ధి చెందుతుంటాయి. దేశంలో డెంగ్యూ వ్యాధి లెక్కలను ఓ సారి పరిశీలిస్తే.. ఈ ఏడాది ఇప్పటి వరకు 31 వేల 464 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధితో చాలా ప్రాంతాల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. కరోనా సమయంలో డెంగ్యూ కేసులు తగ్గాయి. అయితే 2020-21 సంవత్సరంలో డెంగ్యూ కేసులు 333 శాతం పెరగగా, 2021-22 సంవత్సరంలో 21 శాతం పెరిగాయి.

మన దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం డెంగ్యూ వేగంగా వ్యాపిస్తోంది. జూలై 31 నుంచి ఆగస్టు 6 వరకు కేవలం ఏడు రోజుల్లో 105 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక మన పొరుగుదేశం బంగ్లాదేశ్‌లో ఆగస్టు 3న 59,716 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. అయితే వీటిలో 32,562 కేసులు ఒక్క ఢాకాలోనే నమోదవడం గమనార్హం. ఇండియాలో డెంగ్యూ వ్యాక్సిన్ డెవలప్ అయితే బంగ్లాదేశ్, ఆఫ్రికా దేశాల్లో ఆ మహమ్మారికి చరమగీతం పాడేందుకు మార్గం సుగమం అవుతుంది. మన హైదరాబాద్‌కు చెందిన ఐఐఎల్‌, పనేషియా బయోటెక్ కంపెనీలతో పాటు పుణె కు చెందిన వ్యాక్సిన్ దిగ్గజం సీరం ఇనిస్టిట్యూట్‌ కూడా డెంగ్యూ వ్యాక్సిన్‌ను తయారు చేయబోతున్నాయి. ఐఐఎల్ కంపెనీ ఇప్పటికే 50 దేశాలకు వివిధ రకాల టీకాలను సప్లై చేస్తోంది.
డెంగ్యూ జ్వరం లక్షణాలు..
డెంగ్యూ జ్వరం వచ్చిన వారిలో తీవ్ర తలనొప్పి, ఒళ్లు నొప్పి, గొంతు నొప్పి, బాడీపై దద్దుర్లు, శరీరం వేడెక్కడం వంటి లక్షణాలు బయటపడతాయి. దురద, వికారం, వాంతులు, కాలేయ వాపు వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. మెదడులో ఆక్సిజన్ లెవల్స్ తగ్గిపోవడం, పొత్తికడుపులో నొప్పి, నల్లటి మలం, చర్మం, ముక్కు, నోటి నుంచి స్వల్ప రక్తస్రావం వంటి ప్రాబ్లమ్స్ సైతం కొందరు డెంగ్యూ బాధితుల్లో తలెత్తుతాయి.