Indian Railways: రైళ్లలో రూ.20కే భోజనం.. ఎక్కడంటే..

ఎకానమీ మీల్ పేరుతో రూ.20కే భోజనం అందిస్తోంది దక్షిణ మధ్య రైల్వే. ప్రస్తుతం సికింద్రాబాద్, విజయవాడ రేణిగుంట, గుంతకల్ రైల్వే స్టేషన్లలోనే ఈ సదుపాయం ఉంది. త్వరలోనే మిగతా స్టేషన్లలో కూడా ఈ భోజనం అందుబాటులోకి రానుంది.

  • Written By:
  • Publish Date - July 23, 2023 / 09:24 AM IST

Indian Railways: రైలు ప్రయాణికులకు ఐఆర్‌టీసీ శుభవార్త చెప్పింది. త్వరలో తక్కువ ధరకే రైలు ప్రయాణికులకు భోజనం అందించేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతోంది. ఇప్పటికే కొన్ని చోట్ల ఈ పద్ధతి అమలు చేస్తోంది. రూ.20కే భోజనం అందిస్తోంది. ఎకానమీ మీల్ పేరుతో రూ.20కే భోజనం అందిస్తోంది దక్షిణ మధ్య రైల్వే.

ప్రస్తుతం సికింద్రాబాద్, విజయవాడ రేణిగుంట, గుంతకల్ రైల్వే స్టేషన్లలోనే ఈ సదుపాయం ఉంది. త్వరలోనే మిగతా స్టేషన్లలో కూడా ఈ భోజనం అందుబాటులోకి రానుంది. ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో ఈ సేవలు ప్రారంభమయ్యాయి. జనరల్ కోచ్ ప్రయాణికులకు తక్కువ ధరకే నాణ్యమైన భోజనం అందించాలన్న ఉద్దేశంతో రెండు రకాల మీల్స్‌ను రైల్వే శాఖ ప్రవేశపెట్టింది. దీనిలో భాగంగా ఎకానమీ మీల్ రూ.20కి, కాంబో మీల్ రూ.50కి అందిస్తోంది. రైళ్లలో జనరల్ బోగీలు ఆగే ప్లాట్‌ఫామ్ పక్కన వీటిని విక్రయిస్తారు. స్టేషన్లలోని రిఫ్రెష్‌మెంట్ రూమ్స్, జన్ ఆహార్స్ వద్ద కూడా ఈ మీల్స్ అందుబాటులో ఉంటాయి. ప్లాట్‌ఫామ్‌లపై స్టాల్స్ ద్వారా కూడా వీటిని విక్రయిస్తారు. ఇవి పార్శిల్ మీల్స్. నేరుగా పార్శిల్ తీసుకెళ్లి రైళ్లలోనే తినొచ్చు. ఎకానమీ మీల‌్‌లో పూరి, కర్రీ ఉంటాయి. కాంబో మీల్‌లో పులిహోరం, కర్డ్ రైస్, ఫ్లేవర్డ్ రైస్ కలిపి ఉంటాయి. దీనివల్ల జనరల్ కోచ్‌లలో ప్రయాణించే పేద, మధ్య తరగతి వారికి ప్రయోజనం కలుగుతుంది.

తక్కువ ధరలోనే నాణ్యమైన, శుభ్రమైన ఆహారాన్ని అందిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. ఆహారంతోపాటు తక్కువ ధరలోనే స్నాక్స్, మంచి నీళ్లు కూడా అందిస్తున్నారు. ఇప్పటికే తక్కువ ధరలోనే ప్రయాణికులకు బ్రేక్‌ఫాస్ట్ కూడా అందిస్తోంది ఐఆర్‌సీటీసీ. లైసెన్స్ పొందిన విక్రయదారులు మాత్రమే వీటిని విక్రయిస్తారు. ప్రయాణికులు ఇకపై తక్కువ ధరలోనే రైళ్లలో మంచి భోజనంతో ఆకలి తీర్చుకోవచ్చు. ప్రస్తుతం ఈ సర్వీసు తెలుగు రాష్ట్రాల్లోనే అందుబాటులో ఉండటం విశేషం. ఈ సదుపాయం కలగడంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే స్టేషన్లలో ఉండే అధిక ధరల నుంచి దీనివల్ల ఉపశమనం కలుగుతుందంటున్నారు.