Anju: రాజస్థాన్‌కు చెందిన అంజూ అనే మహిళ.. ఫేస్‌బుక్‌లో పరిచయమైన తన ప్రియుడి కోసం పాకిస్తాన్ వెళ్లి, ఇస్లాం స్వీకరించిన సంగతి తెలిసిందే. అక్కడ ఫాతిమాగా పేరు మార్చుకుని, నస్రుల్లా అనే పాక్ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీళ్లిద్దరి మధ్య ఐదేళ్ల తేడా ఉంది. అంజుకంటే నస్రుల్లా ఐదేళ్లు చిన్నవాడు. ఇటీవలే ఘనంగా పెళ్లి చేసుకున్న ఈ జంట పాక్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని అప్పర్ దిల్ జిల్లాలోని ఒక గ్రామంలో ఉంటున్నారు.
అంజు తన ప్రియుడి కోసం ఇండియా నుంచి వచ్చి, ఇస్లాంలోకి మారినందుకుగాను.. పాక్‌కు చెందిన ఒక రియల్ ఎస్టేట్ సంస్థ బహుమతి అందజేసింది. సుమారు 272 చదరపు అడుగుల భూమితోపాటు, కొంత నగదును కూడా ఆ రియల్ ఎస్టేట్ సంస్థ సీఈవో మోసిన్ ఖాన్ అబ్బాసి అందజేశారు. శనివారం అంజు అలియాస్ ఫాతిమా ఇంటికి వెళ్లిన మోసిన్.. భూమికి సంబంధించిన పత్రాలతోపాటు, నగదుకు సంబంధించిన చెక్కును ఆమెకు అందజేశారు. పాక్‌కు చెందిన ఒక జర్నలిస్టు కూడా 50,000 పాక్ రూపాయలు కలిగిన చెక్ అందించారు. కాగా.. వారి దాంపత్య జీవితానికి శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చామని, వారి జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు బహుమతులు అందించాని రియల్ ఎస్టేట్ సంస్థ సీఈవో మోసిన్ అన్నాడు. కాగా, అంజుకు ఉద్యోగం ఇచ్చేందుకు కూడా పలు పాక్ కంపెనీలు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాయి. మరిన్ని సంస్థలు కూడా ఆమెకు సాయం చేసేందుకు ముందుకొస్తున్నాయి.
అయితే.. అంజుకు అంతకుముందు ఇండియాలోనే అరవింద్ కుమార్ అనే వ్యక్తితో పెళ్లైంది. ఆ దంపతులకు 15 ఏళ్ల ఒక కూతురు, ఆరెళ్ల కొడుకు కూడా ఉన్నాడు. అంజు భర్త, పిల్లల్ని ఇక్కడే వదిలేసి పాక్ వెళ్లిపోయింది. తన భర్తకు జైపూర్ వెళ్తున్నానని, కొద్ది రోజుల్లో వచ్చేస్తానని చెప్పింది. తీరా చూస్తే.. అంజు తన ప్రియుడి కోసం పాక్ వెళ్లినట్లు తెలుసుకుని షాక్ అయ్యాడు. తన భార్యతో తనకు విడాకులు కాలేదని, అందువల్ల తన భార్య వివాహం చెల్లదని భర్త అరవింద్ కుమార్ అన్నాడు. ఈ విషయంలో తనకు భారత ప్రభుత్వం సాయం చేయాలని ఆయన కోరారు.