LPG Gas: ఇప్పటికీ కట్టెలపొయ్యిపైనే వంట.. వంట చెరకు వినియోగిస్తున్న 36 శాతం మంది.. కేంద్ర నివేదికలో వెల్లడి

దేశంలో 62 శాతం కుటుంబాలు మాత్రమే వంటకు ఎల్పీజీ గ్యాస్ వినియోగిస్తున్నాయి. 36 శాతం కుటుంబాలు వంట చెరకునే ఉపయోగిస్తున్నాయి. అంటే ఇందులో 33.8 శాతం కట్టెలు, పొట్టు, పంట, పిడకలు వంటి వాటిని ఉపయోగిస్తున్నారు.

  • Written By:
  • Publish Date - April 10, 2023 / 06:21 PM IST

LPG Gas: వంట గ్యాస్ (ఎల్పీజీ) అందుబాటులోకి తేవడం ద్వారా దేశంలో వంట చేసే మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతున్నట్లు చెబుతుంటుంది కేంద్రం. ఈ గ్యాస్ ద్వారా మహిళలకు కట్టెలపొయ్యిపై వంట చేయాల్సిన అవసరం తగ్గిందని, దీనిద్వారా పొగ నుంచి విముక్తి లభించిందని ప్రకటిస్తుంటుంది. అయితే, ఈ వెలుగులు ప్రకటనల వరకే పరిమితమయ్యాయని తాజా నివేదిక ఒకటి తేల్చింది. కేంద్ర పర్యావరణ శాఖ వెల్లడించిన గణాంకాల్లో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. దీనిప్రకారం.. ఇప్పటికీ చాలా మంది మహిళలు వంట చెరకు (కట్టెలపొయ్యి)నే వినియోగిస్తున్నారు.
36 శాతం కట్టెలపొయ్యిపైనే
దేశంలో 62 శాతం కుటుంబాలు మాత్రమే వంటకు ఎల్పీజీ గ్యాస్ వినియోగిస్తున్నాయి. 36 శాతం కుటుంబాలు వంట చెరకునే ఉపయోగిస్తున్నాయి. అంటే ఇందులో 33.8 శాతం కట్టెలు, పొట్టు, పంట, పిడకలు వంటి వాటిని ఉపయోగిస్తున్నారు. 1.3 శాతం గోబర్ గ్యాస్, కిరోసిన్, బొగ్గుల పొయ్యి, ఎలక్ట్రిక్ స్టవ్‌లను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వంట చెరకు వినియోగం ఎక్కువగా ఉంది. ఛత్తీస్‌గఢ్‌లో అత్యధికంగా గ్రామీణ ప్రాంతాల్లో 84.2 శాతం వంట చెరకు వాడుతున్నారు.

ఏపీలోని గ్రామీణ ప్రాంతాల్లో 16.3 శాతం మంది కట్టెలు, పొట్టు, పంట వ్యర్థాలపై వంట చేస్తున్నారు. 81.7 శాతం కుటుంబాలు మాత్రమే ఎల్పీజీని వాడుతున్నాయి. దేశంలో గ్రామీణ ప్రాంతల్లో 49.4 శాతం కుటుంబాలు ఎల్పీజీ వాడుతుండగా, 46.7 శాతం మంది కట్టెలు, పొట్టు వంటివి వాడుతున్నారు. 3 శాతం మంది పిడకలు, 0.7 శాతం మంది గోబర్ గ్యాస్, కిరోసిన్, బొగ్గుల పొయ్యి వంటివి వాడుతున్నారు. పట్టణాల్లో 89 శాతం మంది వంట కోసం ఎల్పీజీ వాడుతున్నారు. 6.5 శాతం మంది కట్టెలు, పొట్టు, 0.3 శాతం పిడకలు, 2.5 శాతం మంది గోబర్ గ్యాస్, ఎలక్ట్రిక్ స్టవ్, బొగ్గుల పొయ్యి వాడుతున్నారు.


పెరిగిన ధరలూ కారణమే
ఎల్పీజీ గ్యాస్ ధరలు నిత్యం పెరిగిపోతుండటం కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఎల్పీజీ గ్యాస్ వాడకపోవడానికి కారణాలు. పెరుగుతున్న సిలిండర్ భారాన్ని గ్రామీణ మహిళలు భరించలేకపోతున్నారు. దీంతో వంట చెరకు, ఇతర మార్గాలవైపు మళ్లుతున్నారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో వంట చెరకు, పొట్టు, వ్యవసాయ వ్యర్థాలు, పిడకలు వంటివి ఉచితంగా లభిస్తుండటంతో వీటివైపు మొగ్గు చూపుతున్నారు. పైగా వీటి నుంచి వచ్చే బూడిదను పంట పొలాలకు ఎరువుగా వాడుతున్నారు. ఈ కారణాల వల్ల వంట చెరకు వాడేందుకే ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు.