Aditya-L1: చంద్రయాన్–3 ప్రయోగాన్ని విజయంతం చేసి, చంద్రుడి గుట్టు శోధిస్తున్న ఇస్రో ఇప్పుడు సూర్యుడి రహస్యాల్ని చేధించేందుకు సిద్ధమైంది. సూర్యుడిపై పరిశోధనకోసం రూపొందించిన ఆదిత్య ఎల్–1 మిషన్ ప్రయోగాన్ని సెప్టెంబర్ 2, శనివారం చేపట్టబోతుంది. ఉదయం 11:50 గంటలకు ఏపీ, శ్రీహరికోటలోని షార్ సెంటర్ నుంచి, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ పీఎస్ఎల్వీ–ఎక్స్ఎల్ రాకెట్ ద్వారా ఈ ప్రయోగం జరుగుతుంది. ఇది ఇండియా చేపట్టనున్న మొదటి సోలార్ మిషన్. దీనికి దాదాపు రూ.400 కోట్లు వ్యయమైనట్లు అంచనా.
సూర్యుడిని ఎందుకు శోధించాలి..?
భూమికి అతి దగ్గరగా ఉన్న నక్షత్రం సూర్యుడు. ఇతర నక్షత్రాలతో పోలిస్తే చంద్రుడిని అధ్యయనం చేయడం కాస్త సులభం. దీని ద్వారా పాలపుంతసహా, ఇతర గెలాక్సీల్లోని నక్షత్రాల గురించి కూడా తెలుసుకునే వీలుంటుంది. సూర్యుడి దగ్గర లక్షల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. అందువల్ల సూర్యుడి దగ్గరకు కాదు కదా.. సమీపంలోకి వెళ్లడం కూడా సాధ్యం కాదు. అందుకే సూర్యుడికి వందో వంతు దూరం నుంచే ఆదిత్య ఎల్1 పరిశోధనలు చేస్తుంది. ఈ మిషన్ భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఇక్కడి నుంచి సూర్యుడు 1500 లక్షల కిలోమీటర్ల ఉన్న సూర్యుడిని ఇది అధ్యయనం చేస్తుంది. ఇక్కడ కొన్ని వందల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు మాత్రమే ఉంటాయి. అక్కడి ఉష్ణోగ్రతను తట్టుకునేలా ఆదిత్య ఎల్1ను ఇస్రో రూపొందించింది. భూమి నుంచి పరిశోధనలు సాగించే ప్రదేశానికి చేరుకోవడానికి ఈ రాకెట్‌కు 10 రోజుల సమయం పడుతుంది. ఇస్రో ఇప్పటి వరకూ చేపట్టిన ప్రయోగాల్లో అత్యంత క్లిష్టమైనది ఇదే.
ఇక్కడి నుంచే ఎందుకు..?
ఆదిత్య ఎల్-1.. సూర్యుడి వివరాలు శోధించేందుకు ఇస్రో ఎంచుకున్న ప్రదేశం అత్యంత అనుకూలమైంది. ఆదిత్య ఎల్-1ను లాగ్‌రేంజ్-1 అనే ప్రాంతంలో ఉంచుతారు. భూమి–సూర్యుడు, భూమి–చంద్రుడు వంటి రెండు ఖగోళ వస్తువుల మధ్య, సమాన ఆకర్షణ కలిగిన ప్రదేశాలనే లాగ్ రేంజ్ పాయింట్లు అంటారు. ఈ ప్రదేశంలో ఒక వస్తువు ఇంధనం అవసరం లేకుండా కక్ష్యలో, స్థిరంగా అలా తిరుగుతూనే ఉంటుంది. ఇక్కడి నుంచి సూర్యుడి ఫొటోల్ని సులభంగా తీయొచ్చు. భూమికి, సూర్యుడికి మధ్య మొత్తం ఐదు లాగ్‌రేంజ్ పాయింట్లున్నాయి.
ఎలా పని చేస్తుంది..?
సూర్యుడిలో మూడు పొరలున్నాయి. అవి ఫొటోస్ఫియర్, క్రోమోస్ఫియర్, కొరోనా. ఈ మూడింటిని ఆదిత్య ఎల్-1 మిషన్ అధ్యయనం చేస్తుంది. ఈ రాకెట్‌లో పంపిన పేలోడ్స్ సూర్యుడికి సంబంధించిన వివిధ అంశాలను అధ్యయనం చేస్తాయి. సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత తరంగాలను సోలార్ అల్ట్రా వయలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ అధ్యయనం చేస్తుంది. కొరోనాపై అధ్యయనం చేసేందుకు విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనాగ్రాఫ్ ఉపయోగపడుతుంది. ఇది సూర్యుడి పరారుణ తరంగాలు, కాంతి, అయస్కాంత క్షేత్రం, సాంద్రత, ఉష్ణోగ్రత వంటి అంశాల్ని అధ్యయనం చేస్తుంది.
సూర్యుడి నుంచి వెలువడే ఎక్స్‌రేలపై పరిశోధనలకు సాఫ్ట్ అండ్ హార్డ్ ఎక్స్ రే స్పెక్ట్రోమీటర్స్ ఉపయోగపడుతాయి. ఎక్స్‌రేస్ ఏ ప్రాంతం నుంచి వెలువడుతున్నాయో దీని ద్వారా తెలుస్తుంది. సూర్యుడి నుంచి వెలువడే రేడియేషన్‌ను సోలార్ విండ్స్‌ను సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్‌పరిమెంట్ అధ్యయనం చేస్తుంది. దీనివల్ల అక్కడి ఎలక్ట్రాన్లు, ప్రోటాన్ల గురించి తెలుస్తుంది. సూర్యుడి నుంచి వెలువడే ప్లాస్మాను అధ్యయనం చేసేందుకు ప్లాస్మా ఎనలైజర్ ఉపయోగపడితే, రేడియేషన్, అయస్కాంత తరంగాలను విశ్లేషించేందుకు అడ్వాన్స్‌డ్ ట్రై యాక్సిల్ హై రిజల్యూషన్ డిజిటల్ మ్యాగ్నెటో మీటర్ ఉపయోగపడుతుంది. ఈ సమాచారం అంతా ఇస్రోకు చేరుతుంది. వీటిని విశ్లేషించి సూర్యుడి స్వభావం, మార్పులు వంటి అంశాల్ని సైంటిస్టులు శోధిస్తారు.