Narges Mohammadi: నర్గీస్ మహమ్మదికి నోబెల్ శాంతి పురస్కారం.. ఈమె కృషి తెలిస్తే సలాం చేస్తారు..!

ఇరాన్‌లో మహిళల అణిచివేతకు వ్యతిరేకంగా ఉద్యమించారు నర్గీస్‌. ఈ క్రమంలో జైలు శిక్ష కూడా అనుభవించారు. నోబెల్ శాంతి పురస్కారం అందుకున్న 19వ మహిళగా ఈమె రికార్డు సృష్టించారు.

  • Written By:
  • Publish Date - October 6, 2023 / 08:30 PM IST

Narges Mohammadi: ఇరాన్‌కి చెందిన మానవ హక్కుల కార్యకర్త నర్గీస్ మహమ్మదిని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ శాంతి పురస్కారం వరించింది. ఈ మేరకు అకాడమీ అధికారికంగా ప్రకటించింది. ఇరాన్‌లో మహిళల అణిచివేతకు వ్యతిరేకంగా ఉద్యమించారు నర్గీస్‌. ఈ క్రమంలో జైలు శిక్ష కూడా అనుభవించారు. నోబెల్ శాంతి పురస్కారం అందుకున్న 19వ మహిళగా ఈమె రికార్డు సృష్టించారు. మానవ హక్కులపై పోరాటం చేయడంతో పాటు ఇరాన్‌లో అందరి స్వేచ్ఛ కోసం ఉద్యమించారు మహమ్మది.

11 మిలియన్ల స్వీడిష్ క్రోన్స్‌ విలువైన బహుమతిని నర్గీస్ అందుకోనున్నారు. డిసెంబర్ 10వ తేదీన ఓస్లోలో ఈ పురస్కారం అందజేస్తారు. ప్రపంచంలోనే మహిళల హక్కులు అణిచివేతకు గురవుతున్న దేశాల్లో ఇరాన్‌ ఒకటి. ఇప్పటికీ ఆ దేశం అల్లర్లతో అట్టుడుకుతోంది. హిజాబ్‌కి వ్యతిరేకంగా అక్కడి మహిళలు ఉద్యమిస్తున్నారు. మొరాలిటీ పోలీసుల కస్టడీలో 19 ఏళ్ల యువతి చనిపోయింది. అప్పటి నుంచి అక్కడ ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. నర్గీస్ మహమ్మది కూడా ఇలానే చాలా సందర్భాల్లో మహిళల హక్కుల కోసం ఉద్యమించారు. 13 సార్లు అరెస్ట్ అయ్యారు. 5సార్లు దోషిగా తేలారు.

ఇప్పటి వరకూ దాదాపు 31 ఏళ్ల పాటు జైల్లోనే గడిపారు. సమాజం కోసం ఎంతో ధైర్యంగా పోరాడిన ఆమె.. వ్యక్తిగత జీవితాన్ని పణంగా పెట్టారని నోబెల్ అకాడమీ ప్రశంసించింది. ప్రస్తుతం నర్గీస్ మహమ్మది జైలు నుంచి బయటకు వచ్చారు. ఐనా సరే తన పోరాటాన్ని ఆపలేదు. ఇరాన్‌లో ఉరిశిక్షకు వ్యతిరేకంగా ఉద్యమించారు. నోబెల్ కమిటీ లెక్కల ప్రకారం.. గతేడాది జనవరి నుంచి ఇప్పటి వరకూ ఇరాన్‌లో 860 మంది ఖైదీలను ఉరి తీశారు. ఎన్నో ఏళ్లుగా ఈ ఉరిశిక్షలపై పోరాటం చేస్తున్నారు నర్గీస్. 2015లో అరెస్ట్ అయ్యారు. జైళ్లలో మహిళలపై అత్యాచారాలు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. పలు కేసుల్లో టెహ్రాన్‌లోని జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు నర్గీస్. దేశానికి వ్యతిరేకంగా దుష్ప్రచారాలు చేస్తున్నారని ప్రభుత్వం ఆమెపై ఆరోపణలు చేసింది.

ఇరాన్‌లోని డిఫెండర్స్ ఆఫ్‌ హ్యూమన్ రైట్స్ సెంటర్‌కి డిప్యూటీ హెడ్‌గానూ పని చేస్తున్నారు నర్గీస్. ఈ సంస్థని షిరిన్ ఎబది నడుపుతున్నారు. షిరిన్‌ కూడా 2003లో నోబెల్ పురస్కారం అందుకున్నారు. సాహిత్య రంగంలో ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా అకాడమీ ఇలా సత్కరించింది.