After Death: స్వర్గం, నరకం నిజంగా ఉన్నాయా? చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది..? పునర్జన్మ నిజమేనా?

నిజంగా స్వర్గం, నరకం అనేవి ఉంటాయా..? చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది..? పునర్జన్మ ఉంటుందా..? సైన్సుకు, మతానికి మధ్య వైరం ఈనాటిది కాదు. వేల సంవత్సరాలగా వీళ్ల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఒకరి వాదనకి.. మరొకరి ఆలోచనలకు అసలు సంబంధమే ఉండదు.

After Death: చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది..? నిజంగా ఆత్మలా మారుతామా? ఆ ఆత్మలకు నరకంలో శిక్షలు విధిస్తారా..? అసలు మతాలు ఏం చెబుతున్నాయి..? సైన్సు ఏం చెబుతుంది..?
ఒడిశాలో రైళ్ల ప్రమాద ఘటన దేశాన్ని తీవ్రంగా కలిచివేసింది. వందలాది మంది ప్రాణాలను బలిగొన్న మహా విషాదం ఇది. భవిష్యత్‌ పాఠ్య పుస్తకాల్లో కన్నీళ్లతో చదవాల్సిన పేజీలివి. ఇప్పటికే దాదాపు 300మందికిపైగా ప్రయాణికులు చనిపోగా, మరో 900మంది మృత్యువుతో పోరాడుతున్నారు. వాళ్లు ప్రాణాలతో బతికి బయటపడాలని దేవుళ్లకు మొక్కుతున్నారు. ఇక చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని.. అవి స్వర్గానికే వెళ్లాలని.. వాళ్లు మళ్లీ పుట్టాలని ప్రార్థిస్తున్నారు కొందరు. అయితే నిజంగా స్వర్గం, నరకం అనేవి ఉంటాయా..? చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది..? పునర్జన్మ ఉంటుందా..?
సైన్సుకు, మతానికి మధ్య వైరం ఈనాటిది కాదు. వేల సంవత్సరాలగా వీళ్ల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఒకరి వాదనకి.. మరొకరి ఆలోచనలకు అసలు సంబంధమే ఉండదు. మరణం తర్వాత ఏం జరుగుతుందన్న విషయంలో కూడా అంతే..! మరణం తర్వాత మన శరీరం ఆత్మలా మారుతుందని మతాలు చెబుతుండగా.. ఇది అంతా అబద్ధమని సైన్సు కొట్టిపారేస్తుంది. ఇంతకీ ఎవరి వెర్షన్ ఏంటి..?
ఆత్మలు ఉంటాయి.. శిక్షలు కూడా ఉంటాయి..
మనిషి చనిపోయాడు. ప్రాణం వెళ్లిపోయింది. ఆ తర్వాత ఏం జరుగుతుంది? దాదాపు అన్ని మతాలు ఆత్మలను విశ్వసిస్తాయి. మరణం మనిషి శరీరానికే కానీ.. ఆత్మకు కాదు అని. చనిపోయిన తర్వాత ఆత్మలు మన మధ్యే తిరుగుతాయని నమ్మే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిపై చాలా సినిమాలు వచ్చాయి కూడా. మరణం తర్వాత ఆత్మ నరకానికో, స్వర్గానికో వెళ్తుందన్నది దాదాపు అన్ని మతాల వారి నమ్మకం. హిందువుల ప్రకారం..తప్పు చేసిన వారి ఆత్మలు నరకానికి.. మంచి పనులు ఎక్కువ చేసిన ఆత్మలు స్వర్గానికి వెళ్తారు. క్రిస్టియానిటీ ప్రకారం మనుషులందరూ పాపాత్ములే. ఎవరైతే జిసస్‌ని దేవుడిగా అంగీకరిస్తారో వాళ్లు స్వర్గానికి.. అంగీకరించని వాళ్లు నరకానికి వెళ్తారు. అటు ఇస్లాం, జూడాయిజంలో కూడా దాదాపు ఇదే కాన్సెప్టు..! అన్ని నమ్మకాల్లోనూ మనిషి తప్పులకు నరకంలో శిక్షలుంటాయి. హిందూల ప్రకారం పునర్జన్మ కూడా ఉంటుంది. మనిషి ఏడు జన్మలెత్తుతాడని వారి నమ్మకం. పుట్టిన వారికి మరణం తప్పదు.. మరణించిన వారికి పుట్టుక తప్పదని కృష్ణుడు కూడా చెప్పినట్లు భగవద్గీత చెబుతోంది. అటు క్రిస్టియానిటీ, ఇస్లాం మతాలు మాత్రం మరో జన్మ ఉండవని చెబుతుంటాయి. అయితే ఆత్మలకు నరకంలో శిక్ష విధించడంలో మాత్రం అన్ని మాతాలదీ ఒక్కటే థియరీ.


ఆత్మలు ఉండవ్‌.. అదంతా అబద్ధం..
ఇటు సైన్సు వాదన మాత్రం మతాల అభిప్రాయాలకు పూర్తిగా భిన్నం. సైంటిస్టులు, డాక్టర్ల ప్రకారం మనిషి చనిపోయినప్పుడు శ్వాస ఆగిపోతుంది. గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. దీనివల్ల శరీరంలో అన్ని ప్రక్రియలు ఆగిపోతాయి. మన జీవితం పరమాణువులు(atoms), ఎలక్ట్రాన్స్‌(Electrons) సమాహారం తప్ప మరేమీ కాదన్నది సైన్స్ వాదన. మరణం తర్వాత ఈ కణాలు పనిచేయవు. చనిపోయిన పది నిమిషాల్లోనే భూమికున్న గురత్వాకర్షణ కారణంగా శరీరంలోని బ్లడ్ మొత్తం అడుగు భాగానికి చేరుకుంటుంది. అప్పుడు ఆ ప్రాంతంలోని చర్మం నీలిరంగులోకి మారుతుంది. చనిపోయిన 3 గంటల తర్వాత శరీరానికి ఎలాంటి ఎనర్జీ సోర్స్ లేకపోవటంతో శరీరంలో కండరాలు బిగిసుకుపోతాయి. 6 గంటల్లో బాడీలోని ఆక్సిజన్ పూర్తిగా కార్బన్ డైయాక్సైడ్‌గా మారిపోతుంది. దాంతో మన శరీరంలోని కణాలు ఒక్కొక్కటి చనిపోవటం మొదలవుతుంది. ఇదంతా సైన్సే చెప్పింది. ఇక్కడ ఎక్కడా ఆత్మ అనే కాన్సెప్ట్‌ లేదు.
అందుకే మరణానంతర జీవితం, ఆత్మ అసాధ్యమని.. ఇదంతా మత పెద్దలు తమ స్వలాభాల కోసం సృష్టించారని సైంటిస్టులు చెబుతుంటారు. అటు మరణాంతరం మనిషి ఏం అవుతాడన్న విషయాల గురించే మతం చెప్పిందని, మరి మిగిలిన జీవులు చనిపోయిన తర్వాత నరకానికి వెళ్తాయా.. స్వర్గానికి వెళ్తాయా అన్నది మాత్రం మతం ఎందుకు చెప్పలేదన్నది సైంటిస్టుల ప్రధాన ప్రశ్న.