Israel-Palestine War: ఇజ్రాయెల్, పాలస్తీనా యుద్ధం తీవ్ర రూపం దాలుస్తోంది. హమాస్ తీవ్రవాదులు ఉన్న గాజా లక్ష్యంగా ఇజ్రాయెల్ ప్రతిదాడులకు దిగుతోంది. ఈ నేపథ్యంలో గాజాలో ఉన్న పౌరులకు ఇజ్రాయెల్ కీలక సూచన చేసింది. 24 గంటల్లోగా గాజా నగరాన్ని విడిచి వెళ్లాలని పౌరులకు సూచించింది. గాజాలో 11 లక్షల మంది పాలస్తీనియన్లు ఉన్నట్లు అంచనా. వీళ్లంతా 24 గంటల్లోగా గాజా ఉత్తర ప్రాంతం నుంచి దక్షిణ ప్రాంతానికి వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఇజ్రాయెల్ ప్రకటనపై ఐక్యరాజ్యసమితి అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఇలా ఒకేసారి పెద్దమొత్తంలో ప్రజలు తరలివెళ్లే క్రమంలో అనేక సమస్యలు, మానవతా సంక్షోభం తలెత్తుతుందని ఐరాస అభిప్రాయపడింది. ఇజ్రాయెల్ తాజా ప్రకటన ద్వారా ఆ దేశ సైన్యమైన ఐడీఎఫ్ గ్రౌండ్ ఆపరేషన్ ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. అంటే ఇప్పటివరకు రాకెట్ లాంఛర్లు, యుద్ధ విమానాలతో దాడి చేసిన ఇజ్రాయెల్.. ఇకపై నేరుగా గాజా భూభాగంపై నుంచి హమాస్ తీవ్రవాదుల్ని మట్టుబెట్టబోతుంది. గాజా ఉత్తర ప్రాంతంలో హమాస్ తీవ్రవాదులు అండర్ గ్రౌండ్ టన్నెళ్లలో దాక్కున్నారు. వాళ్లంతా జనవాసాలు, టన్నెళ్లలో దాక్కుని ఇజ్రాయెల్‌పై దాడి చేస్తున్నారు. వాళ్లను మట్టుబెట్టాలంటే గ్రౌండ్ ఆపరేషనే సరైందని ఇజ్రాయెల్ సైన్యం భావిస్తోంది. పౌరులను గాజా నుంచి పంపించాక.. అణువణువూ గాలించేందుకు ఐడీఎఫ్ సిద్ధమవుతోంది. అందుకే పౌరులు అక్కడ్నుంచి వెళ్లిపోవాలని సూచించింది. సాధారణ ప్రజలకు హమాస్ తీవ్రవాదులు రక్షణ కవచంగా వాడుకుంటున్నారని, వారికి దూరంగా వెళ్లిపోవాలని సూచించింది.
ప్రజలకు ఎలాంటి హానీ కలగకూడదనే ఉద్దేశంతోనే ఈ ఆదేశాలు జారీ చేసినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ఐరాసకు తెలిపింది. కానీ, దీనివల్ల మానవతా సంక్షోభం తలెత్తుతుందని, ఈ ఆదేశాలను వెనక్కు తీసుకోవాలని ఇజ్రాయెల్‌ను ఐరాస కోరింది. ఇంత త్వరగా పౌరులు వెళ్లిపోవడం సాధ్యం కాదని అభిప్రాయపడింది. మరోవైపు ఇజ్రాయెల్ గ్రౌండ్ ఆపరేషన్ చేపట్టినప్పటికీ అనేక సవాళ్లు సైన్యం ముందున్నాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్ సహా వివిధ దేశాల పౌరులను హమాస్ తీవ్రవాదులు బందీలుగా చేసుకున్నారు. ఇజ్రాయెల్ సైన్యం దాడి చేసినప్పుడు వారిని రక్షణ కవచంగా ఉపయోగించుకునే వీలుంది. ఇతర పౌరులకు ఎలాంటి హానీ కలగకుండా.. హమాస్ తీవ్రవాదుల్ని అంతం చేయడం ఇజ్రాయెల్ సైన్యానికి కత్తిమీద సాములాంటిది. ఇక.. శుక్రవారం నాటికి ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం వారం రోజులకు చేరింది.