Israeli Journalist: పెన్ను పట్టిన చేత్తో గన్ను.. ఇజ్రాయెల్‌ సైన్యంలో చేరిన జర్నలిస్ట్‌..

హమాస్‌పై యుద్ధం చేసేందుకు ఇజ్రాయెల్‌ అదనంగా 3 లక్షల రిజర్విస్టులను మళ్లీ సైన్యంలోకి రమ్మని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్‌ ప్రముఖ జర్నలిస్టు హనన్య నఫ్తాలీ తన కుటుంబాన్ని వదిలి దేశం కోసం పోరాడేందుకు సిద్ధపడ్డారు. తన భార్య ఇండియా నఫ్తాలీకి వీడ్కోలు పలికి రణరంగంలోకి దిగారు.

  • Written By:
  • Updated On - October 10, 2023 / 04:31 PM IST

Israeli Journalist: ఇజ్రాయెల్‌ మీద పాలస్తీనా మిస్సైల్స్‌ వర్షం కురుస్తోంది. హమాస్‌ మిలిటెంట్ల దాడిలో వందల సంఖ్యలో ఇజ్రాయెల్ ప్రజలు చనిపోతున్నారు. ప్రస్తుతం ఆ దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు ఇజ్రాయెల్‌ను కాపాడుకోవడం కేవలం సైన్యం బాధ్యత మాత్రమే కాదు. దేశంలో ఉన్న ప్రతీ ఒక్కరి బాధ్యత. అందుకే ఓ ఇజ్రాయెల్‌ జర్నలిస్ట్‌ తన వృత్తిని వదిలి సైన్యంలో చేరాడు. పెన్ను పట్టిన చేతితోనే గన్ను పట్టి దేశాన్ని కాపాడుకునేందుకు వెళ్లాడు. హమాస్‌పై యుద్ధం చేసేందుకు ఇజ్రాయెల్‌ అదనంగా 3 లక్షల రిజర్విస్టులను మళ్లీ సైన్యంలోకి రమ్మని ఆదేశించింది.

ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్‌ ప్రముఖ జర్నలిస్టు హనన్య నఫ్తాలీ తన కుటుంబాన్ని వదిలి దేశం కోసం పోరాడేందుకు సిద్ధపడ్డారు. తన భార్య ఇండియా నఫ్తాలీకి వీడ్కోలు పలికి రణరంగంలోకి దిగారు. కుటుంబాన్ని వీడుతున్న క్షణంలో భావోద్వేగానికి గురవుతున్న ఫొటోను ట్విటర్‌లో షేర్‌ చేశారాయన. నా దేశం కోసం పోరాడేందుకు నేను సిద్ధమయ్యాను. కేవలం సరిహద్దు కోసమే కాకుండా ఎన్నో వేల కుటుంబాల కోసం పోరాడుతున్నాను. నా భార్య ఇండియా నఫ్తాలీకి గుడ్‌బై చెప్పి యుద్ధానికి వచ్చాను. ఇక నుంచి నా ఖాతాను ఆమె నిర్వహిస్తుంది అంటూ హనన్య పోస్టు చేశారు. ఇండియా నఫ్తాలీ కూడా జర్నలిస్టే. అక్కడ జరుగుతున్న దాడుల గురించి ఆమె సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ ఇస్తున్నారు.

మరోవైపు యుద్ధానికి వెళుతున్న ఓ తండ్రి తాను త్వరలో తిరిగి వస్తానంటూ తన కుమారుడికి ప్రమాణం చేస్తున్న ఫొటోను ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ షేర్‌ చేసింది. ఎంతో మంది హృదయాలను కదిలిస్తోంది ఆ పోస్ట్‌. కాగా ప్రస్తుతం ఇజ్రాయెల్‌, పాలస్తీనా మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇరు దేశాల్లో ఇప్పటికే వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వేల మంది నిరాశ్రయులయ్యారు. ప్రాణాలు కాపాడుకునేందుకు బేస్‌మెంట్లలో దాక్కుంటున్నారు. ఇక కొందరు మిలిటెంట్లు చేసే అరాచకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. మారుమూల ప్రాంతాల్లో దాక్కున్నవాళ్లను కూడా బయటికి లాగి చంపుతున్నారంటూ కొందరు బాధితులు చెప్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్‌లో సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు.