Embryo Models: మానవ పిండం ఏర్పడాలంటే శుక్రకణాలు, అండం కలవాలి. ఈ రెండింటి కలయికతోనే పిండం ఏర్పడుతుంది. అయితే, ఈ రెండూ లేకుండానే ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు పిండాన్ని అభివృద్ధి చేశారు. పిండం, శుక్రకణాల అవసరం లేకుండానే, మూలకణాల (స్టెమ్ సెల్స్) సాయంతో పిండాన్ని పోలిన నమూనాను అభివృద్ధి చేసినట్లు ఇజ్రాయెల్‌కు చెందిన వీజ్మాన్ ఇనిస్టిట్యూట్ శాస్త్రవేత్తలు తెలిపారు. అది కూడా గర్భం వెలుపల కావడం విశేషం.
14 రోజుల వయస్సున్న పిండం ఎలా ఉంటుంటో.. దాదాపు అదే తరహా పిండాన్ని శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ దశలో పిండానికి ఉండాల్సిన అన్ని నిర్మాణాలు ఈ కృత్రిమ పిండానికి ఉన్నాయన్నారు. ఇలా రూపొందించడం ప్రపంచంలో ఇదే మొదటిసారి. ఇది పూర్తిస్థాయిలో విజయవంతమైతే.. మానవ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలైనట్లే అని పరిశోధకులు అంటున్నారు. నిజానికి శాస్త్రవేత్తలకు ఇలా 14 రోజుల వరకు మాత్రమే కృత్రిమంగా పిండాలను పెంచే అనుమతి ఉంది. అందువల్ల శాస్త్రవేత్తలు 14 రోజుల పిండాన్ని మాత్రమే రూపొందించారు. ఆ తర్వాత కూడా పిండం ఎదిగితే, అచ్చం మనిషిలాగే అన్ని అవయవాల్ని ఏర్పర్చుకుంటుందా.. లేదా.. అన్నదే సందేహం. ఈ ప్రయోగాలు ప్రభుత్వ అనుమతులకు లోబడి, నైతిక విలువలు పాటిస్తూ చేస్తున్నట్లు పరిశోధకుల బృందం తెలిపింది. శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ పిండం హార్మోన్లను కూడా విడుదల చేసింది. ల్యాబ్‌లో జరిపిన ప్రెగ్నెన్సీ టెస్టులో పాజిటివ్ రిజల్ట్ చూపించింది.
మానవ పుట్టుకలోని తొలి క్షణాలను అర్థం చేసుకునే ఉద్దేశంతో ఈ పిండాల నమూనాలను రూపొందిస్తున్నారు. సాధారణంగా.. అండంతో వీర్యం ఫలధీకరణం చెందిన తర్వాత వచ్చే మొదటి వారాలను అభివృద్ధిలో అనేక పరిణామాలు జరిగే కాలంగా పరిగణిస్తారు. గర్భస్రావం, పుట్టుకలో లోపాలు వంటివి ఈ సమయంలోనే మొదలవుతాయి. అయితే, ఇంకా దీని గురించి పూర్తిగా అర్థం చేసుకోలేదు. ఈ అంశంపై ప్రస్తుతం తమకు పరిమిత జ్ఞానమే ఉందని వీజ్‌మన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌కు చెందిన ప్రొఫెసర్ జాకబ్ హన్నా తెలిపారు.
ఈ ప్రయోగాల్ని మరింత విజయవంతం చేయడం ద్వారా కొన్ని పిండాలు ఎందుకు విఫలమవుతాయనే అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. దీనివల్ల ఐవీఎఫ్ విజయవంతమయ్యే రేటు పెరిగే అవకాశం కూడా ఉంది. వీజ్మాన్ ఇనిస్టిట్యూట్ శాస్త్రవేత్తలు తయారు చేసిన పిండం నమూనాలు చాలా సహజంగా ఉన్నాయని, బాగా కనిపిస్తున్నాయని ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్‌స్టిట్యూట్ ప్రొఫెసర్ లావెల్ బ్యాడ్జ్ అన్నారు. అయితే, ప్రస్తుతం ఉన్న 99 శాతంగా ఉన్న వైఫల్య రేటును మెరుగపరచాలన్నారు. ఈ పిండపు నమూనాలు సరిగా పనిచేయకపోతే గర్భస్రావాలు, సంతానలేమి వంటివి ఎందుకు వస్తాయో అర్థం చేసుకోలేమని ఆయన అన్నారు.