Gaganyaan Mission: ‘మిషన్‌ గగన్‌యాన్‌’ కీలక పరీక్షకు ఇస్రో సిద్ధం..

భారత తొలి మానవసహిత అంతరిక్ష మిషన్‌ 'గగన్‌యాన్‌' కీలక పరీక్షకు సిద్ధమవుతోంది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు సంబంధించి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో కీలక అప్‌డేట్‌ ఇచ్చింది. మానవరహిత ఫ్లైట్‌ టెస్టులను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.

  • Written By:
  • Publish Date - October 7, 2023 / 05:38 PM IST

Gaganyaan Mission: చంద్రయాన్‌-3, ఆదిత్య ఎల్‌-1తో భారత ఖ్యాతిని అగ్రభాగాన నిలిపిన ఇస్రో.. ఇప్పుడు మరో మిషన్‌కు సిద్ధమైంది. భారత తొలి మానవసహిత అంతరిక్ష మిషన్‌ ‘గగన్‌యాన్‌’ కీలక పరీక్షకు సిద్ధమవుతోంది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు సంబంధించి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో కీలక అప్‌డేట్‌ ఇచ్చింది. మానవరహిత ఫ్లైట్‌ టెస్టులను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. క్రూ ఎస్కేప్ వ్యవస్థ పనితీరును ప్రదర్శించే తొలి టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్-1 ప్రయోగానికి ఏర్పాట్లు సాగుతున్నాయని తెలిపింది.

అత్యవసర పరిస్థితుల్లో రాకెట్‌ నుంచి ఆస్ట్రోనాట్‌లతో కూడిన క్రూ మాడ్యుల్‌ను సురక్షిత దూరానికి తీసుకెళ్లడంలో ‘క్రూ ఎస్కేప్ సిస్టమ్‌’ సహాయపడుతుంది. ‘టీవీ-డీ1’ ప్రయోగంలో ఉపయోగించనున్న ప్రెజర్‌లెస్‌ ‘క్రూ మాడ్యుల్‌’ ఫొటోలను ఇస్రో రిలీజ్‌ చేసింది. ఈ క్రూ మాడ్యుల్‌.. అసలైన క్రూ మాడ్యుల్‌ పరిమాణం, బరువు, సంబంధిత వ్యవస్థలనే కలిగి ఉంటుంది. క్రూ మాడ్యుల్‌, క్రూ ఎస్కేప్‌ వ్యవస్థలతో కూడిన పేలోడ్‌లను.. రాకెట్‌ సాయంతో నింగిలోకి ప్రయోగిస్తారు. ఈ రాకెట్‌ ఆరోహణ దశలో గంటకు 1481 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న టైంలో.. ఎమర్జెన్సీ పరిస్థితిని కల్పిస్తారు. ఈ క్రమంలోనే భూమికి దాదాపు 17 కిలోమీర్ల ఎత్తులో స్పేస్‌షిప్‌ నుంచి క్రూ మాడ్యుల్‌ విడిపోయి.. పారాషూట్ల సాయంతో శ్రీహరికోట తీరానికి 10 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో దిగేలా ఏర్పాట్లు చేశారు. ప్రయోగం తరువాత ఇండియన్‌ నేవీ ఫోర్స్‌ దాన్ని రికవర్‌ చేస్తుంది. క్రూ మాడ్యుల్‌తో కూడిన ఈ ప్రయోగం గగన్‌యాన్ మిషన్‌ రిహార్సల్స్‌లో ఓ కీలక ఘట్టంగా చెప్తున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు.

ఈ ఫ్లైట్‌ టెస్ట్‌లో.. దాదాపు పూర్తయిన గగన్‌యాన్‌ వ్యవస్థలనే వినియోగిస్తున్నారట. ఈ ప్రయోగం సక్సెస్‌ అయితే.. గగన్‌యాన్‌ ప్రయోగం దిశగా మిగిలిన ఎలిజిబిలిటీ టెస్టులు, మానవరహిత మిషన్‌లకు రంగం సిద్ధమవుతుందని తెలిపింది. ఇదిలా ఉండగా.. గగన్‌యాన్‌లో వినియోగించే అసలైన క్రూ మాడ్యుల్‌.. ప్రస్తుతం అభివృద్ధి దశల్లో ఉంది. టెస్ట్‌ వెహికల్‌ సైతం చివరి దశలో ఉంది. ‘టీవీ-డీ1ను ఈ నెలాఖరులో పరీక్షించే అవకాశం ఉంన్నట్టు తెలుస్తోంది. చంద్రయాన్‌-3, ఆదిత్య-ఎల్‌ 1 ప్రయోగాల తర్వాత ఇస్రో అధికారులు గగన్‌యాన్‌ను విజయవంతం చేయడంపై దృష్టి సారించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఇద్దరు లేదా ముగ్గురిని భూమికి దాదాపు 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలోకి తీసుకెళ్తారు. ఒకటి నుంచి మూడు రోజులపాటు వారిని అక్కడే ఉంచి తిరిగి భూమి మీదకు తీసుకొస్తారు. ఈ ప్రయోగం కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.