Justin Trudeau: కెనడా ప్రధాని ట్రూడో మరో తప్పిదం.. నాజీ సైనికుడికి పార్లమెంటులో సత్కారం..!

హిట్లర్‌తో కలిసి యూదులపై మారణకాండకు పాల్పడ్డ నాజీ సైనికుడిని పార్లమెంట్ సాక్షిగా గౌరవించాడు జస్టిన్ ట్రూడో. రెండో ప్రపంచ యుద్ధంలో, హిట్లర్ సైన్యంలో కీలక బాధ్యతలు పోషించిన 98 ఏళ్ల యారోస్లోవ్ హంకాను కెనడా పార్లమెంటుకు ఆహ్వానించాడు జస్టిన్ ట్రూడో. అక్కడ, అతడికి కెనడా పార్లమెంట్ ఘన స్వాగతం పలికింది.

  • Written By:
  • Publish Date - September 25, 2023 / 02:52 PM IST

Justin Trudeau: భారత్‌తో వైఖరి విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరో వివాదంలో చిక్కుకున్నాడు. హిట్లర్‌తో కలిసి యూదులపై మారణకాండకు పాల్పడ్డ నాజీ సైనికుడిని పార్లమెంట్ సాక్షిగా గౌరవించాడు జస్టిన్ ట్రూడో. రెండో ప్రపంచ యుద్ధంలో, హిట్లర్ సైన్యంలో కీలక బాధ్యతలు పోషించిన 98 ఏళ్ల యారోస్లోవ్ హంకాను కెనడా పార్లమెంటుకు ఆహ్వానించాడు జస్టిన్ ట్రూడో. అక్కడ, అతడికి కెనడా పార్లమెంట్ ఘన స్వాగతం పలికింది.

ఈ కార్యక్రమంలో యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ కూడా పాల్గొన్నాడు. జెలెన్‌స్కీ ప్రసంగం అనంతరం హంకాను స్వయంగా స్పీకర్ ఆంటోనీ రోటా పార్లమెంటుకు పరిచయం చేశారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో రష్యా నుంచి యుక్రెయిన్‌కు స్వేచ్ఛ అందించడానికి పోరాడిన సైనికుడు అంటూ స్పీకర్ హంకాను ప్రశంసించారు. ఈ సందర్భంగా జస్టిన్ ట్రూడో, జెలె‌న్‌ స్కీ సహా పార్లమెంట్ సభ్యులంతా లేచి, నిలబడి చప్పట్లు కొట్టారు. అనంతరం హంకాకు జెలెన్‌ స్కీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. హంకాను పార్లమెంట్ సాక్షిగా గౌరవించడమే ఇప్పుడు వివాదానికి కారణమైంది. హంకా హిట్లర్ సైన్యంలో 14వ వాఫన్ గ్రనేడియర్ డివిజన్‌కు చెందిన సైనికుడు. ఈ డివిజన్ సైనికులే యూదులపై హత్యాకాండకు పాల్పడ్డారు. అంటే అప్పట్లో యూదులను చంపిన వారిలో హంకా కూడా ప్రముఖ పాత్ర పోషించాడు. తర్వాతి కాలంలో ఈ సైనికులను క్రిమినల్స్‌గా పరిగణించేవాళ్లు. అలాంటి సైనికుడిని పార్లమెంట్ సాక్షిగా సన్మానించడం వివాదానికి దారితీసింది.

చివరకు తప్పు తెలుసుకొని స్పీకర్ ఆంటోని క్షమాపణలు చెప్పారు. హంకా ఎవరో, అతడి గత చరిత్ర ఏంటో తనకు తెలియదన్నారు. ఈ అంశంపై విమర్శలు వెల్లువెత్తడంతో ప్రధాని ట్రూడో కార్యాలయం కూడా క్షమాపణలు కోరింది. జరిగిన పొరపాటుకు చింతిస్తున్నట్లు తెలిపింది. ఈ అంశంపై యూదుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే తొందరపాటుతో ఇండియాపై అనవసర ఆరోపణలు చేస్తూ విమర్శలు ఎదుర్కొంటున్న ట్రూడోపై తాజాగా మరింతగా విమర్శల దాడి పెరిగింది. అపరిపక్వతతో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కెనడా ప్రతిపక్షాలు కూడా ట్రూడో తీరుపై మండిపడుతున్నాయి.