KCR: హిప్ రీప్లేస్‌మెంట్ సర్జరీ చేయించుకున్న బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ ఆస్పత్రి నుంచి శుక్రవారం డిశ్చార్జ్ కానున్నారు. ప్రస్తుతం ఆయన సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆపరేషన్ చేయించుకున్న కేసీఆర్.. ఆరు రోజుల నుంచి ఆస్పత్రిలోనే, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. సర్జరీ అనంతరం నెమ్మదిగా కోలుకుంటున్న కేసీఆర్.. తన రూమ్‌లో వాకర్ సాయంతో డాక్టర్ల పర్యవేక్షణలో నడుస్తున్నారు.
కేసీఆర్‌కు ప్రస్తుతం ఆపరేషన్ నొప్పి తగ్గి, సాధారణ నొప్పి మాత్రమే ఉందని వైద్యులు తెలిపారు. ఆయన శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉన్నారని చెబుతున్నారు. సాధారణ డైట్ తీసుకుంటున్నారని చెప్పారు. కేసీఆర్ త్వరగా కోలుకునేందుకు బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్‌లు కూడా చేయిస్తున్నామన్నారు. సర్జరీ నేపథ్యంలో కొన్ని రోజులు ఫిజియోథెరపీ కొనసాగించాల్సి ఉంటుందని వెల్లడించారు. శరీరం ఇట్లాగే సహకరిస్తే ఆయన వేగంగా కోలుకుని, సొంతంగా నడిచే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు. ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుండటంతో ఇక ఆస్పత్రిలో ఉండాల్సిన అవసరం లేదని డాక్టర్లు భావిస్తున్నారు. దీంతో ఆయనను శుక్రవారం డిశ్చార్జ్ చేయాలని వైద్యులు నిర్ణయంచారు. కొద్ది రోజుల క్రితం ప్రగతి భవన్ ఖాళీ చేసిన కేసీఆర్ ఫాం హౌజ్‌లో గాయపడ్డారు. డిశ్చార్జ్ అనంతరం కూడా అక్కడికే వెళ్లాల్సి ఉంది.
కానీ, ఇంకా కేసీఆర్‌కు వైద్య సేవలు, తరచూ పరీక్షలు, పర్యవేక్షణ అవసరం. అందువల్ల ఫాం హౌజ్‌లో ఉంటే.. ఈ సేవలకు ఇబ్బంది కలుగుతుందని భావించి, హైదరాబాద్‌లోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం నందినగర్‌లోని ఇంటిని యుద్ధప్రాతిపదికన బాగు చేసినట్లుగా తెలుస్తోంది. కేసీఆర్ పూర్తిగా కోలుకునే వరకు నగరంలోనే ఉంటారు. మరోవైపు ఆస్పత్రిలో కేసీఆర్‌ను పరామర్శించేందుకు పెద్ద ఎత్తున ప్రముఖులు వస్తున్నారు. వారితో యశోదాలో రోగులకు ఇబ్బంది ఎదురవుతోంది. దీంతో తనకోసం అభిమానులు ఎవరూ రావొద్దని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.