KERALA: ఓనం పండుగ రోజు కేరళ రాష్ట్రం మద్యం మత్తులో మునిగి తేలింది. రాష్ట్రంలో పెద్ద పండగ కావడంతో కేరళీయులు తెగ తాగేశారు. దీంతో రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో మద్యం అమ్ముడుపోయింది. మద్యం విక్రయాల ద్వారా పది రోజుల్లోనే ఏకంగా రూ.759 కోట్లు ప్రభుత్వ ఖజానాకు సమకూరింది. అంతేకాదు ఆగస్టు 2023లో కేరళలో మొత్తం రూ.1799 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. గతేడాది పండగ సీజన్‌తో పోలిస్తే ఈ ఏడాది 8.5 శాతం సేల్స్ పెరిగాయని కేరళ స్టేట్ బెవరేజ్ కార్పొరేషన్ తెలిపింది.
ఓనం పండుగ రోజున రూ.116 కోట్ల మద్యం విక్రయాలు నమోదయ్యాయి. నిధుల కొరతతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఓనం పండుగ కలిసొచ్చినట్లైంది. కేరళలో మొత్తం 269 మద్యం విక్రయ కేంద్రాలుండగా.. అందులో ఒకటైన మలప్పురం జిల్లాలోని తిరూర్లోని బెవ్‌కో అవుట్‌లెట్‌లో అత్యధిక విక్రయాలు జరిగాయి. ఇక త్రిసూర్ జిల్లాలో ఇరింజలకుడ మద్యం అమ్మకాల్లో రెండో స్థానంలో నిలిచింది. కేరళకు చెందిన ప్రముఖ రమ్ బ్రాండ్ ‘జవాన్’ 10 రోజుల్లో 70 వేల కేసులు అమ్ముడయ్యాయి. ఓనంకు ఒక రోజు ముందు.. అత్యధికంగా మద్యం అమ్మకాలు జరిగినట్లు బెవరేజెస్ కార్పొరేషన్ డేటా రిలీజ్ చేసింది.
ఆ ఒక్క రోజే 6 లక్షల మందికి పైగా బెవ్‌కో అవుట్‌లెట్‌ల నుంచి రూ.120 కోట్ల విలువైన మద్యాన్ని కొనుగోలు చేశారట. ఇక ఇరింజలకుడ ఔట్‌లెట్‌లో అత్యధికంగా రూ.1 కోటి 6 లక్షలు, కొల్లాంలోని ఆశ్రమం బెవ్‌కో ఔట్‌లెట్‌లో కోటి రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి.