ఆసుపత్రే కళ్యాణమండపం అయితే.. ట్రీట్మెంట్ తీసుకుంటున్న బెడ్ పెళ్లిపీటలైతే.. డాక్టర్లు, నర్సులు వివాహానికి ముఖ్య అతిథులైతే..పెద్దల ఆశీర్వచనాలే వేదమంత్రాలైతే.. చుట్టూ పేషంట్ల చప్పట్లే మంగళ వాయిద్యాలైతే.. చాలా ఆశ్చర్యంగా ఉందికదూ.
ఇలాంటి సంఘటనే మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. మంచి మహూర్తాన మనువాడాలని నిశ్చయించుకున్నారు యువ జంట. వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టేందుకు కావల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. సరిగ్గా రేపు పెళ్లి అనగా ఒకరోజు ముందు తీవ్ర అస్వస్థతకు గురైంది వధువు. దీంతో గత్యంతరం లేక హుటాహుటిన దగ్గర్లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. వెంటనే చికిత్స చేసి ఆమెను కాపాడారు డాక్టర్లు.
సీన్ కట్ చేస్తే.. అసలే వారిది నిరుపేద కుటుంబం. అందులోనూ నేటి సమాజంలో పెళ్లంటే మాటలు కాదు. మూటలు కావల్సిందే. పైగా ప్రస్తుతం మ్యారేజ్ సీజన్ అయిపాయే. మళ్లీ ఇవన్నీ సరిగ్గా కుదరాలంటే చాలా కష్టం అని భావించిన వరుడు ఆసుపత్రిలోనే పెళ్లికి సిద్ధమన్నాడు. అంతే.. బంధుమిత్రులు, ఆసుపత్రి సిబ్బంది నడుమ పెళ్లి జరిగిపోయింది. సాధారణంగా పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయించబడతాయి అంటారు. కానీ ఇక్కడ అలా జరగలేదు. వైద్యశాలలో జరిగేలా నిర్ణయించబడింది. విధిరాసిన వక్రరాతను చెరిపేసి వరుడే తన కళ్యాణ గీతను రాసుకున్నాడు.
దీనిపై స్పందించిన ఆసుపత్రి సిబ్బంది వారి కష్టపరిస్థితులను చెప్పుకొచ్చారు. అందుకే ఇలా కళ్యాణం జరిపేందుకు అనుమతిచ్చామన్నారు. పెద్దమనసుతో ఆలోచించి ఈ జంట ఒక్కటి అయ్యేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. వధూవరుల కుటుంబ సభ్యులు ఆసుపత్రి రుణం తీర్చుకోలేనిదని చెప్పారు. తమ చెల్లికి ప్రాణంపోసి, పెళ్లి చేసి నవజీవనాన్ని అందించారని తమ అంతరంగాన్ని ఆవిష్కరించారు.
తరతరాలకూ సందేశాన్నిచ్చేలా చెరిగిపోని విధంగా నూతన అధ్యాయాన్ని లిఖించి ఆదర్శంగా నిలిచింది ఈ జంట.
T.V.SRIKAR