Marriages in China: సోలో బతుకే సో బెటర్.. పెళ్లిళ్లు వద్దంటున్న చైనా యువత.. అసలు కారణం అదేనా..?

చైనాలో జనాభా తగ్గడానికి కారణం నేటి యువత ఆలోచనలే. ఇప్పటి తరం పెళ్లిళ్లు చేసుకోవడానికి, పిల్లల్ని కనడానికి ఆసక్తి చూపడం లేదు. ఒక రిలేషన్‌లో ఇబ్బంది పడుతూ ఉండటం కంటే సోలోగా బతకడమే బెటర్ అనే నిర్ణయానికొచ్చింది నేటి యువత. అందులోనూ యువత సోలోగా బతకాలని నిర్ణయం తీసుకోవడం వెనుక కూడా బలమైన కారణాలున్నాయి.

  • Written By:
  • Publish Date - July 1, 2023 / 04:45 PM IST

Marriages in China: చైనాలో యువతరం పెళ్లిళ్లపై ఆసక్తి చూపడం లేదు. నేటి తరం ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడుతోంది. అయితే, దీనికి బలమైన కారణాలున్నాయి. అవి నేటి యువతరాన్ని ఆందోళనలో పడేస్తున్నాయి. దీంతో పెళ్లి చేసుకోవడంకన్నా సోలో బతుకే సో బెటర్ అంటూ గడిపేస్తున్నారు. వీళ్లను చూసి ఇటు పేరెంట్స్.. అటు ప్రభుత్వం ఆందోళన చెందుతోంది.
ఒకప్పుడు జనాభాలో ప్రపంచ నెంబర్ వన్‌గా ఉన్న చైనాను ఇప్పుడు ఇండియా బీట్ చేసే స్థాయికి చేరింది. ఇండియాలో జనాభా పెరుగుతుంటే చైనాలో తగ్గిపోతోంది. దీనిపై చైనా ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. జనాభా పెరుగుదలను ప్రోత్సహించే కార్యక్రమాలు చేపడుతోంది. కొత్తగా పెళ్లైన జంటలకు, పిల్లలు పుట్టిన దంపతులకు వీలైనన్ని సెలవులు ఇస్తోంది. ఆర్థిక సాయం ప్రకటిస్తోంది. ఇతర రాయితీలు అందించేందుకు కూడా సిద్ధమైంది. చైనాలో జనాభా తగ్గడానికి కారణం నేటి యువత ఆలోచనలే. ఇప్పటి తరం పెళ్లిళ్లు చేసుకోవడానికి, పిల్లల్ని కనడానికి ఆసక్తి చూపడం లేదు. ఒక రిలేషన్‌లో ఇబ్బంది పడుతూ ఉండటం కంటే సోలోగా బతకడమే బెటర్ అనే నిర్ణయానికొచ్చింది నేటి యువత. అందులోనూ యువత సోలోగా బతకాలని నిర్ణయం తీసుకోవడం వెనుక కూడా బలమైన కారణాలున్నాయి.
లేటెస్ట్ వీడియోలతో మొదలైన చర్చ
చైనాలో వివాహబంధాలు ఎక్కువగా నిలబడటం లేదు. చాలా పెళ్లిళ్లు త్వరగానే పెటాకులవుతున్నాయి. గృహహింస, విడాకుల కేసులు ఇటీవల బాగా పెరిగిపోయాయి. చాలా మంది భర్తలు, తమ భార్యలపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నారు. వీటితోపాటు కొందరు తమ జీవిత భాగస్వామిని హత్య కూడా చేస్తున్నారు. అలాగే ఆడవాళ్లు కూడా తమ భర్తపై వేధింపులకు పాల్పడుతున్నారు. ఇవన్నీ యువతపై దుష్ప్రభావం చూపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పెళ్లి చేసుకుని, జీవిత భాగస్వామితో ఇబ్బంది పడటంకంటే సింగిల్‌గా ఉండటమే బెటర్ అని చాలా మంది భావిస్తున్నారు. ముఖ్యంగా యువతులు పెళ్లి అంటేనే భయపడిపోతున్నారు. ఇటీవల ఒక వ్యక్తి తన భార్యను కారుతో ఢీకొట్టి చంపాడు. ఒక్కసారి కాదు.. అనేకసార్లు తన భార్యను ఢీకొట్టి చంపేశాడు. ఈ ఘటన అక్కడి సీసీ కెమెరాలో రికార్డు కాగా అది వైరల్ అయింది. ఇలాంటి ఘటనలో రెండు వారాల్లో ఇంకొన్ని జరిగాయి. వీటికి సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. దీంతో భార్యలపై భర్తలు పాల్పడుతున్న హింసకు సోషల్ మీడియాలో అధిక ప్రాధాన్యం దక్కింది. దీనిపై తీవ్ర చర్చే జరిగింది. ఇలాంటి కఠినమైన రిలేషన్స్‌లో ఉండటంకంటే ఒంటరిగా ఉండిపోవడమే మేలని ఎక్కువ మంది యువత అభిప్రాయపడ్డారు.
ఆర్థిక సమస్యలు మరో కారణం
చైనాలో కుటుంబ పోషణ భారంగా మారింది. పిల్లల్ని పెంచడం, చదివించడం, వైద్య ఖర్చులు, ఇతర అవసరాలకు సంబంధించిన ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. వీటిని భరించే స్థితిలో అక్కడి యువత లేదు. పెళ్లి చేసుకుని, పిల్లల్ని కని, ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదని చాలా మంది అనుకుంటున్నారు. ఆర్థికంగా బలంగా లేనప్పుడు వైవాహిక జీవితం సరికాదని భావిస్తున్నారు. అసలే నిరుద్యోగం పెరిగిపోయింది. అన్ని ఖర్చులు పెరిగాయి. దీనికి తగ్గట్లు ఆదాయం మాత్రం ఉండటం లేదు. ఈ కారణంతో కూడా చాలా మంది పెళ్లిపై విముఖత చూపుతున్నారు.
గృహ హింస, వేధింపులు
చైనాలో స్త్రీలపై అనేక వేధింపులు ఎక్కువయ్యాయి. గృహహింస ఘటనలు పెరుగుతున్నాయి. ఇవన్నీ భరించడం కంటే భర్త నుంచి విడాకులు తీసుకుందామని కోర్టును ఆశ్రయిస్తే.. దీన్ని సాకుగా చూపి భర్తలు మరిన్ని వేధింపులకు పాల్పడుతున్నారు. విడాకులకు దరఖాస్తు చేసుకున్నా, కేసు పెట్టినా కూడా దాడులకు పాల్పడుతున్నారు. వీటిని భరించలేని చాలామంది విడాకులు తీసుకోవాలని ఆశిస్తున్నారు. పెళ్లైన ఈ మహిళల గురించి తెలుసుకుంటున్న యువతులు పెళ్లంటేనే భయపడిపోతున్నారు. అక్కడి చట్టం కూడా యువతుల ఆందోళనకు కారణమే. గతంలో భార్యాభర్తల మధ్య గొడవలు, గృహహింస వంటి వాటిని వ్యక్తిగతమైన, కుటుంబ పరమైన అంశాలుగా మాత్రమే చూసేవాళ్లు. ఈ విషయంలో ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తం కావడంతో 2016లో యాంటీ డొమెస్టిక్ వయొలెన్స్ చట్టాన్ని రూపొందించారు. ఇది కొంతవరకు మహిళలకు ఉపయోగపడుతోంది. చట్టం సరిగ్గా పని చేయకపోవడం కూడా మహిళలపై వేధింపులు పెరిగేందుకు కారణమవుతోంది. విడాకులకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ కోర్టులు వివిధ కారణాలతో విడాకులు మంజూరు చేయడం లేదు. కొన్నిసార్లు ఆలస్యం చేస్తున్నాయి. దీంతో వేధింపులు ఇంకా పెరుగుతున్నాయి.
గృహ హింస, ఆర్థిక సమస్యలు, విడాకులు త్వరగా రాకపోవడం వంటి ఇబ్బందులు ఉండటంతో యువతరం పెళ్లికి దూరంగా ఉండేందుకే ఆసక్తి చూపుతోంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్రభుత్వాలు చేస్తున్న చర్యలు కూడా సత్ఫలితాల్నివ్వడం లేదు.