Trans Gender Marriage: ప్రేమకు జండర్ తో పనిలేదు.. పిల్లలు కావాలంటే పెళ్లితో సంబంధంలేదు.. ఈ రెండింటికి సమాధానమే వీరి మూడుముళ్ల బంధం..

ఒకప్పుడు టీ అంటే రంగు, రుచి, వాసన అని ఒక యాడ్ వచ్చేది. టీ అంటే ఇన్ని ఉండాలి అని చెప్పేందుకు సంకేతం. మరి ప్రేమంటే.. రంగు, స్థాయి, కులం, మతం, వర్గం, గోత్రం, ప్రాంతం, హోదా ఇవన్నీ అక్కర్లేదని గతంలో చాలా మంది చెప్పేశారు. వాటిని నిజం కూడా చేసి చూపించారు. అయితే ఇప్పుడు చెప్పబోయే జంట లింగం కూడా ఉండదని రుజువుచేశారు. అదేంటి అనే సందేహం మీలో కలుగవచ్చు. అన్ని సందేహాలకు ఒక్కటే పరిష్కారం ఈ ట్రాన్స్ జండర్ మ్యారేజ్ స్టోరీ చదివేయడం.

  • Written By:
  • Publish Date - June 6, 2023 / 07:45 PM IST

ట్రాన్స్ జెండర్లు ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకోవడం చూశాం. పిల్లలు కనడం కూడా కేరళాలో జరిగిన ఉదంతానికి ధీటైన ఉదాహరణ. ఇక వీరి విషయానికి వస్తే.. సాధారణంగా ప్రేమ అనేది ఇక్కడ ఫలానా చోట పుడుతుంది అని చెప్పలేం. అలా చెబితే అది ప్రేమేకాదంటారు ప్రేమికులు. ఎందుకంటే ప్రాంతం చూసో, వాతావరణం అనుకూప్రతికూలాలు చూసుకొనో, ముహూర్తాలను బట్టి ప్రేమ పుట్టదు. ఉదయం పాల ప్యాకేట్ కోసం చిన్న టైట్ షాట్ లో నిద్రమత్తులో బయటకు వెళ్లే అబ్బాయికి.. అప్పుడే లంచ్ బాక్స్ పట్టుకొని పనికి హడావిడిగా వెళ్లే అమ్మాయి ఎదురయి చూడంగానే ఎదలో మ్యూజిక్ స్టార్ట్ అవ్వచ్చు. అదే ప్రేమంటే. అచ్చం ఇలాగే జరిగింది ఈ ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న జంటకి.

అతని పేరు రాజ్, ఆమె పేరు అంకిత. ఇందులో ఎవరు ట్రాన్స్ అని జండర్ ని గుర్తించడం చాలా కష్టం. అలా ఉంటుంది వీళ్ల ఈడు జోడు. రాజ్ ఒక రోజు టీ కొట్టు దగ్గర చాయ్ తాగేందుకు వెళ్లాడు. అక్కడ అంకిత అనే స్త్రీ వేషధారిణి కనిపించింది. అంతే ఆ అందానికి ముగ్ధుడై పోయాడు మనోడు రాజ్. తను ఎవరు, ఏం చేస్తుంది అనే విషయాలు ఏవీ పట్టించుకోలేదు ప్రేమించేశాడు. ఆతరువాత వారిద్దరి తొలి పరిచయంలో రెండు నిమిషాల మాట మంతి కలిసింది. అప్పుడు అర్థమైంది రాజ్ కి.. అంకిత ట్రాన్స్ ఉమెన్ అనే విషయం. అయితే ఈ విషయం తెలియక ముందు ప్రేమించాడు. ఇప్పుడు వదిలేస్తాడా..? ఇతగాడు పుష్ప సినిమా బాగా చూసినట్లు ఉన్నాడు. తగ్గేదేలే అంటూ అడుగులు కాస్తా ప్రేమ పరుగులుగా మార్చేశాడు. పరిణయ తీరం చేరుకున్నాడు.

అసలు ఎవరు వీరిద్దరు. వీరిది ఏ ఊరు, ఏం చేస్తూ ఉంటారు అనే ఆసక్తికలుగుతుంది కదూ. ఇప్పుడు అక్కడికే వచ్చేద్దాం. చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి అంకిత తూర్పుగోదావరిలోని ఏలూరు జిల్లాలో తండ్రి చనిపోయిన కుటుంబానికి చెందిన.. ఇద్దరు అక్కలతో జీవనం సాగించే మిడిల్ క్లాస్ అమ్మాయి. ఈమె జీవనం నాని సినిమా ఎంసీఏ అయినప్పటికీ చదివింది మాత్రం ఎంబీఏ. తన సిస్టర్స్ పెళ్లిళ్లు అయ్యాక అంకిత్ కాస్త అంకితగా మారాలనుకుంది. తాను అంకితగా మారితే ఆ ప్రభావం తన అక్కల మీద ఎక్కడ పడుతుందో అన్న భవిష్యత్ ఆలోచనతో తన భావాలను అణిచి పెట్టుకుంది. ఒకానొక రోజు తనకు పెళ్లి సంబంధాలు చూసే ప్రయత్నంలో ఉండగా అమ్మకు చెప్పేసింది తన మనసులోని విషయం. దీనికి ఇంట్లో పెద్దలు నిరాకరించారు. సీన్ కట్ చేస్తే స్త్రీగా మారేందుకు అవసరమైన డబ్బుల కోసం హైదరాబాద్ వచ్చి బిక్షాటన చేసి బ్రతుకు బండిలాగేది. కొన్ని రోజులకు పూర్తి ట్రాన్స్ గా సర్జరీస్ అన్నీ తన సొంత డబ్బులతోనే చేయించుకుంది. ఇలా ఆపరేషన్స్ అన్నీ అయిపోయాక షాప్ ఓపెనింగ్స్ చేసుకుంటూ జీవనం సాగించేది. మాతృమూర్తి తల్లి గా మారేందుకు నవమాసాలు కష్ట పడితే.. ఈ అంకిత స్త్రీ మూర్తిగా మారేటందుకు పదకొండు నెలలు తీవ్ర అవమానాలు, ఆకతాయి వేధింపులు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది.

ఇక అబ్బాయి రాజ్ విషయానికొస్తే అతని మనసు మహారాజు అనే చెప్పాలి. ఇతనికి మంచి వ్యాపారం ఉంది. బ్రతికేటందుకు, తినేటందుకు ఏలాంటి లోటూ లేదు. ఇతనికి తల్లి, ఒక చెల్లి ఉన్నారు. తన చెల్లి పెళ్లి కోసం వీరిద్దరి పెళ్లి కొన్ని రోజులు వాయిదా వేసుకున్నారు. అదే సమయంలో ట్రాన్స్ అని తెలిసి ప్రేమించడం తనతో షాపింగ్ కి వెళ్లడం ఇలా సరదాగా సాగేది. అలా సరదాలో కొంత సమాజ పోకడలు ఎదురయ్యాయి. ఇలా అంకితను తీసుకెళ్లిన ప్రతిచోట, ప్రతి సందర్భంలో అవమానాలు ఎదుర్కొన్నాడు. చుట్టుపక్కల వాళ్ల కామెంట్స్ నొచ్చుకునేలా ఉండేవి. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా తన ప్రేమాయణం సాగించారు. ఇంట్లో పెద్దలకు తమ విషయాన్ని చెప్పి కుటుంబ పెద్దల సమక్షంలోనే పరిణయమాడారు.

అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకున్నాము, బాగా స్థిరపడ్డాము, ఒకరిని ఒకరు అర్థం చేసుకున్నాము అంటేనే ఇంట్లో పెద్దలు పెళ్లికి నిరాకరించే రోజులు ఇవి. అలాంటిది ఒక ట్రాన్స్ ను మరొక అబ్బాయి పెళ్లి చేసుకుంటాను అంటే అంగీకరించి మూడు ముళ్లుపడేలా చేయడం అంటే చాలా ఆశ్చర్యం కలిగించే అంశం. అందులోనూ చిన్నపాటి గుడిలోనో, గుట్టు చప్పుడు కాకుండానో వివాహం చేసుకోలేదు. దాదాపు రూ.10 లక్షల వరకూ ఖర్చు పెట్టి 200 మంది అతిథుల మధ్య అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. ఇలాంటి సరికొత్త పోకడలు సమాజంలో ఇంకెన్ని చూస్తామో అంటూ కొందరు గుసగుసలాడుకుంటుంటే.. ఇలాంటివి ఆధునిక యుగంలో, డిజిటల్ యుగంలో సర్వసాధారణం అని లైట్ గా తీసుకుంటున్నారు. ఇలాంటి పోకడలు కొంత వరకూ మంచిదే అని చెప్పాలి. ట్రాన్స్ పట్లు ఉండే విచక్షణను తగ్గించేందుకు కొంత వరకూ దోహదపడుతుంది. ప్రస్తుతం ట్రాన్స్ ఉమెన్స్ డాక్టర్లు, బ్యూటీషియన్స్, మోడల్స్, హెయిర్ కటింగ్ షాపులు ఇలా రకరకాలా ఫ్రొఫెషనల్ వృత్తుల్లో జీవనం సాగిస్తున్న తరుణంలో ఒక పెళ్లి కూతురుగా కూడా ఉదయించింది అంకిత. ఈ కథ ఇలాంటి ట్రాన్స్ ఉమెన్స్ అందరికీ అంకితం కావాలని ఆశిద్దాం.

 

T.V.SRIKAR