Political Leaders: ప్లీజ్.. ప్రజల్ని కాస్త పట్టించుకోండి.! జనం బతకొద్దా సార్లు..!

సార్లు.. ఓ పొలిటికల్ స్టార్లు.. మీ రాజకీయాలను కాస్త పక్కన పెట్టండి.. కాస్త జనం గోడు పట్టించుకోండి సారు.. పెరిగే ధరలతో సతమతమవుతున్న సామాన్యుడ్ని బతికించండి బాబులు .. ధరల చట్రంలో చిక్కుకుని విలవిలలాడుతున్న సామాన్యుడి తిప్పలు గమనించండి.

  • Written By:
  • Publish Date - April 5, 2023 / 12:17 PM IST

ఉప్పు- పప్పు, పాలు -టోలు రేట్లు, చక్కెర- చింతపండు పెరగనిది ఏది..? కూరగాయలు, స్కూల్ ఫీజులు, పెట్రోల్ రేట్లు, ఆర్టీసీ బస్సు టికెట్లు.. చెప్పుకుంటూ పోతే పెరిగిన వస్తువుల జాబితా కొండవీటి చాంతాడును మించిపోతుంది. రోజురోజుకు రేట్లు పెరిగిపోతున్నాయి. ఏ రోజుకా రోజు కొండెక్కడమే కానీ దిగిరావడం తెలియదు. పొద్దున లేచి టీ తాగుదామంటే పాలరేట్లు పెరిగిపోయాయి..గ్యాస్ బండ బరువెక్కింది.. అక్కడ్నుంచి రాత్రి పడుకునే వరకూ ఏది ముట్టుకుందామన్న భయమే.. ఫ్యామిలీతో బయటకు వెళ్లే రోజులు ఎప్పుడో పోయాయి. అలా వెళ్లి ఇలా వచ్చినా పెద్దనోటు ఎగిరిపోవాల్సిందే. కడుపు నిండదు కానీ కాసులు మాత్రం ఖర్చైపోతున్నాయి. ఎటు చూసినా ధరాభారమే.. ధరాఘాతమే..

సామాన్యుడి జీతం పావలా పెరిగితే ఖర్చులు ముప్పావలా పెరుగుతున్నాయి. మరి బతికేదెలా..? జనం ఇలా ధరల మోతతో అల్లాడిపోతుంటే నేతలేం చేయట్లేదా అంటే ఎందుకు లేదు.! చాలానే చేస్తున్నారు. అదానీ గురించి పోట్లాడతారు, రాహుల్ లోక్‌సభ సభ్యత్వం గురించి ఆరాట పడతారు, విదేశాల్లో దేశం పరువుతీశారు క్షమాపణ చెప్పాలని డిమాండ్లు చేస్తారు.. మోడీ విద్యార్హతల గురించి యుద్ధం చేస్తారు.. స్టాక్ మార్కెట్లు పడిపోతున్నాయని గగ్గోలు పెడతారు.. మీరు అవినీతి చేశారంటే మీరే అవినీతికి పాల్పడ్డారంటూ వీడియోలు విడుదల చేస్తారు. ఇవన్నీ జనం కోసమేనని మనం నమ్మాలి. ఇవన్నీ సామాన్యుడి జీవితాల్లో వెలుగులు నింపుతాయని సదరు నేతలు గట్టిగా నమ్ముతారన్నమాట.

అదానీ వ్యవహారంలో ప్రతిపక్షాలు పార్లమెంట్‌ను స్పందింపచేశాయి. అలాగే రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని అధికారపక్షం సభను అడ్డుకుంది.. తర్వాత రాహుల్ అనర్హత వ్యవహారం.. ఇన్ని అంశాల గురించి సభను అడ్డుకునే వాళ్లు.. సామాన్యుడి గోడు గురించి ఎందుకు పట్టించుకోరు అన్నది ఎప్పటికీ సమాధానం దొరకని సామాన్యుడి ప్రశ్న. చాట్‌జీపీటీని ఈ ప్రశ్నకు సమాధానం అడిగినా చేతులెత్తేస్తుంది. ఏ రోజైనా అయ్యో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ధరల నుంచి వారికి విముక్తి కలిగించాలని పోరాడిన నేతలు ఎవరున్నారు..? ఎందరున్నారు..? ఎవరైనా అయ్యో సామాన్యుడు చస్తున్నాడే వాడిని ధరల భారం నుంచి కాపాడదాం అని ఆలోచించారా.? ఏ నాయకుడికైనా కేజీ మిరపకాయ ధర ఎంత ఉందో తెలుసా..? కేజీ కందిపప్పు రెండేళ్ల క్రితం ఎంత ఉంది.. ఇప్పుడు ఎంత ఉందో తెలుసా..? పిల్లల స్కూలు ఫీజు రాకెట్ వేగంతో ఎలా పెరుగుతుందో తెలుసా.? గ్యాస్ సిలిండర్ ధర నాలుగేళ్ల క్రితం ఎంత.. ఇప్పుడెంతో తెలుసా.? తెలియదు.. దేని ధర ఎంతో ఈ నాయకులకు అసలు తెలియదు.. ఎందుకంటే ఈ రోజైనా షాపులకు వెళ్లి పచారీ సామాన్లు కొంటేనో, రైతు బజారుకు వెళ్లి కూరగాయలు తీసుకుంటేనే అవి చేసే గాయాలు తెలుస్తాయి. సామాన్యుడి తిప్పలు అర్థమవుతాయి.. లిక్కర్‌స్కామ్‌పై పోరాడతారు, పదో తరగతి పేపర్లలీకును రాజకీయం చేస్తారు.. సెక్రటేరియట్‌ను కూల్చేస్తామంటారు.. అన్నీ వారికి రాజకీయ పోరాట అంశాలే.. కానీ అసలు ఓటేసే సామాన్యుడు మాత్రం పోరాటానికి పనికిరాని పువ్వు.. డబ్బులు తీసుకుని ఓటేయడానికి జనం అలవాటు పడితే ఎన్నికలప్పుడే నేతలకు వారు గుర్తుకు వస్తున్నారు.. సంతలో గొర్రెల్ని కొన్నట్లు వేలకు వేలు తగలేసి ఓట్లు కొంటున్నారు. ఆ సొమ్మును రాబట్టుకునేందుకు అవినీతికి పాల్పడుతున్నారు. అలాంటి నేతలు మన గురించి ఎందుకు పట్టించుకుంటారు.?

సామాన్యుడ్ని ప్రతి నెలా ఏదో ఓ రూపంలో బాదడమే పనిగా పెట్టుకున్నాయి ప్రభుత్వాలు. దాచుకున్న కాస్త సొమ్ముకు తోడు బ్యాంకులో అప్పు తీసుకుని ఇల్లు కొనుక్కుంటే అవకాశం దొరికినప్పుడల్లా వడ్డీ పేరుతో అడ్డంగా బాదేస్తున్నారు. ఏడాది క్రితం గృహరుణ వడ్డీ రేట్లెంత.. ఇప్పుడెంత.? చిన్న మధ్య తరగతి మానవులపై పడుతున్న భారమెంత.? ఏనాడైనా ఆలోచించారా.? నెలకు వేయి రూపాయలు పెరిగినా సామాన్యుడి బడ్జెట్ తల్లకిందులవుతుందని లక్షల కోట్ల బడ్జెట్లు పెట్టే మీకు అర్థం కాదా.? జీఎస్‌‌టీ పేరుతో అడ్డంగా దోచుకునే ప్రభుత్వాలు మరి ధరలు పెరుగుతున్నాయి కదా అని దాన్నేమైనా తగ్గిస్తారా.? పెట్రోల్‌పై భారం తగ్గించండి అంటే రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించాలని కేంద్రం, కాదు మీరే తగ్గించాలంటూ రాష్ట్రాలు తప్పించుకుంటాయి. అసలు పెట్రోల్‌పై సామాన్యుడు కడుతున్న పన్నెంత..? ప్రతి దానికి సామాన్యుడ్నే బాదాలి.. కానీ సామాన్యుడి భారాన్ని మాత్రం ప్రభుత్వాలు పట్టించుకోవా.?

దేశం వెలిగిపోతోంది.. స్టాక్ మార్కెట్లు 70వేలు దాటతాయి.. జీఎస్‌టీ వసూళ్లు 2లక్షల కోట్లకు చేరతాయి.. 5ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారతాం.. వినడానికి ఈ పదాలు చెవికి చాలా ఇంపుగా ఉంటాయి.. కానీ ఇవన్నీ సామాన్యుడికి ఎందుకు.? స్టాక్ మార్కెట్లు 70వేలను టచ్ చేస్తే మిరపకాయ ధర తగ్గుతుందా.? జీఎస్‌టీ వసూళ్లు రెండు లక్షల కోట్లు దాటితే మన బ్యాంకు ఎకౌంట్లలోకి ఏమైనా అప్పనంగా సొమ్ము వచ్చి పడుతుందా..? బడ్జెట్ పేరుతో అంకెల గారడీ చేసే నేతలు అందులో సామాన్యుడికి పనికివచ్చేవి ఎన్నని ఏ రోజైనా ఆలోచించారా..? అయితే వెలగాల్సింది దేశం కాదు.. సామాన్యుడి జీవితం..
( ఓ సామాన్యుడి చిన్న ఆవేదన)