LPG cylinder: దేశ ప్రజలకు ప్రధాని మోదీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వంటగ్యాస్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ.200 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే రూ.200 తగ్గింపు పొందుతున్న ఉజ్వల పథకం లబ్ధిదారులకు కూడా అదనంగా రూ.200 తగ్గింపు వర్తించనుంది. అంటే వీరికి మొత్తంగా సిలిండర్‌పై రూ.400 తగ్గింపు వర్తిస్తుంది. ఈ నిర్ణయాన్ని దేశంలోని మహిళలకు ప్రధాని మోదీ అందించిన రాఖీ కానుకగా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. వంటగ్యాస్ తగ్గింపు నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.
ప్రస్తుతం దేశంలో 14కేజీల వంట గ్యాస్ సిలిండర్ ధర 11 వందల రూపాయల వరకు ఉంది. మోదీ ప్రధానమంత్రి కాక ముందు.. ఈ గ్యాస్ సిలిండర్ ధర 450 రూపాయలుగా ఉంది. ఈ తొమ్మిదేళ్ల కాలంలో మూడింతలు పెరిగింది. దీనికితోడు నిత్యావసర సరుకుల ధరలు కూడా భారీగా పెరిగాయి. ఇది మధ్యతరగతి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అయితే, త్వరలో వివిధ రాష్ట్రాలతోపాటు పార్లమెంటుకు ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలోనే గ్యాస్ సిలిండర్ ధరను 2వందల రూపాయలు తగ్గించినట్లు సమాచారం. ఇక అటు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాల్… తన ఎన్నికల హామీ కింద గ్యాస్ సిలిండర్ ధరపై 250 రూపాయల తగ్గింపు ప్రకటించారు. తగ్గించిన ధరను నేరుగా మహిళల ఖాతాలో వేస్తామని.. ఇది రాఖీ పండుగకు గిఫ్ట్ అని ప్రకటించారు.
సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాది సమయం కూడా లేదు. వాటికంటే ముందు.. తెలంగాణతో సహా ఐదు కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయ్. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని గ్యాస్ ధరల విషయంలో కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక అటు గ్యాస్ సిలిండర్ ధరపై విపక్షాలు కూడా విమర్శలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అవకాశం ఇవ్వకుండా.. కేంద్రమే ధరను 2వందల రూపాయల వరకు తగ్గించటం ద్వారా ధరలను కూడా అదుపు చేసినట్లు ఉంటుందనే ఆలోచన చేసింది. ప్రస్తుత తగ్గింపు ప్రకారం రూ.1103గా ఉన్న సిలిండర్ ధర ఇకపై రూ.903కే వస్తుంది. అలాగే ఉజ్వల పథకం లబ్ధిదారులకు రూ.703కే అందుతుంది. దేశంలో ఉజ్వల పథకం కింద కొత్తగా 75 లక్షల వంటగ్యాస్ కనెక్షన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ పథకాన్ని 2016లో మోదీ ప్రారంభించారు. కొత్తగా ఇవ్వనున్న ఉజ్వల కనెక్షన్లతో కలిపితే దేశంలో ఈ పథకం లబ్ధిదారుల సంఖ్య 10.35 కోట్లకు చేరుతుంది.