Heart Attack: వయసుతో పని లేదు.. ఎంత వర్కౌట్ చేసినా.. ఆరోగ్యంగా కనిపించినా.. గుండెపోటు మరణాలు ఆగడం లేదు. చిన్న పిల్లలు కూడా గుండె ఆగి చనిపోతున్నారు. దీంతో హార్ట్ ఎటాక్ అంటేనే వెన్నులో వణుకు పుడుతున్న పరిస్థితి చాలామందికి. అప్పటివరకు బాగానే ఉన్నవారు ఒక్కసారిగా గుండెల్లో నొప్పితో కుప్పకూలి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతున్నారు.
ఈ మరణాల వెనుక కారణాల ఏమైనప్పటికీ.. జీవనశైలిలో వచ్చిన మార్పులు, ఇతర ఆరోగ్య సమస్యలే కారణమని నిపుణులు అంటున్నారు. ఇదంతా ఎలా ఉన్నా.. మిగతా రోజులతో కంపేర్ చేస్తే.. సోమవారం రోజు తీవ్రమైన గుండెపోటు కేసులు ఎక్కువగా సంభవించే చాన్స్ ఉందని ఓ అధ్యయనంలో తేలింది. స్టెమీ అనేది ఓ రకమైన గుండెపోటు. అర్థం అయ్యేలా చెప్పాలంటే.. గుండె రక్తనాళం వంద శాతం పూడుకుపోవడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. ఇది తీవ్ర అనారోగ్యంతోపాటు ఒక్కోసారి మరణానికీ దారితీస్తుంది.
ఇదే అంశంపై ఐర్లాండ్‌లోని బెల్‌ఫాస్ట్ హెల్త్ అండ్ సోషల్ కేర్ ట్రస్ట్, రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్‌కు చెందిన నిపుణులు అధ్యయనం చేపట్టారు. 2013 నుంచి 2018 మధ్య గుండెపోటుతో చేరిన 10వేల మందికి పైగా రోగుల సమాచారం పరిశీలించారు. ఇందులో కీలక విషయాన్ని గుర్తించారు సైంటిస్టులు. వారంలో మొదటి రోజు.. అంటే సోమవారమే ఇలాంటి గుండెపోటుకు ఎక్కువగా గురవుతున్నారని పరిశోధకులు తేల్చారు. నిజానికి సోమవారమే ఎక్కువ గుండెపోట్లు వస్తాయనే చర్చ ఎప్పటి నుంచో వినిపిస్తోంది.
ఐతే బ్లూ మండేగా పిలిచే ఈ పరిస్థితులు సోమవారమే ఎందుకు ఎక్కువ సంభవిస్తాయనేది మాత్రం సైంటిస్టులు ఇప్పటికీ వివరణ ఇవ్వలేకపోయారు. ఐతే గుండెపోటు కేసులు సోమవారం నాడే ఎక్కువగా సంభవించడానికి కార్కాడియం రిథమ్.. అంటే శరీరం నిద్రపోవడం లేదా లేచే చక్రంతో సంబంధం ఉందని గతంలో అధ్యయనాలు చెప్పాయ్.