మనుషుల్లోనైనా జంతువుల్లోనైనా తల్లి ప్రేమను మించిన ప్రేమ మరొకటి లేదు. పిల్లలను కాపాడుకునేందుకు ఏ తల్లి అయినా తన ప్రాణాన్ని కూడా లెక్క చేయదు అనడం అతిశయోక్తి కాదు. అలాంటి తల్లి ప్రేమే కోసం రెండు రోజులుగా 4 పులి కూనలు పరితపిస్తున్నాయి. తల్లి స్పర్శ లేక బిక్కు బిక్కుమంటూ తల్లిడిల్లిపోతున్నాయి. పులి కూనలను తల్లి దగ్గరికి చేర్చేందుకు ఫారెస్ట్ అధికారులు చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి.
సరిగ్గా కళ్లు కూడా తెరవని 4 పులి పసి కూనలను నల్లమలలోని పెద్దగుమ్మడాపురం వద్ద రెండు రోజుల క్రితం గుర్తించారు గ్రామస్థులు. తల్లి పులితో కలిసి వెళ్తున్న సమయంలో నాలుగు పిల్లలు తప్పిపోయాయి. వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారమిచ్చారు. కానీ అప్పటికే పులి పిల్లలు అనారోగ్యంతో క్షీణించి ఉన్నాయి. దీంతో పిల్లలను హాస్పిటల్‌కు తరలించారు. 40 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి పులి కోసం గాలించిన అధికారులు.. ఎట్టకేలకు దాని ఆచూకీ కనిపెట్టారు. పెద్ద గుమ్మడాపురం దగ్గర ట్రాప్ కెమెరాల్లో పులి ఫొటోలకు చిక్కింది. అయితే దాని ఖచ్చితమైన లోకేషన్ మాత్రం ట్రేజ్ కాలేదు.
పెద్దగుమ్మరడాపురం పరిసర ప్రాంతాల్లో పులి గాండ్రింపులను అధికారులు గుర్తించారు. దీంతో పులి అక్కడే సంచరిస్తోందని ఓ అంచనాకు వచ్చారు. పులి ఉన్న ఖచ్చితమైన లొకేషన్‌ను కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇక్కడే అధికారులకు మరో సమస్య వచ్చింది. పులి కూనలను మనుషులు ముట్టుకున్న వాసన తెలిస్తే తల్లి పులి వాటిని దగ్గరికి రానివ్వదు. దీంతో ఆ ప్రాబ్లం రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పులి పిల్లల మూత్రంతో వాటిని తడిపి ఆ తరువాత వాటిని తల్లి పులి దగ్గర వదిలేయనున్నారు.