Aung San Suu Kyi: అంగ్‌సాన్ సూకీకి ఊరట.. క్షమాభిక్ష ప్రసాదించిన సైనిక ప్రభుత్వం

ప్రతి ఏడాది మయన్మార్‌లో ఘనంగా నిర్వహించే బౌద్ధ పండుగ సందర్భంగా ప్రభుత్వం పలువురికి క్షమాభిక్ష ప్రసాదిస్తుంది. దీనిలో భాగంగా అంగ్ సాన్ సూకీతోపాటు, దేశ మాజీ అధ్యక్షుడు విన్ మైంట్‌కు కూడా శిక్ష తగ్గించింది. క్షమాభిక్షలో భాగంగా ఆయనకు నాలుగేళ్ల శిక్షను తగ్గించింది.

  • Written By:
  • Publish Date - August 1, 2023 / 02:46 PM IST

Aung San Suu Kyi: మయన్మార్ ఉద్యమ నేత, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అంగ్‌సాన్ సూకీకి స్వల్ప ఊరట లభించింది. అక్కడి సైనిక ప్రభుత్వం సూకీకి క్షమాభిక్ష ప్రసాదించింది. వివిధ కేసుల్లో ఆమెకు విధించిన శిక్షలో ఆరేళ్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆమె మొత్తం శిక్షలో ఆరేళ్ల కాలం తగ్గనుందని మయన్మార్ అధికార ప్రతినిధి జా మిన్ వెల్లడించారు. ఇప్పటికే సూకీని జైలు నుంచి గృహ నిర్బంధంలోకి మార్చింది అక్కడి ప్రభుత్వం.

ప్రతి ఏడాది మయన్మార్‌లో ఘనంగా నిర్వహించే బౌద్ధ పండుగ సందర్భంగా ప్రభుత్వం పలువురికి క్షమాభిక్ష ప్రసాదిస్తుంది. దీనిలో భాగంగా అంగ్ సాన్ సూకీతోపాటు, దేశ మాజీ అధ్యక్షుడు విన్ మైంట్‌కు కూడా శిక్ష తగ్గించింది. క్షమాభిక్షలో భాగంగా ఆయనకు నాలుగేళ్ల శిక్షను తగ్గించింది. మిగతా ఏడువేల మంది ఖైదీలకు కూడా సైనిక ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించింది. సూకీపై మయన్మార్‌లో 19కి పైగా కేసులున్నాయి. వీటికిగాను ఆమెకు 33 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఈ శిక్షలో నాలుగు కేసుల్ని రద్దు చేసింది. వీటికిగాను సూకీకి ఆరేళ్ల జైలు శిక్ష తగ్గుతుంది. మయన్మార్‌లో సూకీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేశారు. 1989లో సైనిక పాలనను వ్యతిరేకిస్తూ తొలిసారి నిరసనలో పాల్గొంది. అప్పుడే ఆమెను గృహ నిర్బంధంలో ఉంచారు.

అయితే, దేశంలో ప్రజాస్వామ్య స్థాపనకు కృషి చేసినందుకు ఆమెకు 1991లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. అయితే, చాలా ఏళ్లపాటు ఆమె గృహ నిర్బంధంలోనే ఉన్నారు. 2010లో దీన్నుంచి విముక్తి లభించింది. తర్వాత రాజకీయ పార్టీ స్థాపించి, 2015లో ఎన్నికల్లో పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో ఆమె పార్టీ ఘన విజయం సాధించింది. ఆ తర్వాత 2020లో కూడా ఆమె పార్టీ గెలిచి అధికారం దక్కించుకుంది. అయితే, ఏడాదిలోనే సైన్యం ఆమె ప్రభుత్వాన్ని కూల్చి, అధికారం దక్కించుకుంది. 2021 నుంచి అక్కడ సైనిక పాలనే కొనసాగుతోంది. సైనిక ప్రభుత్వం సూకీపై, ఆమె అనుచరులు, దేశ అధ్యక్షుడిపై అనేక అవినీతి ఆరోపణలు నమోదు చేసి, శిక్ష విధించింది. దీంతో ఆమె, అనుచరులు జైలులోనే ఉంటున్నారు.

వీటికి సంబంధించి సూకీకి, ఆమె అనుచరులకు ఇప్పుడు క్షమాభిక్ష పెట్టి, శిక్ష తగ్గించారు. మయన్మార్‌లో ప్రస్తుతం సైనిక పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలు తిరుగుబాటు చేస్తే, సైన్యం వారికి కాల్చి చంపుతోంది. అక్కడ ఇప్పుడు ఎమర్జెన్సీ కొనసాగుతోంది. ఈ ఎమర్జెన్సీని మరో ఆరు నెలలు పొడిగిస్తూ సోమవారం సైనిక ప్రభుత్వం నిర్ణ‍యం తీసుకుంది.