ఒకే ఒక్క క్షిపణి. ఒక్కసారి ప్రయోగిస్తే చాలు అగ్రరాజ్యం అమెరికా (America) నామరూపాలు లేకుండా పోతుంది. తమపైకి ఓ మిస్సైల్ (Missile) దూసుకొస్తుందన్న విషయం అమెరికా నిఘా వర్గాలు పసిగట్టేలౌోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అమెరికా వద్ద ఎంత అత్యాధునిక సైనిక వ్యవస్థ ఉన్నా… ప్రపంచాన్ని స్కాన్ చేసే నిఘా కళ్లు ఉన్నా.. అవన్నీ ఆ క్షిపణి ముందు దిగదుడుపే. అసలు అమెరికా కంట పడకుండా అమెరికాను తునాతునకలు చేయగల సత్తా ఆ క్షపణికి ఉంది. దాని పేరే Hwasong-18. అణు క్షిపణుల పరీక్షలతో ప్రపంచదేశాలను కలవరపెడుతున్న ఉత్తరకొరియా (North Korea)… అమెరికా సహా ప్రపంచ దేశాల ఒళ్లు గగుర్పరిచేలా మరో ప్రయోగం చేసింది. ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ క్షిపణుల్లోనే (Inter continental ballistic missile) ఇది అత్యంత ఆధునికమైంది. తమ దేశం జోలికి వస్తే అది అగ్రరాజ్యమైనా…మరో దేశమైనా ఎవరైనా సరే.. వాళ్ల అంతు చూస్తామని సంకేతాలు ఇస్తూ ఉత్తర కొరియా ఈ ప్రయోగం నిర్వహించింది.
జపాన్ తీరంలో కలకలం
ఎప్పుడూ వార్ మోడ్‌లో ఉండాలంటూ అధ్యక్షుడు కిమ్ (Kim) మిలటరీని ఆదేశించిన కొన్ని రోజులకే ఉత్తర కొరియా ప్రభుత్వం Hwasong-18 బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించింది. దీని ప్రభావం ఏ స్థాయిలో ఉందంటే జపాన్ (Japan) పరిధిలో ఉన్న ఓ ద్వీపంలో పడుతుందేమోనని ముందుగా అక్కడ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఒకానొక దశలో ప్రజలను ఖాళీ కూడా చేయించారు. ఆ స్థాయిలో పొరుగు దేశాలను భయపెట్టింది ఉత్తర కొరియా.
ఇంతకీ ఈ క్షపణి ప్రత్యేకత ఏంటి ?
బాలిస్టిక్ మిస్సైల్స్‌ను పరీక్షించడం ఉత్తరకొరియాకు ఇదేం కొత్తకాదు. చాలా సంవత్సరాల నుంచే ఉత్తర కొరియా మీడియం రేంజ్, లాంగ్ రేంజ్ క్షిపణి ప్రయోగాలపై దృష్టి పెట్టింది. తమ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయని.. ఏదేశమైనా తోక జాడించి మావైపు వస్తే ఆదేశాన్ని నామరూపాలు లేకుండా చేస్తామని ఎప్పటికప్పుడు కిమ్ ప్రపంచ దేశాలకు వార్నింగ్ ఇస్తూనే ఉన్నారు. ఉత్తర కొరియా బాలిస్టిక్ మిస్సైల్ ప్రయోగించినప్పుడల్లా ఏదో ప్రమాదం ముంచుకు రాబోతోందని ప్రపంచ దేశాల్లో కలవరం మొదలవుతుంది. అయితే ఈసారి మాత్రం ఉత్తర కొరియా పరీక్షించిన బాలిస్టిక్ మిస్సైల్ అమెరికాకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే ఈసారి కిమ్ సర్కార్ పరీక్షించింది సాలిడ్ ఫ్యూయల్ ఇంటర్‌కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్ (Solid fuel intercontinental ballistic missile). ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న అన్ని బాలిస్టిక్ మిస్సైల్స్‌లో ఇదే అత్యాధునికమైంది.
సాలిడ్ ఫ్యూయల్ వర్సెస్ లిక్విడ్ ఫ్యూయల్
లిక్విడ్ ఫ్యూయల్ బాలిస్టిక్ మిస్సైల్స్ ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి.. కానీ సాలిడ్ ఫ్యూయల్ బాలిస్టిక్ మిస్సైల్ మాత్రం వీటికి పూర్తి భిన్నమైంది. లిక్విడ్ (Liquid) ఫ్యూయల్ ఇంటర్‌కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్స్‌ను సిద్ధం చేయడం, శత్రుదేశాలను టార్గెట్‌గా మోహరించడం చాలా కష్టం. దాడి చేయాలనుకుంటున్న సమయానికి చాలా గంటల ముందు నుంచే లిక్విడ్ ఫ్యూయల్ ప్రొపెల్లెన్ట్స్ ను రెడీ చేసుకోవాలి. కానీ సాలిడ్ ఫ్యూయల్ మిస్సైల్స్‌కు ఆ ఇబ్బంది లేదు. చాలా ఈజీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు సాలిడ్ ఫ్యూయల్ బాలిస్టిక్ మిస్సైల్స్‌ను ప్రయోగించవచ్చు. లిక్విడ్ ఫ్యూయల్ మిస్సైల్‌తో మరో సమస్య కూడా ఉంది. ఒక్కసారి దీనిని సిద్ధం చేస్తే తక్కువ సమయంలోనే ప్రయోగించాలి. లేదంటే అది నిరుపయోగంగా మారిపోతుంది. కానీ సాలిడ్ ఫ్యూయల్‌తో ఆ సమస్య లేదు. ఇప్పటి వరకు షార్ట్ రేంజ్ సాలిడ్ ఫ్యూయల్ బాలిస్టిక్ మిస్సైల్స్ ను పరీక్షిస్తూ వస్తున్న ఉత్తర కొరియా తొలిసారిగా లాంగ్ రేంజ్ సాలిడ్ ఫ్యూయల్ మిస్సైల్స్‌ను విజయవంంతంగా పరీక్షించింది. ఇది ఆరంభం మాత్రమేనని త్వరలోనే పూర్తి స్థాయి సాలిడ్ ఫ్యూయల్ ఇంటర్‌కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్స్‌ను పరీక్షిస్తామని ఉత్తరకొరియా చెబుతోంది.
సాలిడ్ ఫ్యూయల్ మిస్సైల్స్‌లో ఏముంటుంది ?
సాలిడ్ ప్రొపెల్లెన్ట్స్ ను ఫ్యూయల్ , ఆక్సిడైసర్ మిశ్రమంతో తయారు చేస్తారు. అల్యూమినియం వంటి మెటాలిక్ పౌడర్‌ను ఇందులో ఫ్యూయల్‌గా ఉపయోగిస్తారు. అమ్మోనియం పెర్‌క్లోరేట్‌ను ఆక్సిడైసర్‌గా వాడతారు. సాలిడ్ ప్రొపెల్లెన్ట్స్ ను మండించినప్పుడు దాదాపు 2760 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత జనరేట్ అవుతుంది. దీంతో మిస్సైల్ లాంచింగ్ ప్యాడ్ నుంచి రెప్పపాటులో దూసుకుపోతుంది.
ఇప్పుడే ఎందుకు పరీక్షించింది ?
ప్రపంచదేశాలకు దీటుగా ఆయుధాలను సమకూర్చుకుని ఎప్పటికప్పుడు ఆయుధ సంపత్తిని పెంచుకుంటున్న ఉత్తరకొరియాకు ఈ ఏడాది చాలా కీలకమనే చెప్పాలి. ఉత్తరకొరియా అధ్యక్షుడిగా కిమ్ పాలన 11వ సంవత్సరంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా పెద్దఎత్తున దేశవ్యాప్తంగా సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో తమ దేశ మిలటరీ, అణు సత్తా ఏంటో మరోసారి ప్రపంచానికి తెలియజేయాలనుకుంది ఉత్తరకొరియా. అంతేకాదు. ఇటీవలే దక్షిణ కొరియాతో కలిసి అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించడం కిమ్‌కు ఆగ్రహం తెప్పించింది.దక్షిణ కొరియాను తమపై ఎగదోసేందుకు అమెరికా అన్ని విధాలా ప్రయత్నిస్తోందని కిమ్ భావిస్తున్నారు. అందుకే అగ్రరాజ్యానికి ఝలక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగానే అమెరికా టార్గెట్‌గా రూపొందించిన సాలిడ్ ఫ్యూయల్ మిస్సైల్ అస్త్రాన్ని బయటకు తీశారు. ఇప్పటికే అమెరికా, చైనా, రష్యా వంటి దేశాల వద్ద సాలిడ్ ఫ్యూయల్ మిస్సైల్స్ ఉన్నా తాజాగా ఉత్తరకొరియా పరీక్షించింది మాత్రం అత్యాధునికమైంది.