Rehana Fathima: ఆడవారి శరీరం విషయంలో కేరళ హైకోర్ట్‌ సంచలన తీర్పు..!

శరీర భాగాలు, అర్థనగ్నత్వం విషయంలో కీలక వ్యాఖ్యలు చేసింది. శరీర భాగాల విషయంలో పురుషులు, మహిళలను వేర్వేరు దృష్టికోణాల్లో చూస్తున్నారంటూ చెప్పింది. ఆడ, మగ మధ్య ఉన్న వివక్షతను చూపించేందుకు వీడియో రూపొందించానన్న ఫాతిమా వాదనతో కోర్టు ఏకీభవించింది.

  • Written By:
  • Publish Date - June 6, 2023 / 11:29 AM IST

Rehana Fathima: మహిళల శరీరంపై వారికున్న హక్కు గురించి కేరళ హైకోర్ట్‌ సంచలన తీర్పునిచ్చింది. మహళలు తమ శరీరాలు, జీవితాలపై స్వతంత్ర్య నిర్ణయాలు తీసుకుంటే వేధింపులకు గురౌతున్నారని కోర్టు అభిప్రాయపడింది. జువైనల్‌ జస్టిస్‌, పోక్సో, ఐటీ చట్టాల కింద మహిళా హక్కుల కార్యకర్త ఫాతిమాపై నమోదైన కేసు విచారణలో భాగంగా ఈ కామెంట్స్‌ చేసింది కోర్టు. మైనర్లతో అర్థనగ్న భంగిమలో ఓ మహిళ తన శరీరంపై టాటూ వేయించుకుంది.

దీనికి సంబంధించిన ఓ వీడియో తయారు చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు ఫాతిమా. ఈ వీడియో వైరల్‌ అవ్వడంతో చిన్నారులపై లైంగిక వేధింపులు, జువైనల్‌ జస్టిస్‌, ఐటీ సెక్షన్ల కింద ఆమెపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులను కొట్టేయాలంటూ డిస్ట్రిక్‌ కోర్టులో ఫాతిమా పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే జిల్లా కోర్టు ఆమె పిటిషన్‌ను కొట్టివేయడంతో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కేరళ హై కోర్టు.. శరీర భాగాలు, అర్థనగ్నత్వం విషయంలో కీలక వ్యాఖ్యలు చేసింది. శరీర భాగాల విషయంలో పురుషులు, మహిళలను వేర్వేరు దృష్టికోణాల్లో చూస్తున్నారంటూ చెప్పింది. ఆడ, మగ మధ్య ఉన్న వివక్షతను చూపించేందుకు వీడియో రూపొందించానన్న ఫాతిమా వాదనతో కోర్టు ఏకీభవించింది.

కామోద్దీపన అనేది చూసే వారి దృష్టికోణాన్ని బట్టి ఉంటుందే తప్ప నగ్నత్వాన్ని బట్టి ఉండదని కోర్టు చెప్పింది. అన్ని సమయాల్లో నగ్నత్వం అనేది అశ్లీలత కాదని కోర్టు చెప్పింది. దేవాలయాలపై వివిధ భంగిమల్లో విగ్రహాలు ఉంటాయని.. అవి కామానికి చిహ్నాలు కాదని కోర్టు కామెంట్‌ చేసింది. ఓ సామాజిక లక్ష్యం కోసం పిటిషనర్‌ తయారు చేసిన వీడియోను దిగువ కోర్టు అర్థం చేసుకోవడంలో విఫలమైందని హైకోర్ట్‌ చెప్పింది. ఫాతిమాపై నమోదైన కేసులన్నిటినీ వెంటనే తొలగించాలని ఆదేశించింది. కేరళ హైకోర్ట్‌ ఇచ్చిన ఈ తీర్పు ఇప్పుడు సంచలనంగా మారింది.