New York: ఎలుకల్ని పట్టేందుకు రూ.1.27 కోట్ల ఖర్చు.. ఎలుకల పోరు పడలేకపోతున్న న్యూయార్క్ నగరం

న్యూయార్క్‌లో ఎంత మంది ప్రజలు ఉంటారో అన్ని ఎలుకలూ ఉన్నాయంటారు స్థానికులు. అయితే, దాదాపు రెండు మిలియన్లకుపైగా ఎలుకలు ఉండొచ్చని ఒక అంచనా. 20 లక్షలకుపైగా ఎలుకలంటే అవి ఏ స్థాయిలో విధ్వంసం సృష్టిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు.

  • Written By:
  • Publish Date - April 13, 2023 / 07:43 PM IST

New York: ప్రపంచంలోని పెద్ద నగరాల్లో ఒకటి న్యూయార్క్. అత్యంత ఖరీదైన, సుందరమైన నగరం కూడా. అమెరికాకు చెందిన ఈ నగరాన్ని ఇప్పుడు కొత్త శత్రువులు భయపెడుతున్నాయి. అవే ఎలుకలు. న్యూయార్క్ వాసులు ఎలుకల బెడదతో హడలెత్తిపోతున్నారు. నగరంలో ఇవి లేని చోటు కనిపించదంటే అతిశయోక్తి కాదు. వీటి వల్ల నగర ప్రజలు అనేక రకాలుగా నష్టపోతున్నారు. స్థానిక మేయర్‌కు వీటి విషయంపై ఎప్పట్నుంచో మొరపెట్టుకుంటుంటే.. ఇప్పటికి స్పందించారు. ఇకపై ఎలుకలపై సమరమే అంటున్నారు. వీటిని అంతం చేసేందుకు మన కరెన్సీలో ఏకంగా రూ.1.27 కోట్ల రూపాయలు కేటాయించారు. ఒక మహిళకు ఈ బాధ్యతలు అప్పగించారు.
రెండు మిలియన్ల ఎలుకలు
న్యూయార్క్‌లో ఎంత మంది ప్రజలు ఉంటారో అన్ని ఎలుకలూ ఉన్నాయంటారు స్థానికులు. అయితే, దాదాపు రెండు మిలియన్లకుపైగా ఎలుకలు ఉండొచ్చని ఒక అంచనా. 20 లక్షలకుపైగా ఎలుకలంటే అవి ఏ స్థాయిలో విధ్వంసం సృష్టిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడి మురికి కాలువలు, పార్కులు, సబ్ వేలు, రెస్టారెంట్లు, స్టోర్స్, పాత భవనాలు, కొత్త భవనాలు.. ఇలా ఒక చోటేమిటి.. అన్ని చోట్లా ఎలుకలు కనిపిస్తాయి. అందుకే వీటి పీడ వదిలించుకునేందుకు నగర పాలకులు సిద్ధమయ్యారు. ఎలుకల బెడద వదిలించేవాళ్లు కావాలని ఒక ప్రకటన విడుదల చేశారు.


ఎలుకల్ని పట్టుకునేందుకే ఉద్యోగం
ఎలుకల్ని వదిలించేందుకు ఏకంగా ఒక కొత్త ఉద్యోగాన్ని సృష్టించింది న్యూయార్క్ పాలకవర్గం. సిటీ వైడ్ డైరెక్టర్ ఆఫ్ రోడెంట్ మిటిగేషన్ పేరుతో ఒక ఉద్యోగ ప్రకటన ఇచ్చింది. దీన్ని ర్యాట్ జార్ అని కూడా అంటారు. ఈ ఉద్యోగానికి ఎంపికైన వాళ్లు నగరంలో ఎలుకల బెడద వదిలించాలి. అంతేకాదు.. ఈ ఉద్యోగానికి ఎంపికయ్యే వ్యక్తి ఎలుకల్ని పట్టుకోవడానికి అత్యంత ఆసక్తి కలిగి ఉండాలి. అవి కనిపిస్తేనే భరించకూడదు. వీటిని నివారించేందుకు అన్ని రకాల ప్రణాళికలు కలిగి ఉండాలి. ఎలుకలకు సంబంధించిన డేటా సేకరించగలగాలి. టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి. ఇన్నోవేషన్ ఐడియాస్ కావాలి. ఎలుకల్ని పట్టుకోవడం, అంతమొందించడం వంటివి చేయగలగాలి. అంతకుమించి మంచి హ్యూమర్ కూడా ఉండాలట. ఈ ప్రకటన వచ్చిన మూడు నెలలకు న్యూయార్క్‌కు ఒక ర్యాట్ జార్ దొరికారు. క్యాథ్లీన్ కొర్రాడి అనే మహిళను ర్యాట్ జార్‌గా ఎంపిక చేశారు న్యూయార్క్‌ మేయర్ ఎరిక్ ఆడమ్స్.

రూ.1.27 కోట్ల వేతనం
క్యాథ్లీన్ కొర్రాడిని ఎంపిక చేసిన న్యూయార్క్ మేయర్.. ఆమెకు అక్కడి ప్రభుత్వం తరఫున రూ.1.27 కోట్లను వార్షిక వేతనంగా చెల్లించనున్నారు. క్యాథ్లీన్‌కు ఈ సమస్యపై స్పష్టమైన అవగాహన ఉంది. అలాగని ఆమె ఈ విషయంలో ఎక్కడా శిక్షణ తీసుకోలేదు. నగర జీవన విధానం, సమస్యలు, పరిష్కారాల విషయంలో అనుభవం ఉంది. ర్యాట్ జార్‌గా బాధ్యతలు స్వీకరించిన క్యాథ్లీన్ ఇప్పటికే పని ప్రారంభించింది. “ఇకపై న్యూయార్క్ నగరంలో నన్ను ఎక్కువగా చూస్తారు. ఎలుకల్ని తక్కువగా చూస్తారు” అంటూ స్టేట్‌మెంట్ కూడా ఇచ్చేసింది. ఎలుకల్ని అంతమొందించేందుకు సాయపడేలా వివిధ రంగాలకు చెందిన వారిని ఎంపిక చేసుకుంది. అలాగే వీటిని ఎలా ఎదుర్కోవాలో ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. వ్యర్థాల నిర్వహణపై కూడా అవగాహన కల్పిస్తోంది. ఎందుకంటే వీటివల్లే ఎలుకల సంఖ్య పెరుగుతుంటుంది. క్యాథ్లీన్ కొర్రాడి చర్యల ద్వారా న్యూయార్క్ నగరంలో ఎలుకల బెడద తప్పుతుందని స్థానికులు ఆశిస్తున్నారు.