Nitin Gadkari: వీఐపీ వాహనాలకు సైరన్ బదులు భారతీయ సంగీతం.. త్వరలో కొత్త రూల్స్..!

సైరన్ మోత వినిపించగానే.. ప్రజల్లో ఒక చిరాకు కనిపిస్తుంది. అలాంటి సైరన్ మోతకు త్వరలో చెక్ పడబోతుంది. వాహనాల సైరన్ మోతను కేంద్ర ప్రభుత్వం మార్చబోతుంది. ఈ విషయాన్ని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.

  • Written By:
  • Publish Date - August 13, 2023 / 08:53 PM IST

Nitin Gadkari: వీఐపీ వాహనాలకు సంబంధించి కీలక మార్పు చోటు చేసుకోబోతుంది. మంత్రులు, వీఐపీల కార్లకు ప్రొటోకాల్‌లో వాహనాలు వెళ్తున్నప్పుడు సైరన్ వినిపించడం మామూలే. రోడ్డు మీద సైరన్ మోత వినిపించిందంటే వీఐపీ వెళ్తున్నట్లే. సైరన్ మోత వినిపించిందంటే.. పోలీసులు ట్రాఫిక్ ఆపేస్తారు. సామాన్యుల్ని ఆపేసి, వీఐపీలకు దారి కల్పిస్తారు. ప్రభుత్వం కల్పించిన సైరన్‌ను కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. కొందరు ఖాళీ వాహనాలను కూడా సైరన్ మోతతో తీసుకెళ్తున్నారు.

మరికొందరు అనుమతి లేకుండానే సైరన్ వినియోగిస్తున్నారు. సైరన్ మోత వినిపించగానే.. ప్రజల్లో ఒక చిరాకు కనిపిస్తుంది. అలాంటి సైరన్ మోతకు త్వరలో చెక్ పడబోతుంది. వాహనాల సైరన్ మోతను కేంద్ర ప్రభుత్వం మార్చబోతుంది. ఈ విషయాన్ని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. మహారాష్ట్రలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న నితిన్ గడ్కరీ తాజాగా ఈ అంశంపై ఒక ప్రకటన చేశారు. త్వరలో సైరన్ మోత స్థానంలో భారతీయ సంగీతాన్ని సైరన్‌గా వినిపించబోతున్నట్లు చెప్పారు. దీనిపై కొత్త పాలసీని కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తోందన్నారు. అలాగే శబ్ద కాలుష్యాన్ని తగ్గించేందుకు, వీఐపీ వాహనాలకు సంబంధించి రెడ్ లైట్ వినియోగించే సంస్కృతికి ముగింపు పలికేందుకు ఇదో చక్కటి అవకాశమని గడ్కరీ అన్నారు. ప్రస్తుతం అమలవుతున్న సైరన్‌ను కూడా తొలగించబోతున్నట్లు చెప్పారు.

దీని స్థానంలో శ్రావ్యమైన భారతీయ సంగీతం వినిపించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. చెవులు హోరెత్తించే సైరన్ శబ్దం బదులు.. ఫ్లూట్, తబలా, వయొలిన్, శంఖం వంటి భారతీయ సంగీత వాయిద్యాలతో కొత్త శబ్దం వినబడేలా మార్పులు చేస్తున్నట్లు తెలిపారు. శబ్ద కాలుష్యం నుంచి ప్రజలకు ఉపశమనం కలుగుతుందని చెప్పారు.