Layoffs: ఒకప్పుడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగమంటే లైఫ్ సెటిల్ అయిపోయిందన్న ధీమా. టెక్ కంపెనీలో ఉద్యోగం.. ఐదెంకల శాలరీ.. విదేశాల్లో ఆన్‌సైట్ ప్రాజెక్టులు.. బోనస్‌లు.. ఇన్‌సెంటివ్స్.. ఇంకేం.. బిందాస్‌గా బతికేయొచ్చన్న భరోసా. కొన్నేళ్లక్రితం ఏం చేస్తున్నావని ఎవర్ని పలకరించినా సాఫ్ట్‌వేర్ అని కాలర్ ఎగరేసుకుంటూ చెప్పేవాళ్లు. కానీ ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. పేరుకు పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేస్తున్నా.. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అంటూ ట్యాగ్ ఉన్నా.. చేస్తున్న ఉద్యోగం ఎంతకాలం ఉంటుందో.. ఎప్పుడు పింక్ స్లిప్ చేతికొస్తుందో అర్థంకాని పరిస్థితి. మెటా నుంచి గూగుల్ వరకు అన్ని బడా కంపెనీలు ఈ మధ్య కాలంలో భారీగా ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి. ఒకే సారి ఐదు నుంచి పదిహేను వేల మంది ఉద్యోగుల వరకు తొలగిస్తున్నాయి. ఇప్పుడు ఉద్యోగాల కోతకు సంబంధించి ఎక్కడ వార్తొచ్చినా.. అందులో ఎక్కువగా ఉండేవి టెక్ కంపెనీలే.
ఎప్పుడూ లేని స్థాయిలో కోతలు
2021 నుంచి టెక్ ఇండస్ట్రీలో లేఆఫ్స్ కొనసాగుతున్నా.. గతేడాది మాత్రం ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలు రికార్డు స్థాయిలో ఉద్యోగులను ఇంటికి పంపించాయి. 2022లో 649 శాతం లేఆఫ్స్ జరిగినట్టు వివిధ సంస్థల నివేదికలు చెబుతున్నాయి. 2020-21తో పోల్చితే 2022లో ఉద్యోగాల కోత ఎక్కువగా జరిగింది. అప్పటి నుంచి పరిస్థితి ఏమాత్రం మెరుగుపడకపోగా.. టెక్కీల జీవితాలను అగమ్యగోచరంగా మార్చేస్తోంది. తాజాగా పదివేల మందిని వదిలించుకోవాలని ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా నిర్ణయించింది. దీంతో టెక్కీల గుండెల్లో గుబులు మొదలయ్యింది. ఆల్ఫాబెట్ (గూగుల్), మెటా, ఇన్ఫోసిస్, టీసీఎస్, మైక్రోసాఫ్ట్, సేల్స్‌ఫోర్స్, ఐబీఎం, ట్విట్టర్.. ఇలా అనేక గ్లోబల్ కంపెనీలు తమ లాభనష్టాలతో సంబంధం లేకుండా వర్క్‌ఫోర్స్‌ను క్రమంగా తగ్గించుకుంటూ వస్తున్నాయి. ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లోనే టెక్ కంపెనీలు దాదాపు 2 లక్షల మందికి ఉద్వాసన పలికాయి. ఇది ఇలా ఎంతకాలం కొనసాగుతుందో తెలియని అయోమయ స్థితి టెక్ ఉద్యోగుల్లో ఉంది.
కర్ణుడి చావుకి అన్నట్టు..
లాభాల పంట పండుతున్నంత కాలం టెక్ కంపెనీలు ఉద్యోగులకు బంపర్ బొనాంజాలు ప్రకటిస్తూ ఉంటాయి. భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుందని ఆశించి మ్యాన్ పవర్‌ను ముందస్తుగా రెడీ చేసి కూడా పెట్టుకుంటాయి. కంపెనీలకు ప్రాజెక్టులు ఉన్నంతకాలం.. వరల్డ్ ఎకానమీ నిలకడగా ఉన్నంతకాలం టెక్ కంపెనీలు, వాటిలో పనిచేస్తున్న ఉద్యోగులు కాలుమీద కాలేసుకుని హ్యాపీగా ఉంటారు. కానీ ఎకానమీ ఈక్వేషన్స్ మారిపోగానే ఆ ప్రభావం నేరుగా టెక్ సంస్థల్లో పనిచేస్తున్న వారిపై పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా పెద్దపెద్ద కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగాల్లో కోత విధించడానికి అనేక కారణాలున్నాయి
నేలచూపు చూసే ఆర్థిక వ్యవస్థ
ఆర్థిక వ్యవస్థ ఏమాత్రం మందగమనంలో ఉన్నా మల్టీ నేషనల్ కంపెనీలు ముందు జాగ్రత్త చర్యలు మొదలుపెడతాయి. అమ్మో.. ఇంకేముందు మాంద్యం ముంచుకొస్తోంది.. కంపెనీ బ్యాలెన్స్ షీట్ దారితప్పుతోంది… ఇంక మీరు ఇంటికి దయచేయండి అంటూ ఉద్యోగులను గుమ్మం దాటించేస్తాయి. గతేడాది జూలై నుంచి అమెరికాలో ఆర్థిక మాంద్యం అన్న వార్తలు మొదలయ్యాయి. యూఎస్ బ్యూరో ఆఫ్ ఎకనమిక్ ఎనాలసిస్ ప్రకారం ఆర్థిక వ్యవస్థ బలహీనపడటం మొదలుపెట్టింది. అంతే.. వెంటనే కంపెనీలు ఖర్చులు తగ్గించుకుంటూ ఉద్యోగులకు గుడ్ బై చెప్పడం ప్రారంభించాయి.
ద్రవ్యోల్బణం
ఎకానమీకి అతిపెద్ద భూతం ద్రవ్యోల్బణం. ఇన్‌ఫ్లేషన్ ఎప్పుడైతే పెరుగుతుందో వెంటనే సామాన్యుల జీవితాలు తలకిందులైపోతాయి. ధరల పెరుగుదలతో ఖర్చులు తగ్గించుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి. గత నాలుగు దశాబ్దాల్లో ఎప్పుడూ లేనంతగా అమెరికాలో గరిష్టంగా ద్రవ్యోల్బణం నమోదైంది. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరగడంతో వ్యక్తులు, సంస్థలు సహజంగానే ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు మొగ్గుచూపుతాయి. ద్రవ్యోల్బణం పెరగడం వల్ల కంపెనీల రెవెన్యూ కూడా తగ్గిపోతుంది. పెరిగిన ఖర్చులను తగ్గించుకునేందుకు కంపెనీలు ఎంచుకునే మొదటి ఆప్షన్… ఉద్యోగాల తగ్గింపు. మెటా నుంచి గూగుల్ వరకు ప్రముఖ టెక్ సంస్థలన్నీ యాడ్ సేల్స్ పైన ఆధారపడ్డవే.
అధిక వడ్డీరేట్లు
ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేపేరుతో సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను గణనీయంగా పెంచడం కూడా కంపెనీలపై ప్రభావం చూపుతోంది. గతేడాదిలోనే అమెరికా ఫెడరల్ బ్యాంక్ ఏడు సార్లు వడ్డీ రేట్లను పెంచింది. అధిక వడ్డీ రేట్లు వెంచర్ క్యాపిటలిస్టులు, స్టార్టప్ ఫండింగ్‌పై ప్రభావం చూపుతాయి. ఆర్థిక వ్యవస్థ అనిశ్చితిగా ఉన్నప్పుడు పెట్టుబడిదారులు ఆచితూచి అడుగులు వేస్తారు. అందుకే కంపెనీలు ఉద్యోగులపక్షాన నిర్ణయాలు తీసుకోలేవు. సాధ్యమైనంతగా ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నమే చేస్తాయి.
పెట్టుబడి వర్సెస్ ఆదాయం
రూపాయి పెట్టుబడి పెట్టి పది రూపాయాలు లాభం ఆర్జించే రోజులివి. వేల కోట్ల పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు నిర్వహించే టెక్ కంపెనీలు.. లాభాల విషయంలో కూడా ఈ ఫార్ములానే వాడతాయి. లేకపోతే ఇన్వెస్టర్స్ డోర్లు క్లోజ్ చేస్తారు. ఉదాహరణకు గూగుల్ పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్‌కు ఉద్యోగుల సంస్థ తగ్గించుకోవాలని టీసీఐ ఫండ్ మేనేజ్ మెంట్ సంస్థ సూచించింది. అలాగైతేనే లాభాలు వస్తాయని తేల్చి చెప్పింది. దీంతో గూగుల్ లేఆఫ్స్ ప్రకటించడం మొదలుపెట్టింది. మెటా, మైక్రోసాఫ్ట్ కంపెనీలు కూడా ఇన్వెస్టర్ల నుంచి ఇదే తరహా ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. దీంతో ఆ ప్రభావం ఉద్యోగులపై పడుతోంది.
పని తక్కువ.. ఉద్యోగులు ఎక్కువ
ఇటీవల కాలంలో భారీగా ఉద్యోగాల్లో కోత పడటానికి ఒక విచిత్రమైన కారణం కనిపిస్తోంది. అదే వివిధ సంస్థలు అవసరానికి మించి ఉద్యోగ నియామకాలు చేపట్టడం. కోవిడ్ మహమ్మారి సమయంలో జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు కోవిడ్ నుంచి ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం మొదలు పెట్టడంతో భవిష్యత్తు ఇకపై సూపర్‌గా ఉంటుందని అతిగా ఆశలు పెట్టుకోవడంతో బడా కంపెనీలన్నీ విపరీతంగా మ్యాన్ పవర్‌ను రిక్రూట్ చేసుకున్నాయి. కానీ వాళ్ల అంచనాలు తప్పాయి. చేయాల్సిన పని కంటే… పనిచేసే ఉద్యోగులు ఎక్కువైపోవడంతో విధిలేని పరిస్థితుల్లో వాళ్లను ఇంటికి పంపించేస్తున్నాయి. 2020 మార్చిలో తమ ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు చేసిన మెటా సంస్థ… 2022 నుంచి భారీగా కోతలు పెడుతోంది. కరోనా మహమ్మారి సమయంలో ఆన్‌లైన్ వ్యాపారం పుంజుకోవడంతో కంపెనీలు భారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టాయి. వీళ్లంతా ఎంతో అనుభవం ఉన్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, డెవలపర్స్. అయితే, పాండమిక్ తర్వాత కంపెనీలకు రియాల్టీ అర్థం కావడంతో భారం తగ్గించుకుంటూ వస్తున్నాయి.
కుప్పకూలుతున్న బ్యాంకింగ్ వ్యవస్థ
ఆర్థిక వ్యవస్థ మందగమనం ఆమెరికా బ్యాంకింగ్ వ్యవస్థలపై తీవ్రంగా ఉంది. ఎంతో చరిత్ర ఉన్న సిలికాన్ వ్యాలీ బ్యాంక్ కుప్పకూలడం మరో కారణం. బ్యాంకులు కుప్పకూలడంతో వెంచర్ క్యాపిటలిస్టులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. బడా కంపెనీల నుంచి స్టార్టప్ కంపెనీల వరకు పెట్టుబడుల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. దీంతో కొత్త ఉద్యోగాలు రాకపోగా.. ఉన్న ఉద్యోగాలు కూడా ఊడుతున్నాయి.
ఉద్యోగాల ఊచకోత ఇంకా కొనసాగుతుందా ?
బిలియనీర్ ఎలాన్ మస్క్ ఇటీవల బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్‌లో ఉద్యోగుల సంఖ్యను 80 శాతం వరకు తగ్గించినట్టు బాంబు పేల్చారు. అంటే ట్విట్టర్ అతి తక్కువ మందితో వర్క్ చేస్తోంది. ఆర్థిక మాంద్యం పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థ తిరోగమనం ఇలాగే కొనసాగితే.. ట్విట్టర్ తరహాలోనే పెద్ద పెద్ద కంపెనీలు తక్కువ వర్క్‌ఫోర్స్‌తో పనిచేయించుకునే పరిస్థితులు రావొచ్చు. అయితే అన్ని మల్టీ నేషనల్ కంపెనీల పరిస్థితి ట్వట్టర్‍లా లేదు. కాబట్టి ఆ స్థాయిలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ టెక్కీల మెడపై మాత్రం లే ఆఫ్ కత్తి కొంతకాలం వరకు వేలాడుతూనే ఉంటుంది.