Tirupati Laddu: నందిని నెయ్యికి టీటీడీ బైబై.. ఇరవయ్యేళ్ల తర్వాత నెయ్యి కాంట్రాక్ట్ రద్దు.. లడ్డూ కోసం కొత్త నెయ్యి..!

కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కేఎంఎఫ్), నందిని బ్రాండ్ నెయ్యిని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి ఇరవయ్యేళ్లుగా అందిస్తోంది. అలాంటి సంస్థతో టీటీడీ తాజాగా ఒప్పందాన్ని రద్దుచేసుకుంది. దీంతో ఇరవయ్యేళ్లుగా సాగిన నందిని నెయ్యి సరఫరా నిలిచిపోయింది.

  • Written By:
  • Publish Date - August 1, 2023 / 03:29 PM IST

Tirupati Laddu: తిరుపతి లడ్డూలాంటి రుచి మరెక్కడా రాదని తెలిసిందే. ఆ లడ్డూకు ఆ రుచికి కారణమైన వాటిలో అందులో వాడే నెయ్యి కూడా ఒకటి. లడ్డూ తయారీలో నందిని బ్రాండ్ నెయ్యి వాడేవాళ్లు. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కేఎంఎఫ్), నందిని బ్రాండ్ నెయ్యిని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి ఇరవయ్యేళ్లుగా అందిస్తోంది. అలాంటి సంస్థతో టీటీడీ తాజాగా ఒప్పందాన్ని రద్దుచేసుకుంది. దీంతో ఇరవయ్యేళ్లుగా సాగిన నందిని నెయ్యి సరఫరా నిలిచిపోయింది.

ఈ విషయాన్ని కేఎంఎఫ్ అధ్యక్షుడు భీమా నాయక్ వెల్లడించారు. నందిని డైరీ ప్రొడక్ట్స్ ధర పెరగడం వల్ల, నెయ్యి, ఇతర డైరీ ఉత్పత్తుల్ని వేరే సంస్థ నుంచి కొనుగోలు చేస్తామని టీటీడీ చెప్పినట్లు భీమా నాయక్ తెలిపారు. ప్రస్తుతం ఈ అంశంపై టీటీడీ-కేఎంఎఫ్ మధ్య వివాదం నడుస్తోంది. కర్ణాటకకు చెందిన ప్రముఖ డైరీ బ్రాండ్ కేఎంఫ్. ఈ సంస్థ నందిని పేరుతో పాలు, పేరుగు, నెయ్యి, ఇతర డైరీ ఉత్పత్తుల్ని తయారు చేస్తుంటుంది. దాదాపు ఇరవై ఏళ్లుగా టీటీడీకి కేఎంఫ్ నెయ్యిని సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. కాంట్రాక్టు పునరుద్ధరణ విషయంలో రెండు సంస్థల మధ్య వివాదం మొదలైంది. తక్కువ ధరకే నెయ్యి సరఫరా చేయాలని టీటీడీ కోరింది. అయితే, టీటీడీ కోరిన ధరలో నెయ్యి సరఫరా చేయడం కుదరదని, దీనివల్ల నాణ్యత తగ్గుతుందని కేఎంఎఫ్ చెప్పింది.

తాము నాణ్యమైన నెయ్యి తయారు చేస్తున్నామని, ధరలు పెంచక తప్పడం లేదని కేఎంఎఫ్ తెలిపింది. ధర తగ్గించాలని టీటీడీ, తగ్గించే అవకాశాలు లేవని కేఎంఎఫ్ చెప్పడంతో టీటీడీ కాంట్రాక్టును రద్దు చేసుకుంది. మరో సంస్థ నుంచి నెయ్యి కొనుగోలు చేసేందుకు టీటీడీ ప్రయత్నిస్తోంది. మరోవైపు టీటీడీతోపాటు ఇతర దేవాలయాలకు నెయ్యి సరఫరా చేసే టెండర్ల విషయంలో సమీక్ష జరుపుతామని కేఎంఎఫ్ వెల్లడించింది. ఇదే విషయాన్ని టీటీడీకి కూడా తెలిపింది. కానీ, పెంచిన ధరలకు టీటీడీ అంగీకరించడం లేదు. పాత ధరల ప్రకారమే నెయ్యి సరఫరా చేయాలని కోరుతోంది. రెండింటి మధ్య ఒప్పందం కుదరకపోవడంతో ఆగష్టు 1 నుంచి కేఎంఎఫ్ నుంచి నెయ్యి సరపరా చేయడం లేదు. ప్రస్తుతం టీటీడీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు టీటీడీ ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ గత మార్చిలో నెయ్యి సరఫరా కోసం నిర్వహించిన టెండర్లలో కేఎంఎఫ్ పాల్గొనలేదని చెప్పారు. కేఎంఎఫ్ ప్రారంభమైనప్పటి నుంచి ఆ సంస్థ టీటీడీ టెండర్ దక్కించుకుంటూ వచ్చింది.