ANDHRA PRADESH: నో నైటీ ప్లీజ్‌.. ఆ ఊర్లో నైటీలు వేసుకుంటే రూ.2 వేలు జరిమానా..!

ఈ గ్రామంలో ఉన్న నిబంధన ప్రకారం నైటీలు వేసుకుని రోడ్లపైకి వస్తే రెండు వేల రూపాయల జరిమానా విధిస్తారు. ఇలా నైటీలతో తిరుగుతున్నవాళ్లను పట్టిస్తే వాళ్లకు వెయ్యి రూపాయలు బహుమతి కూడా ఇస్తారు. ఈ నిబంధనను అతిక్రమిస్తే ఏకంగా గ్రామం నుంచి వెలివేస్తామని గ్రామ పెద్దల కమిటీ నిర్ణయించింది.

  • Written By:
  • Publish Date - October 12, 2023 / 07:37 PM IST

NDHRA PRADESH: కాలేజ్ అమ్మాయిలు జీన్స్ ఫ్యాంట్‌లు, పొట్టి స్కర్టులు వేసుకోకూడదనే నిబంధన గురించి విన్నాం. కానీ, మహిళలు సౌలభ్యం కోసం వేసుకునే నైటీలపై కూడా నిషేదం విధించడం ఎప్పుడైనా విన్నారా..? ఒక ఊర్లో ఈ నిబంధన ఉంది. ఇదెక్కడో నార్త్‌ ఇండియాలో కాదు.. మన ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న నిడమర్రు మండలంలోని తోకలపల్లి గ్రామంలో. ఈ గ్రామంలో ఉన్న నిబంధన ప్రకారం నైటీలు వేసుకుని రోడ్లపైకి వస్తే రెండు వేల రూపాయల జరిమానా విధిస్తారు.

ఇలా నైటీలతో తిరుగుతున్నవాళ్లను పట్టిస్తే వాళ్లకు వెయ్యి రూపాయలు బహుమతి కూడా ఇస్తారు. ఈ నిబంధనను అతిక్రమిస్తే ఏకంగా గ్రామం నుంచి వెలివేస్తామని గ్రామ పెద్దల కమిటీ నిర్ణయించింది. ఈ నిబంధనల్లో కొన్ని సడలింపులు కూడా చేశారు. మహిళలు రాత్రి వేళల్లో ఇళ్లల్లో ఉన్నప్పుడు నైటీలు వేసుకుంటే ఎలాంటి అభ్యంతరం ఉండదు. కానీ, పగటి వేళల్లో నైటీలు ధరించకూడదు. ముఖ్యంగా నైటీలు ధరించి గ్రామంలో తిరిగితే 2 వేలు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఈ జరిమానా సొమ్మును గ్రామంలో అభివృద్ధి పనులకు ఉపయోగిస్తామని చెప్తున్నారు గ్రామ పెద్దలు. అసలు ఇలా చేయడానికి కారణం ఏంటయ్యా అంటే.. కొంత కాలంగా గ్రామంలో జరిగే సభలు, సమావేశాలకు ఆడవాళ్లు నైటీలతో రావడం ఎక్కువగా పెరిగిందట. వీటిపై తోటి మహిళలు అభ్యంతరం వ్యక్తం చేస్తుండటంతో చిన్నపాటి గొడవలు జరిగేవట. 20 నుంచి 35 ఏళ్ల మహిళలు నైటీలతోనే తమ పిల్లలను స్కూల్లో దింపటం, పాఠశాల బస్సులు ఎక్కించటం, కిరాణా దుకాణాలకు వెళ్లడం, డ్వాక్రా సమావేశాల్లో పాల్గొనటంతో గ్రామ పెద్దల్లో ఊరి ఆచారాలు, కట్టుబాట్లపై ఆందోళన నెలకొందట. పగటిపూట నైటీలతో సంచరించడం వల్ల కుటుంబాల్లో సమస్యలు తలెత్తుతున్నాయనే ఫిర్యాదులు కూడా వచ్చాయట.

ఈ నేపథ్యంలో ఏడు నెలల క్రితం మహిళలంతా గ్రామ పెద్దలతో కలిసి దీనిపై చర్చించి, ఒక నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో ఉదయం ఆరు నుంచి రాత్రి ఏడు గంటల వరకూ నైటీలతో సంచరించరాదని నిషేధం విధించారు. మైకుల్లో ప్రచారం చేశారు. అతిక్రమిస్తే జరిమానాకు సిద్ధమవ్వాలని హెచ్చరించారు. అయితే కట్టుబాట్ల పేరుతో మహిళల స్వేచ్ఛను హరించటం ఏంటని గ్రామంలో కొందరు వాదిస్తున్నారు. ఏది ఏమైనా ఈ గ్రామ పెద్దలు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.