NueGo bus: ప్రయాణం అంటే మనకు టక్కున గుర్తుకు వచ్చేది బస్సు. ఆ బస్సులోనే మనం నిత్యం ప్రయాణిస్తుంటాం. ఉద్యోగ రీత్యా రోజువారీ ప్రయాణం, పండుగ సమయంలో ఊళ్లకు వెళ్లడం, వేసవి సమయంలో టూర్లకు వెళ్లడం, ప్రముఖ దేవస్థానాలకు వెల్లడం.. ఇలాంటివాటికి బస్సునే ఆశ్రయిస్తుంటాం. మరికొన్ని సార్లు ఏ సమయంలో ఏ బస్సు తక్కువ ధరకు వస్తుందో చూసుకుని మరీ, నెలల ముందు బూకింగ్ చేసుకుంటాం. తక్కువ ధరకే బస్సు టికెట్ లభిస్తే అప్పుడు వెళ్తాం. లేకపోతే కొన్ని రోజులు ఆగి మన బడ్జెట్ ధరకే టికెట్ బుకింగ్ చేసుకుని వెళ్తాం. అలాంటి వారికి ఓ సంస్థ ఒక సువర్ణ అవకాశం కల్పించింది.
దేశంలోనే అగ్రగామి ఇంటర్-సిటీ ఎలక్ట్రిక్ ఏసీ కోచ్ సర్వీస్ న్యూగో అనే సంస్థ సమాజంలో ఒక మార్పును తీసుకురావాలనే ఉద్దేశంతో, ఈ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా న్యూగో సంస్థకు చెందిన కొన్ని బస్సులను దేశ వ్యాప్తంగా కొన్ని రూట్స్‌లో “రూపాయికే దేశ వ్యాప్తంగా తిరిగే ఆఫర్” ప్రకటించింది. కేవలం ఒక్క రూపాయితోనే ప్రయాణం చేయొచ్చు అని బంపరాఫర్ ప్రకటించింది న్యూగో సంస్థ.
ఈ సందర్భంగా గ్రీన్‌సెల్ మొబిలిటీ సీఈఓ దేవేంద్ర చావ్లా మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ కోసం, దేశాన్ని పచ్చదనంగా మార్చడం కోసం ఈవీ సేవలు కొనసాగిస్తున్నామని చెప్పారు. ఇక పర్యావరణహిత ప్రయాణాలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించడం కోసం “రూపాయికే దేశ వ్యాప్తంగా తిరిగే ఆఫర్” ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు శ్రీకారం చుట్టామన్నారు. కానీ ఈ అవకాశం ఒక్కరోజు మాత్రమే అని, అది కూడా ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం రోజున మాత్రమే అని స్పష్టం చేసింది న్యూగో సంస్థ. హైదరాబాద్- విజయవాడ, ఇండోర్-భోపాల్, బెంగుళూరు-తిరుపతి, చెన్నై-పుదుచ్చెరి, ఢిల్లీ-చంఢీగడ్, ఢిల్లీ-ఆగ్రా, ఢిల్లీ-జైపూర్, ఆగ్రా-జైపూర్ మార్గాల్లో తిరిగే బస్సుల్లో మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. దీనితో పాటు మొబైల్ యాప్ ద్వారా కూడా టికెట్ బుకింగ్ చేసుకోవచ్చని న్యూగో సంస్థ ప్రకటించింది.