సాధారణంగా ఉల్లి ధర బంగారం లాగా గరిష్టంగా ఉంటుంది. ఉల్లి కొనాలంటే భయపడతారు మధ్య, దిగువ తరగతి ప్రజలు. అలాంటి పరిస్థితులు ఇప్పుడు మారాయి. బయట హోటల్స్ లోనో, మిర్చీ బండి వద్దకో, పానీపూరీ షాపుకో తినడానికి వెళ్లినప్పుడు ఉల్లి అదనంగా అడగాలంటే భయపడే పరిస్థితులు పోయాయి. మనం అడగకుండానే సరిపడా ఉల్లి ముక్కలను వ్యాపారస్థులే ఇచ్చేలా పరిస్థితులు వచ్చాయి. ఇంకా గట్టిగా చెప్పాలంటే రెస్టారెంట్లలో ఫుడ్ ఆర్డర్ పెట్టినప్పుడు సాలాడ్ ఇవ్వరు. దీనికి ప్రత్యేకంగా డబ్బులు వసూలు చేయాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అలా ఉండకపోవచ్చు. దీనికి కారణం ఉల్లి ధర చాలా కనిష్ట స్థాయికి పడిపోవడమే. కావాలంటే ఒకసారి ట్రై చేయండి.
అంతర్జాతీయ మార్కెట్లో చుక్కలనంటిన ధర:
మన దేశంలో ఇలా ఉంటే మన పోరుగు దేశాల్లో దీని ధర రెట్టింపు స్థాయికి రెట్టింపులో ఉంది. భారత్ లో ఉల్లి ధర రూ.15 నుంచి రూ.20 మధ్య ఉంది. అదే మన దాయాది దేశంగా పిలువబడే పాకిస్తాన్ లో సాధారణంగా రూ.50 వరకూ ఉండే ధర ప్రస్తుతం రూ. 250 నుంచి రూ.300 పలుకుతుంది. ఇది కేవలం ఒక్క కిలో రేటు మాత్రమే. దీనిని బట్టి మన ఉల్లిని అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించి డీలర్లు క్యాష్ చేసుకుంటున్నారు అన్న విషయం అర్థమౌతుంది. ఫిబ్రవరి 15 నుంచి బంగ్లాదేశ్ కి ఎగుమతులు నిలిపివేయడం కూడా ప్రదాన కారణంగా కనిపిస్తుంది.
ఢిల్లీ మార్కెట్ కేంద్రంగా వ్యాపారం:
మనకు ఉల్లి ఉత్పత్తి అయ్యే ప్రాంతాలు మహారాష్ట్రలోని నాసిక్, రాజస్తాన్, పూణే, గుజరాత్ ప్రదానమైనవి. అలాగే ఢిల్లీలోని ఆజాద్ పూర్ మండిలో అమ్మకాలు ఎక్కవ స్థాయిలో ఉంటుంది. ప్రతిరోజూ 50 నుంచి 60 ట్రక్కుల ఉల్లి రవాణా అవుతూ ఉంటుంది. దాదాపు 1000 నుంచి 1500 టన్నుల ఉల్లిపాయలు మార్కెట్లోకి వస్తుండటంతో సప్లై పెరిగింది. ఈ మార్కెట్ కు చుట్టు పక్కల పరిసర ప్రాంతాలైన రాజస్తాన్ నుంచి వస్తున్న ఉల్లి కిలోకి రూ. 3 నుంచి రూ.6 మధ్య అమ్ముతున్నారు. అదే మహారాష్ట్ర నాసిక్, గుజరాత్ నుంచి వస్తున్న ఎర్రగడ్డలకు కొంచ ధర అధికంగా కిలోకి రూ. 10 నుంచి రూ. 12 మధ్య ధర పలుకుతోంది. దేశంలోనే అత్యంత ఖరీదైనదిగా పేరుగాంచిన ఉల్లి పూణే నుంచి వస్తుంది. దీని కేజీ ధర రూ. 15 నుంచి రూ.18 వరకూ పలుకుతుంది. దీంతో రీటైల్ మార్కెట్ పై ప్రభావం పడి ధర తగ్గినట్లు తెలుస్తుంది.
రబీ ఎఫెక్ట్ ప్రస్తుత మార్కెట్ పైన:
ఒకేసారి అన్ని ప్రాంతాల నుంచి వస్తున్న ఉల్లి కారణంగా ఆశించినంత వినియోగంలోకి లేకపోవడంతో ధరలు అమాంతం పడిపోయాయి. అందుకే రైతు చేతికి చిల్లర మిగులుతోంది. ఇదిలా ఉంటే హోలీ పండుగ తరువాత లేదా మార్చి 15 నుంచి మరింత తగ్గే అవకాశం అందని ఆజాద్ పూర్ మండీలోని వ్యాపారస్తులు అంచనా వేస్తున్నారు. దీనికి కూడా బలమైన కారణమే ఉంది. ఈ నెల మధ్యలో రబీ పంట సాగు గడువు ముగిసి అదికూడా మార్కెట్లోకి వస్తుంది. దీని రాకతో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఉల్లి నిలువలను త్వరగా విక్రయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు డీలర్లు. అందుకే వీలైనంత తక్కువ ధరలకు రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. భవిష్యత్తులో రానున్న ఉత్పత్తిని దృష్టిలో ఉంచుకొని వర్తమానంలో ఇలా తక్కువకు విక్రయించడం వల్ల రైతులకు వ్యవసాయం శాపంగా మారిందని చింతించాల్సిన పరిస్థితి తలెత్తింది.
మార్చిలో మేలిమిజాతి ఉల్లి:
రంగుల పండుగ తరువాత మార్కెట్లోకి వచ్చు గడ్డను గర్భా ఉల్లి అని పిలుస్తారు. దీని జాతి అన్నింటికన్నా ఉత్తమమైనది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఎక్కవ కాలం నిలువ ఉంచినా చెడిపోదు. దీని రంగు ఎర్రగా ఉంటుంది. దీనిని మార్చి నెల నుంచి అక్టోబర్ మాసం వరకూ వినియోగిస్తారు. ఈ 6 నుంచి 8 నెలల కాలంలో వర్షాలు పడినా ఆతేమకు పాడుకావు. అందుకే అందరూ ఈరకమైన మేలిమిజాతి ఉల్లికి మక్కువ చూపిస్తున్నారు. ఆగడ్డలు అందుబాటులోకి వస్తే మళ్లీ తిరిగి ఉల్లిధర మిన్నంటడం తధ్యం.
మార్కెట్ స్థితిని బట్టీ రైతు వ్యవసాయం చేయలేడు కాబట్టి ఉత్పత్తి చేసిన పంట నష్టానికే అమ్ముకోవల్సి వస్తుంది. ఒకవైపు ప్రకృతి సహకరించక నష్టం ఏర్పడితే మరోవైపు మార్కెట్ పరిస్థితులకు కూడా ఇబ్బందులకు గురికావల్సి వస్తుంది. ఒక రకమైన ఉల్లి కోసం మరో రకం ఉల్లిని తక్కుచేసి రైతుకు శోకాన్ని మిగిలిస్తున్నారు. ఉల్లికి ఉల్లే శత్రువు అనేలా పరిస్థితులు మారిపోయాయి.
T.V.SRIKAR