Pakistan: పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందన్న సంగతి తెలిసిందే. ఆర్థికంగా దివాళా తీసిన పాక్.. ఇప్పుడు ఆహార సంక్షోభాన్ని కూడా తీవ్రంగా ఎదుర్కుంటోంది. ఈ పరిస్థితిని ఇప్పుడు గ్రహించిన పాక్ సైన్యం తీరిగ్గా దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. దేశంలో ఆహార కొరత తీర్చేందుకు వ్యవసాయం చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్‌లో ఉన్న దాదాపు 10 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమిని పాక్ సైన్యం కౌలుకు తీసుకోబోతుంది.
నిక్కి ఆసియా అనే మీడియా సంస్థ దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించింది. ఈ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. పాక్ ఆర్థిక సంక్షోభం ప్రభావం ఆహారంపై కూడా పడింది. ప్రజలు ఆహారం లేక అల్లాడుతున్నారు. పెరిగిన ధరలతో ఆహారం కొనలేక సతమతమవుతున్నారు. మరోవైపు వ్యవసాయం చేయడానికి ఎరువులు, విద్యుత్ సరఫరా వంటివి కూడా లేవు. ఈ పరిస్థితుల్లో దేశాన్ని ఆహార సంక్షోభం నుంచి గట్టెక్కించడం ముఖ్యమని సైన్యం గుర్తించింది. ఇందుకోసం వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించుకుంది. దీనిలో భాగంగా పంజాబ్ ప్రాంతంలో ఉన్న పది లక్షల ఎకరాల భూమిన రైతుల దగ్గరి నుంచి కౌలకు తీసుకోబోతుంది. ఈ భూమిలో ఆహార పంటలైన గోధుమలు, చెరకు, కూరగాయలు, పండ్లతోపాటు పత్తి వంటి వాణిజ్య పంటలను సాగు చేయబోతుంది.
సైన్యం విధానం ఇదే..
భూమిని కౌలుకు తీసుకున్న సైన్యం పంటలు పండిస్తుంది. దీని ద్వారా వచ్చే లాభాల్లో 20 శాతంవ్యవసాయ పరిశోధన, అభివృద్ధికి కేటాయిస్తుంది. మిగిలిన లాభాలను సైన్యం, రాష్ట్ర ప్రభుత్వం సమానంగా పంచుకుంటాయి. దీని ద్వారా ఆహారం ఉత్పత్తి అవుతుంది. ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుంది. పేదలకు ఆహార భద్రత కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు సైన్యం పేర్కొంది. కానీ, సైన్యం నిర్ణయంపై స్థానిక రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సైన్యం తమ భూమి తీసుకుని, పేద గ్రామీణ ప్రజల హక్కులను కాలరాస్తుందనే విమర్శలు వస్తున్నాయి. పాక్‌లో దాదాపు 2.5 కోట్ల మంది భూమి లేని పేదలుగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న భూమిని కూడా సైన్యం తీసుకోవడంపై ప్రజల నుంచి విమర్శలొస్తునాయి. తమ భూమి సైన్యం పరమవుతుందేమో అని భయపడుతున్నారు.