Pancharamam: ఆంధ్రప్రదేశ్ లోని అతిపురాతన శైవక్షేత్రాల విశిష్టత శివరాత్రి స్పెషల్ స్టోరీ..!

ప్రకృతిలో నిలయమై.. అదేప్రకృతిని లయం చేసేవాడు పరమేశ్వరుడు. కాలాన్ని భ్రమింపచేస్తూ సమస్త జీవకోటికి మనుగడను ప్రసాదిస్తున్న ముక్తిధామనివాసి ఈశ్వరుడు. ఈయన లేని చోటు ఏదీ..? సమస్తం శివోహం. ఈ సందర్బంగా కొన్ని అత్యంత పురాతనమైన శైవక్షేత్రాల విశేషాలు మీకోసం.

  • Written By:
  • Updated On - February 17, 2023 / 08:45 AM IST

దక్షిణభారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు ప్రసిద్ద శైవక్షేత్రాలు ఉన్నాయి. అవే పంచారామ క్షేత్రాలు. కుమారస్వామి తారకాసురుణ్ని సంహరించినప్పుడు తన కంఠంలోని శివలింగాలు ఐదు ముక్కలుగా వివిధ ప్రదేశాల్లో పడిపోయాయి. అవే పంచారామక్షేత్రాలుగా ప్రసిద్దికెక్కాయి. క్రీస్తుశకం 15శతాబ్దంనాటి శ్రీనాధుడు రచించిన భీమేశ్వరపురాణంలో కూడా దీనిగురించి ప్రస్తావించారు. ఈ పంచారామ క్షేత్రాల్లో ప్రతి లింగాన్ని దేవతలు ప్రతిష్టించారని ఇక్కడి స్థలపురాణాలు చెబుతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

దాక్షారామం:
ఇది తూర్పుగోదావరిజిల్లాలో ఉంది. ఇక్కడ స్వామి భీమేశ్వరుడు, అమ్మవారు మాణిక్యాంబ పేర్లతో పిలవబడే శైవక్షేత్రం. ఇక్కడి క్షేత్రపాలకులు లక్ష్మీనారాయణులు. ఈ ఆలయం కాకినాడ నగరానికి 35కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. ఈ ఆలయంలో వైష్ణవాలయాలతో పాటూ శక్తిపీఠం ఉన్న దివ్యక్షేత్రం. దక్షప్రజాపతి ఇక్కడ యజ్ఞం చేశాడు. అందుకనే ఇది దక్షారామం అయింది. తారాకాసురుడి వధ జరిగిన తరువాత శివలింగంలోని కొంతభాగం ఈ ప్రాంతంలో పడిందని తెలుసుకున్న సప్తర్షులు ప్రభాతకాలంలో ఆలింగానకి గోదావరీ జలాలతో అభిషేకం చేయాలనుకున్నారు. మార్గంమధ్యలో తుల్యమహర్షి యజ్ఞం చేస్తున్నాడు. ఋషులు తెస్తున్న జలాలు తన యజ్ఞాన్ని ముంచేస్తాయని వారిని నిలువరించారు. ఈ లోపూ తెల్లవారింది. సూర్యభగవానుడు శివలింగానికి తన కిరణాలతో సుప్రభాతాభిషేకం చేశాడు. నిరాశ చెందిన ఋషులను ఓదార్చడానికి వేదవ్యాసుడు వచ్చాడు. సప్తగోదావరీ జలాలను అక్కడి పుష్కరిణిలో కలిపానని.. వాటితో అభిషేకించమని చెబుతాడు. దీంతో నిత్యం ఈ పుష్కరిణి జలాల నుంచే స్వామి వారి అభిషేకం జరుగుతుండటం విశేషం. ఈ ఆలయానికి నాలుగు ప్రాకారాలున్నాయి. భీమేశ్వరుని లింగం ఎత్తు 2.5 మీటర్ల ఎత్తులో నలుపు, తెలుపు రంగుల్లో ఉంటుంది. ఈ ఆలయం రెండంతస్థుల్లో ఉండి. అభిషేకాలు అక్కడి నుంచే చేస్తారు. ఈ దేవాలయాన్ని తూర్పుచాళుక్యుల కాలంలో క్రీస్తుశకం 892-922 మధ్య నిర్మించబడిందని అక్కడి గోడలపై ఉన్న శాశనాలు చెబుతున్నాయి.

కుమారారామం:
ఇదికూడా తూర్పుగోదావరిజిల్లాలోని సామర్లకోటలో ఉంది. ఇక్కడ స్వామి భైరవుడు, భీమేశ్వరుడుపేరుతో కొలువుదీరగా అమ్మవారు బాలాత్రిపుర సుందరీదేవి రూపంలో పూజలందుకుంటున్నారు. ఇక్కడి లింగం 60అడుగుల ఎత్తున రెండంతస్థుల్లో ఉంటుంది. ఈ ఆలయాన్ని చాళుక్యరాజైన భీమేశ్వరుడు నిర్మించినట్లు స్థలపురాణం ద్వారా తెలుస్తుంది. దాక్షారామ ఆలయాన్ని కూడా ఇతనే నిర్మించడంతో ఈ రెండు ఆలయాల నిర్మాణ శైలి ఏకరూపంలో ఉంటుంది. నిర్మాణానికి వినియోగించిన రాయి కూడా ఒకేలా ఉంటుంది. ఈ ఆలయ నిర్మాణం క్రీస్తు శకం 892లో ప్రారంభమై 922 వరకూ కొనసాగింది. పూర్వం దీనిని చాళక్య భీమవరంగా పిలిచేవారు.

క్షీరారామం:
ఇది పశ్చిమగోదావరిజిల్లాలోని పాలకొల్లులో ఉంది. ఇక్కడి ఈశ్వరమూర్తిని శ్రీ క్షీరా రామలింగేశ్వరస్వామిగానూ అమ్మవారిని పార్వతీదేవి పేరుతో పూజిస్తారు. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు జనార్ధనుడు. ఈ క్షేత్రంలోని లింగాన్ని శ్రీరాముడు త్రేతాయుగంలో ప్రతిష్టించినట్లుగా ప్రతీతి. 9అంతస్థులతో 20అడుగుల ఎత్తులో ఆకర్షణీయంగా కనపడే రాజగోపురం ఇక్కడి విశేషం. చివరి అంతస్థు వరకూ వెళ్లేందుకు లోపల మెట్లను ఏర్పాటు చేశారు. ఇక్కడి శివలింగం రెండున్నార అడుగుల ఎత్తులో తెల్లగా ఉంటుంది. ప్రతి ఏటా ఉత్తరాయణం, దక్షిణాయణ ప్రారంభంలో సూర్యోదయం సమయంలో కిరణాలు పెద్దగోపురం నుంచి శివలింగాన్ని తాకటం ఇక్కడి మరో విశేషం.

భీమారామం:
ఇది పశ్చిమగోదావరిజిల్లాలోని భీమవరంలో ఉంది. ఇక్కడ స్వామి సోమేశ్వరుడిగా అమ్మవారు రాజరాజేశ్వరీదేవిగా కొలువుదీరారు. ఈ ఆలయాన్ని సోమేశ్వర, జనార్ధనస్వామి ఆలయం పేరుతో పిలుస్తారు. ఇక్కడి క్షేత్రపాలకుడు జనార్ధనస్వామి కావడమే దీనికి కారణం. తూర్పు చాళుక్యుల రాజైన భీముడు ఈ ఆలయాన్ని మూడో శతాబ్ధంలో నిర్మించాడు. మామూలు రోజుల్లో నలుపు రంగులో ఉండే శివలింగం అమావాస్య రోజు గోధుమ రంగులోకి మారుతుంది. తిరిగి పౌర్ణమి నాటికి యధారూపంలోకి వస్తుంది. ఇదే ఇక్కడి ప్రత్యేకత. ఈ ఆలయాన్ని కూడా రెండంతస్థుల్లో నిర్మించారు. పై అంతస్థులో అన్నపూర్ణాదేవి, సోమేశ్వరుడు క్రింది అంతస్థులో ఉంటారు.

అమరారామం:
ఇది గుంటూరు జిల్లాలోని అమరావతిలో ఉంది. ఇక్కడ మహేశ్వరుడు అమరలింగేశ్వరుని రూపంలో అమ్మవారు బాలచాముండి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. క్షేత్రపాలకుడు వేణుగోపాలస్వామి. ఈ క్షేత్రం గుంటూరు పట్టణానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి స్పటికలింగం ఎత్తు 16అడుగులు ఉంటుంది. శివలింగం చుట్టూ రెండు అంతస్థులు నిర్మించబడి ఉంటాయి. విగ్రహానికి అభిషేకం చేయాలంటే రెండవ అంతస్థుపైకి ఎక్కి నిర్వహించాలి. ఈ ఆలయం మూడు ప్రాకారాలతో నిర్మించబడింది. మొదటి ప్రాకారంలో ప్రణవేశ్వరుడు, కాశీ విశ్వేశ్వరుడు, అగస్తేశ్వరుడు, పార్థివేశ్వరుడు, సోమేశ్వరుడు, కొలలేశ్వరుడు, వీరభద్రుడు, త్రిపురసుందరీ దేవి, కళ్యాణమండపం, కృష్ణానదికి మార్గము ఉంటుంది. ఇక రెండవ ప్రాకారంలో విఘ్నేశ్వరుడు, కాలభైరవుడు, కుమారస్వామి, నవగ్రహ మండపం, యజ్ఞశాలలు ఉన్నాయి. మూడవ ప్రాకారానికి వస్తే శ్రీశైల మల్లేశ్వరుడు, సూర్యభగవానుడి ఆలయాలు ఉన్నాయి.

 

 

 

T.V.SRIKAR