Pandemic: కరోనా వైరస్ ప్రపంచాన్ని ఏ రేంజ్‌లో అతలాకుతలం చేసిందో తెలిసిందే. ఆ చీకటి రోజుల్ని తల్చుకుంటే భయపడనివాళ్లు ఉండరు. అలాంటి రోజులు మళ్లీ రాకూడదని దేవుణ్ణి మొక్కని వాళ్లు కూడా ఉండరు. కరోనా దాదాపు ముగింపు దశకు చేరుకుందని ఆనందించేలోపు మరో షాకింగ్ విషయం బయటకొచ్చింది.
పదేళ్లలో కరోనా వైరస్ లాంటి మరో వైరస్ రాబోతోందనే భయంకరమైన వార్త చెప్పింది ఓ రీసెర్చ్ ఆర్గనైజేషన్. లండన్‌లోని ఎయిర్‌ఫినిటీ లిమిటెడ్ అనే రీసెర్చ్ ఆర్గనైజేషన్ రీసెంట్‌గా కొన్ని రీసెర్చ్‌లు, సర్వేలు నిర్వహించింది. వాళ్లు చేసిన రీసెర్చ్‌లో మరో వైరస్ వచ్చే ప్రమాదం ఉన్నట్టు 27.05 శాతం ఉన్నట్లు తేలిందది. ఈ వైరస్ కూడా చాలా వేగంగా ప్రపంచాన్ని చుట్టేసే ప్రమాదముందని చెప్తున్నారు ఎయిర్‌ఫినిటీ సైంటిస్టులు. రోజురోజుకూ వాతావరణంలో వస్తున్న మార్పులు, ఇంటర్నేషనల్ ట్రావెల్స్ పెరగడం, జనాభా పెరుగుదల, జంతువుల నుంచి మనుషులకు సోకే వ్యాధులు పుట్టుకొస్తుండటం కొత్త వైరస్ పుట్టుకకు కారణాలు అవుతాయని అంచనా వేస్తున్నారు.
వైరస్ వచ్చిన 100 రోజుల్లో వ్యాక్సిన్ తయారు చేయగలిగితే దాని ప్రమాదం నుంచి బయటవచ్చని చెప్తున్నారు. ఏమాత్రం ఆలస్యం చేసినా కరోనాను మించిన కల్లోలం జరగడం గ్యారెంటీ అని చెప్తున్నారు. అయితే కరోనా లాంటి వైరస్ గడిచిన వందేళ్లలో రాలేదని అప్పట్లో కొందరు సైంటిస్టులు చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం మరో పదేళ్లలోనే కరోనా లాంటి మరో వైరస్ వస్తుందని తెలియడం ఆందోళన కలిగిస్తోంది. అయితే చాలా దేశాలతో పోలిస్తే ఇండియా పరిస్థితి కాస్త బాగానే ఉన్నా.. ఇక్కడ వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తుంది. ఇప్పటికే ఇండియాలో సార్స్, మెర్స్, కరోనా లాంటి పాండమిక్‌లు ఈ విషయాన్ని రుజువు చేశాయి. ఇటీవల హెచ్1ఎన్1 బర్డ్ ఫ్లూ స్ట్రెయిన్ కూడా మానవాళిని ఓ రేంజ్‌లో టెన్షన్ పెట్టింది.
ఇలాంటి పరిస్థితిలో మళ్లీ కొత్త వైరస్ అంటే అది మానవాళిని ప్రమాదంలో పడేసే స్థాయిలో ఉంటుందని అంచనా వేస్తున్నారు సైంటిస్టులు. కరోనా నుంచి నేర్చుకున్న అనుభవాలతో కొత్త వైరస్‌ను ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలని చెప్తున్నారు. ఇప్పుడున్న టెక్నాలజీతో వైరస్‌ను గుర్తించడం కూడా కష్టం కావచ్చని భావిస్తున్నారు. టెక్నికల్‌గా, మెడికల్‌గా ఫ్యూచర్‌లో వచ్చే వైరస్‌ను గుర్తించి, తట్టుకునేందుకు అన్ని దేశాలు ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.