‘మీ అబ్బాయిని టెన్త్ తర్వాత ఎక్కడ జాయిన్ చేద్దామనుకుంటున్నారు? మా కాలేజీలో ముందుగా అడ్మిషన్ తీసుకుంటే 25పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాం.. ఎగ్జామ్ ఒకటి పెడతాం..అందులో మంచి మార్కులొస్తే 50 పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాం.. సమ్మర్‌లోనే బ్రిడ్జ్ కోర్స్ పేరిట ఐఐటీ క్లాసులు స్పెషల్‌గా చెబుతాం.’ ఇది సగటు తెలుగురాష్ట్రాల పేరెంట్స్ వినే మాటలు! టెన్త్ పరీక్షల ముగియకముందే..కాదు..కాదు.. పరీక్షల డేట్‌లు కూడా విడదలవకముందే..పరీక్ష జరగడానికి సుమారుగా నాలుగు నెలల ముందే ప్రతీ పేరెంట్‌కి కార్పొరెట్ కాలేజీలు చెప్పే సోది ఇది.
నిజంగానే కాలేజీ ఎంట్రెన్స్ అంటూ.. మార్కులు ఎక్కువొస్తే డిస్కౌంట్ అంటూ పరీక్ష పెడతారు. ఆ క్వశ్చన్ పేపర్ ఎవరు ప్రిపేర్ చేస్తారో తెలియదు కానీ.. అందులో కొన్ని ఇంటర్‌కి సంబంధించిన ప్రశ్నలుంటాయి. టెన్త్ క్లాసులో గానీ..అంతకముందు తరగతుల్లో గానీ ఎప్పుడూ చూడని కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇదో జిమ్ముక్కు! ఆ తర్వాత పిల్లలను పట్టుకొని పేరెంట్స్ కాలేజీలకు పోతారు. అక్కడ పిల్లలను ఇంప్రెస్ చేసేందుకు ఏవో పనికిమాలిన లాజిక్కులతో ‘అరే ఈ క్వశ్చన్ ఇంత ఈజీనా, మా స్కూల్ సర్ ఇలా చెప్పలేదే.. ఈ కాలేజీలో అన్నీ క్వశ్చన్స్‌కి ఇలాంటి లాజిక్కులే ఉంటాయెమో’ అన్న అభిప్రాయానికి పిల్లలు వచ్చేలా చేస్తారు. అటు పేరెంట్స్‌కి ఏమో.. ‘ఒకటి ఒకటి ఒకటి రెండు రెండు రెండు..ఇలా వందలోపు వెయ్యి ర్యాంకులు మావే..మావే..మావే’ అని మభ్యపెడతారు. టెన్త్ తర్వాత ఐఐటీ తప్ప ఏం చదివినా భవిష్యత్తు ఉండదని.. అందులో ర్యాంకు వస్తానే కెరీర్ ఉంటుందని..లేకపోతే బతుకు బందర్ బస్టాండేనని ఓ భయాన్ని పేరెంట్స్ మనసుల్లో నింపిపోతారు.
పిల్లల మాటలకు లేని ప్రాధాన్యత:
కొంతమందికి మ్యాథ్స్ రాదు..మరికొంత మందికి ఫిజిక్స్ రాదు.. ఈ రెండు రాని వాళ్లు కూడా చాలామందే ఉంటారు. నిజానికి అందరూ చదువు కోసమె పుట్టరు.. సరే ఆ విషయాన్ని పక్కన పెడదాం. టెన్త్‌లో అతి కష్టంమీద మ్యాథ్స్, ఫిజిక్స్ పాసైన విద్యార్థి ఇంటర్‌లో ఎంపీసీ తీసుకొని ఏం సాధిస్తాడు..? అదే సమయంలో ఆ విద్యార్థికి సోషల్‌లో ఎక్కువ మార్కులు వస్తే? అతనికి సోషల్ సబ్జెక్ట్‌పై పూర్తి పట్టు ఉంటే? ఆ స్టూడెంట్ కూడా ఎంపీసీనే తీసుకోవాలా? లేదు..! కానీ పేరెంట్స్‌కి ఇవేమీ పట్టవు.. ‘ఐఐటీ ర్యాంక్ వస్తానే లైఫూ’ అని కాలేజీవాళ్లు చెప్పిన మాట మాత్రమే వినిపడుతుంటుంది. ఇక ఆ పిల్లవాడు చచ్చినట్లు ఎంపీసీ తీసుకోవాల్సిందే! ఆ కాలేజీలో జాయిన అయిన తర్వాత ఎలాగో తనకు రాని సబ్జెక్టులో ఏం సాధించలేడు.. మార్కులు తక్కువ వచ్చాయన్న సాకుతో తీసుకెళ్లి లాస్ట్ సెక్షన్‌లో పడేస్తారు..! అక్కడ అందరూ మార్కులు తక్కువ వచ్చినవాళ్లే ఉంటారు..! సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది. ఐఐటీ చెబుతామంటూ జాయిన్ చేసుకున్న కాలేజీలు వాళ్లని ఇంటర్‌లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదివించడం వరికే పరిమితం చేస్తుంది. ఇంటర్ కాలేజీల్లో జరిగింది..జరుగుతుంది..జరగబోయేది ఇదే!
ఆర్ట్స్ గ్రూపులు ఎక్కడ సారూ:
ఎంపీసీ మాత్రమే గ్రూపు.. లేకపోతే బైపీసీ..! ఈ రెండు కాకుండా వేరేవి చదివిస్తే పేరెంట్స్‌కు అదో ప్రెస్టేజీ ఇష్యూ..! అయితే కొంతమంది తల్లిదండ్రులు కొంచెం ధైర్యం చేసి ఎంఈసీలో జాయిన్ చేస్తుంటారు. తమ పిల్లలకు సైన్స్ రావడంలేదనో..లేక ఎంఈసీ చదివి సీఏ ఎగ్జామ్‌కు ప్రిపేర్ చేపిద్దాం అనే ఆలోచనతోనో ఎంఈసీ గ్రూప్‌లో జాయిన్ చేస్తుంటారు. ఈ మూడు గ్రూపుల వరకు ఓకే కానీ..అటు ఆర్ట్స్ గ్రూపులు మాత్రం ఇంటర్‌లో తెలుగురాష్ట్రాల్లో ఎప్పుడో కనుమరుగైపోయాయి. అసలు ఆ గ్రూపులను కాలేజీలు ఎత్తిపడేశాయి. అంతా ఐఐటీ జపమే చేస్తున్న రోజులివి. అసలు టెన్త్ తర్వాత ఆర్ట్స్‌కు సంబంధించి గ్రూపులు ఏవీ కనిపించడలేదు.. మరోవైపు మిగిలిన రాష్ట్రాల్లో ఆర్ట్స్ గ్రూపులకు కూడా మంచి డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా 11th,12thలలో హ్యూమానిటిస్ తీసుకొని.. డిగ్రీ తర్వాత ప్రభుత్వ పరీక్షలు క్రాక్ చేస్తున్న నార్త్ ఇండియన్ల సంఖ్య చాలానే ఉంటుంది. నిజానికి ప్రతీ గ్రూప్‌కి సంబంధించి వందల సంఖ్యలో జాబులుంటాయి..మన తెలుగు రాష్ట్రాల పేరెంట్స్‌కి వాటిపై కనీస అవగాహన లేదు.. ఎందుకంటే వాళ్ల కార్పొరేట్ ట్రాప్‌లో పడిపోయి ఉన్నారు..! వాళ్లు చెప్పిన మాటలే మనసులో పెట్టేసుకొని..ఆ మాటలనే వైరస్ కంటే వేగంగా ఇతర పేరెంట్స్‌కి స్ప్రెడ్ చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. తమ పిల్లల భవిష్యత్తును నాలుగు గోడల మాధ్య..లాస్ట్ సెక్షన్‌లో మగ్గేలా చేస్తున్నారు.