Vande Bharat Trains: ఒకేరోజు 9 వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లు.. తెలంగాణకు ఎన్నంటే..

ఒకేసారి 9 రైళ్లను మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. దీంతో దేశంలో వందేభారత్ రైళ్ల సంఖ్య 34కు చేరింది. మరికొద్ది రోజుల్లోనే మరో 9 రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన రైళ్లలో ఒకటి కాషాయ రంగు కాగా, మిగిలినవి నీలం రంగులో ఉన్నాయి.

  • Written By:
  • Publish Date - September 24, 2023 / 05:42 PM IST

Vande Bharat Trains: దేశీయంగా తయారైన వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లను కేంద్రం వరుసగా ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు మార్గాల్లో 25 వందే భారత్ రైళ్లు ప్రారంభం కాగా.. తాజాగా మరో 9 రైళ్లను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఒకేసారి 9 రైళ్లను మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. దీంతో దేశంలో వందేభారత్ రైళ్ల సంఖ్య 34కు చేరింది. మరికొద్ది రోజుల్లోనే మరో 9 రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన రైళ్లలో ఒకటి కాషాయ రంగు కాగా, మిగిలినవి నీలం రంగులో ఉన్నాయి.

త్వరలో అందుబాటులోకి రాబోయే 9 రైళ్లు కాషాయం రంగులోనే ఉంటాయి. ఆదివారం ప్రారంభమైన వాటిలో తెలంగాణకు కూడా ఒక రైలు కేటాయించారు. హైదరాబాద్ టు బెంగళూరు మార్గంలో ఒక రైలును కటాయించారు. ఏపీకి సంబంధించి విజయవాడ టు చెన్నై (వయా రేణిగుంట) మార్గంలో మరో రైలును కేటాయించారు. తొమ్మిది రైళ్లలో తెలుగు రాష్ట్రాలకు చెరో రైలును ప్రభుత్వం కేటాయించడం విశేషం. ఈ 9 రైళ్లను ఆధ్యాత్మిక కేంద్రాలను కలుపుతూ కేటాయించినట్లు రైల్వే శాఖ తెలిపింది. ఇప్పటివరకు వందే భారత్ రైళ్లలో 1.11 కోట్ల మంది ప్రయాణించినట్లు రైల్వే శాఖ వెల్లడించింది.
కొత్త ఫీచర్లు కూడా
గతంలో ప్రారంభమైన వందేభారత్ రైళ్లతో పోలిస్తే ఇప్పుడొచ్చిన తొమ్మిదింటిలో సౌకర్యాల్ని మెరుగుపరిచారు. కొత్తగా వచ్చిన రైళ్లలో రిక్లైనర్ సీట్లను మెరుగుపరిచారు. అంటే మరింత ఎక్కువగా సీట్లను వెనక్కు జరుపుకోవచ్చు. సీటు కుషన్లు గట్టిగా ఉన్నాయని ప్రయాణికుల నుంచి గతంలో పలు ఫిర్యాదులొచ్చాయి. దీంతో ఈసారి సీటు కుషన్లను మరింత మెత్తగా తీర్చిదిద్దారు. ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్ సీట్ల రంగును ఎరుపు రంగు నుంచి నీలం రంగుకు మార్చారు. ఫుట్ రెస్ట్‌ను మరింత పొడిగించారు. సీట్ల కింద మొబైల్ చార్జింగ్ కోసం ఏర్పాటు చేసిన చార్జింగ్ పాయింట్లలో మార్పులు చేసి, సులువుగా యాక్సెస్ చేసేలా తీర్చిదిద్దారు. సీట్ల వెనుక భాగంలో మ్యాగజైన్ బ్యాగ్స్‌ ఏర్పాటు చేశారు.

వాష్ రూమ్స్‌లో మరింత కాంతినిచ్చే బల్బులను అమర్చారు. వాష్ బేసిన్ సైజ్ పెంచారు. వాటర్ ట్యాప్స్, టాయిలెట్ హ్యాండిల్స్ వంటివి కూడా వినియోగదారులకు సౌకర్యంగా ఉండేలా, మరింత అధునాతనంగా ఏర్పాటు చేశారు. ఏసీ సిస్టమ్‌ను, అగ్ని ప్రమాదాలను గుర్తించే ఏరోసోల్ ఫైర్ డిటెక్షన్ సిస్టమ్‌ను మరింత అభివృద్ధి చేశారు. ఎప్పటికప్పుడు ప్రయాణికుల నుంచి వచ్చి ఫిర్యాదులు, అభ్యంతరాలను దృష్టిలో ఉంచుకుని వందే భారత్ రైళ్లలో రైల్వే శాఖ మార్పులు చేస్తోంది.