Power Footwear: అమ్మాయిలూ.. కరెంట్ చెప్పులతో ఆకతాయిల ఆటలు కట్..

నేటి సమాజంలో మహిళల భద్రత కొరవడిందని చెప్పాలి. దీనికి కారణం ప్రతి రోజూ ఏదో ఒక సందర్భంలో స్త్రీ పై అఘాయిత్యం జరుగుతూనే ఉంది. ఇల్లు విడిచి బయటకు వెళ్లిన మొదలు తిరిగి ఇంటికి చేరుకునే వరకూ గడియ గడియ గండంలా మారిపోయాయి. దీనికి కారణం సమాజంలో కొందరు ఆకతాయిల చేష్టలు అని చెప్పాలి. వీటికి చెక్ పెట్టేందుకు ఎలక్ట్రిక్ చెప్పులను ఆవిష్కరించారు ఒక విద్యార్థి. ఈ చెప్పులను ఎలా తయారు చేశారు.. వీటి ప్రత్యేకతలేంటి.. ఇలా చేయాలన్న ఆలోచన ఎందుకు కలిగింది అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

  • Written By:
  • Publish Date - May 31, 2023 / 02:50 PM IST

మహిళా సంరక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా వేల కోట్లు ఖర్చు చేస్తున్నాయి. కానీ అమ్మాయిలపై వేధింపులు, అత్యాచారాలు, హత్యాయత్నాలు తగ్గడం లేదు. ప్రతిరోజూ దేశంలో ఏదో ఒక మూల చిన్న బాలిక మొదలు పండు ముసలి వారి వరకూ ఇలాంటి దురాగతాలు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని వెలుగులోకి వస్తాయి. మరికొన్ని తెరచాటుగా మిగిలిపోతాయి. ఇలాంటివి జరగకూడదనే ఉద్దేశ్యంతో జార్ఖండ్ కు చెందిన ఇంటర్ విద్యార్థి ఎలక్ట్రిక్ చెప్పులను తయారు చేశారు. వీటిని ధరించి.. అమ్మాయి వెంటపడి ఇబ్బందులకు గురిచేసే వారిని కాళ్లతో తంతే ఆటపట్టించే వాళ్లు షాక్ తగిలి వెంటనే కిందపడిపోతారు. తద్వారా తనకు తాను ఆత్మరక్షణను కల్పించుకునే అవకాశం ఉంటుంది.

సాధారణంగా మనం ధరించే చెప్పుల లాగానే ఇవి ఉంటాయి. వాటిలో చిన్నని మోటర్ ను అమర్చారు. దీనికి నాలుగు బ్యాటరీల సహాయంతో ఛార్జింగ్ చేయాల్సి ఉంటుంది. అర గంట ఛార్జ్ చేస్తే రెండు రోజుల వరకూ పవర్ అందులో ఉండేలా తయారు చేశారు. దీనిలో చిన్న స్విచ్ కూడా అమర్చారు. అవసరం అనుకున్నప్పుడు ఆన్ చేసుకుంటే చెప్పుల క్రింది భాగంలో కరెంట్ ఉత్పత్తి అవుతుంది. పాదం మోపిన భాగంలో ఎలాంటి కరెంట్ రాకుండా.. ధరించిన వారికి ఏమీ కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ డివైజ్ ధర ప్రస్తుతం రూ. 500 గా నిర్ణయించారు. కేవలం అతి తక్కువ ధరలో ఇలాంటి వాటిని కనుగొనడం ప్రశంసించదగ్గ విషయంగా చెప్పాలి.

ప్రభుత్వాలు వేల కోట్లు పెట్టి రకరకాల పథకాల పేరుతో మహిళలకు రక్షణ కల్పిస్తున్నామని చెబుతున్నారు. ఇలాంటి వారిని ప్రోత్సహించి వీటిని మరింత అందంగా తయారు చేసి మార్కెట్ లో అమ్మడం వల్ల సెక్యూరిటీకి సెక్యూరిటీ అందుతుంది. ఆకతాయిల ఆగడాలు తగ్గే పరిస్థితి ఉంటుంది. ఇలా కాకుండా నిర్భయ, దిశ వంటి చట్టాలను ఏర్పాటు చేయడం వల్ల న్యాయం అనేది బాధిత కుటుంబానికి కొన్ని సంవత్సరాలకు జరగవచ్చు. ఒక్కో సారి జరగక పోవచ్చు. అదే ఇలాంటి ఉత్పత్తులకు ప్రోత్సాహకాలు అందించడం ద్వారా తక్షణం ఘాతుకానికి పాల్పడకుండా అమ్మాయి తన భద్రతను తాను చూసుకునే వెసులుబాటు ఉంటుంది.

T.V.SRIKAR