అమ్మాయిలు.. ఆత్మహత్యలు ఇదేనా ఇప్పటి కాలానికి తెలిసింది. ఇంకేమీ లేదా..? లేకపోతే సమాజ చరిత్ర గురించి తెలియదా..? గతానికీ ఇప్పటికీ తేడా ఏముంది. అప్పట్లో సతీసహగమనం పేరుతో బ్రతికుండగానే చితిపై పేర్చి చంపేసే వాళ్లు. అది ఆచారం అని అన్నారు. కాలం మారింది. చాలామంది సంఘసంస్కర్తలు సుదీర్ఘపోరాటం చేసి ఈ ఆచారాన్ని అదే చితిలో బూడిద చేశారు. కానీ మీరు ఏమైనా మారారా.? మీతీరు మార్చుకోరా.. ఇంకా ఇలాంటి అమాయకపు ప్రీతీలు ఎందరు బలికావాలి. నేటి భారతం కోరుకునేది ఇదేనా.? అస్సలు కాదు. ఇంకా ఉంది. మీలో స్పూర్తి నింపే పాఠాలు వేలకు వేలు ఉన్నాయి. వాటిపై దృష్టి పెట్టండి.
ఒకప్పుడు కందుకూరి వీరేశలింగం స్త్రీ విద్యను ప్రోత్సహించేదుకు వివేకవర్థిని పేరుతో పత్రికలు నడిపారు. కొంత ముందుకు వెళ్తే శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి తన రచనల్లో అరికాళ్ల క్రింది మంటలు పేరుతో స్త్రీలో చలనాన్ని కలిగించారు. ఇక గుడిపాటి వెంకటాచలం అయితే కేవలం స్త్రీవాదాన్ని ప్రోత్సహిస్తూ మైదానం పేరుతో రచనలు చేశారు. ఇప్పటి తరంలో కూడా వారిని ఆదర్శంగా తీసుకొని సతీష్ చందర్ వంటి వారు స్త్రీ వాదానికి కట్టుబడి వారికి ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. ఇంక ఏమికావాలి చెప్పండి నాటి నుంచి నేటి వరకూ సమాస హితం కోసం వారి ప్రయత్నాలు వారు చేస్తూనే ఉన్నారు. కత్తిపోటు కంటే కలం పోటు గొప్పది అని పూర్తిగా విశ్వసించి ఇలాంటి రచనాయుధాలు మనకు అందిస్తున్నారు.
ఇలాంటివి చదివితే సమాజంపై ఒక అవగాహన వస్తుంది. మన ప్రపంచం అప్పటికన్నా ఇప్పుడు అన్నిరంగాల్లో అభివృద్ది సాధించింది. ఆ అభివృద్దిని అవకాశంగా మలుచుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాల్సిన హిమకుసుమాలు మీరు. అలాంటిది ఒక మృగాడి పద్మవ్యూహంలో మదనపడి మరణాన్ని మీచేతులతో మీరే లిఖించుకుంటారా. ఇది మీ భయమో, మూర్ఖత్వమో కాదు. కేవలం పిరికితనం. పిరికితనాన్ని కాళరాసి ధైర్యాస్త్రాలను దేహం మొత్తం అణువణువునా నింపుకోండి. ఇక మీరే కదా అణుబాంబు. మీ జోలికి రావడం కాదు కదా.. మీతో సూటిగా మాట్లాడాలన్నా ఎదుటివాడి వెన్నులో వొణుకుపుట్టాలి.
అలాగని కర్కషంగా ప్రవర్తించమని కాదు. ఆదరణలో అమ్మలాగా, ఆప్యాయత విషయానికొస్తే ప్రేయసిగా, అలిసొస్తే ఆలిగా, ఆకతాయి చేష్టలు చేస్తే ఆదిపరాశక్తై ఇలా అన్ని రూపాలూ మీలో ఉంచుకున్నారు. అయినప్పటికీ ఇలాంటి మనో విధారకమైన, హృదయాన్ని కలిచివేసే చర్యలకు పాల్పడుతున్నారు. ఇది ఎంతమాత్రం సబబు. మీ అంత:కరణ శక్తితో ఆలోచించండి. సమస్త విశ్వం, శక్తి మీలోనే ఉందన్నారు వివేకానందుడు. సాంకేతికత లేని కాలంలో దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడారు సరోజినీ నాయుడు. తండ్రి ప్రోత్సాహం, ప్రేరణతో దేశ తొట్టతొలి మహిళా ప్రధాని అయ్యారు ఇందిరా. దేశం మొత్తాన్నే తన గుప్పెట్లో పెట్టుకొని ఒక ఆట ఆడుకున్నారు. రక్షణ, ఆర్థిక మంత్రులుగా చేసి ప్రస్తుతానికీ కొనసాగుతున్నారు నిర్మలా. వీరి నోట ఏమాట వస్తుందో అని ఎదురు చూసేంతగా ఎదిగింది మహిళా భారతం. సాంకేతికత పరంగా కల్పనా చావ్లా ఉంటే, క్రీడాపరంగా సానియా, పీవీ సింధూలు ఉన్నారు. వీరందరూ యువ మహిళలే. వీరు సాధించిన విజయ పథకాలు వారి మెడలో వేసుకొని విర్రవీగేందుకు కాదు. నిరంతరం మీలోని చైతన్య స్పూర్తిని తట్టిలేపేందుకు. మహిళ అంటే మహాశక్తి స్వరూపిణి అని ఇప్పటికైనా అర్థమైయ్యిందా.
ఇంతటి సౌకర్యం ఉన్నప్పటికీ ఎక్కువగా చదువుకున్న స్త్రీలే ఇలాంటి సంఘటనలకు పాల్పడుతుంటే భారతావని మనస్సు క్షోభిస్తుంది. దేశం కోసం ఏదో ఒకటి చేయాలనే స్థాయి నుంచి.. దేశంలో కనీసం బ్రతికి ఉండండి అని బ్రతిమలాడే స్థాయికి మనం దిగజారిపోతున్నామా ఆలోచించండి. పోరాడుతూ మరణిస్తే విజయం పోరాటం విరమిస్తే మరణం అన్నాడు ఒక మహానుభావుడు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న మృగాళ్లపై పోరాటం చేద్దాం. అప్పుడే మనం గెలిచినట్లు అవుతాం. అదే పోరాటం విరమిస్తే మనం మరణిస్తాం. లోకాన్ని విడిచి మరణించేకంటే.. పోరాటం చేస్తూ బ్రతికే ఉందాం. చివరగా ఒక్కమాట.. గతంలో లేచింది నిద్రలేచింది మహిళా లోకం అని అంటే విని ఆనందించాం. కానీ అది కేవలం పాటకు మాత్రమే పరిమితం అయ్యింది. పాటలోనో మాటలలోనో కాదు నిండు చేతులతో స్త్రీ శక్తిని చూపిద్దాం. మహిళ తలుచుకుంటే ఏమైనా చేయగలదు అనే సువర్ణ శాశనాన్ని లిఖిద్దాం. అప్పుడే మీ ప్రఖ్యాతి, కీర్తి పెరిగి ఆ ప్రశంశల వరదలో ఇలాంటి ఆగడాలు, అకృత్యాలు కొట్టుకొని పోతాయని ఆశిస్తూ ప్రీతి సంఘటన పై చింతిస్తూ ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం.
T.V.SRIKAR