అమృత్‌పాల్‌సింగ్ గతేడాది ఫిబ్రవరి వరకూ ఎవరికీ తెలియని పేరు.. పొట్టకూటి కోసం దుబాయ్ వెళ్లి ట్రాన్స్‌పోర్ట్ కంపెనీలో ట్రక్కుడ్రైవర్‌గా పనిచేశాడు. కనీసం సిక్కుల సంప్రదాయ తలపాగా కూడా ధరించేవాడు కాదు. వచ్చిన డబ్బుతో విలాస జీవితం గడిపేవాడు. అలాంటి వాడు నేడు అతివాద సిక్కులకు మతగురువు అయ్యాడు. ఏడాదిలో ఈ స్థాయికి ఎలా ఎదిగాడన్నది మాత్రం అతిపెద్ద మిస్టరీ.
దుబాయ్‌లోనే అమృత్‌పాల్‌సింగ్‌కు ఖలిస్థాన్ నేత లఖ్‌బీర్ సింగ్ రోడే సోదరుడు జస్వంత్, ఉగ్రవాది పరమ్‌జీత్ సింగ్ పమ్మాతో పరిచయం ఏర్పడింది. వీరు పాక్ కేంద్రంగా కార్యకలాపాలు నడిపేవారు. ఆ పరిచయం అతడిని మలుపు తిప్పింది. అమృత్‌పాల్‌సింగ్‌లో ఉన్న స్పార్క్‌ను పసిగట్టిన వారు అతడికి బ్రెయిన్‌వాష్ చేశారు. భారత్‌లో సిక్కులకు అన్యాయం జరుగుతోందని, ఖలిస్తానీ ఉద్యమం నడపడానికి నీకంటే సరైనోడు లేడంటూ రెచ్చగొట్టారు. ఇటు పాకిస్తానీ నిఘా సంస్థ ఐఎస్‌ఐ అతడిని జార్జియా పంపి ఉగ్రవాద శిక్షణ ఇచ్చింది. ఆ తర్వాత వ్యూహం ప్రకారం భారత్ చేర్చింది.
గతంలో ఢిల్లీలో రైతు ఉద్యమ సమయంలో ఎర్రకోటపై జెండా ఎగరేసి వార్తల్లోకి ఎక్కిన పంజాబీ నటుడు దీప్‌సిద్దూ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఆ సమయంలోనే భారత్ చేరుకున్న అమృత్‌పాల్‌సింగ్.. వారిస్ పంజాబ్‌దే సంస్థను హైజాక్ చేశాడు. తానే దానికి నాయకుడిగా ప్రకటించుకున్నాడు. సిక్కు యువకులను రెచ్చగొట్టాడు. ఉద్రేక పూరిత ప్రసంగాలతో తనవైపు తిప్పుకున్నాడు. ఇటు పాకిస్తాన్ తమవంతు సాయం చేస్తూ వచ్చింది. తరచూ డ్రోన్లతో ఆయుధాలను పంపింది. రోజురోజుకు అతడి ప్రభ పెరిగిపోవడంతో పోలీసులు అతడిపై దృష్టి పెట్టారు.
గతంలో అమృత్‌పాల్‌సింగ్ అనుచరుడు ఒకడ్ని అరెస్ట్ చేసినప్పుడు అతడు చేసిన రచ్చ దేశమొత్తం చూసింది. కొన్ని వేల మందితో అజ్‌నాలా స్టేషన్‌పై దాడికి దిగాడు. తుపాకులు, కత్తులతో వీరంగం సృష్టించి విడిపించుకుపోయాడు. అమృత్‌పాల్ సింగ్‌పై హత్యాయత్నం, కిడ్నాప్ వంటి కేసులున్నాయి. ఐఎస్‌ఐతో సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బ్రిటన్‌లో ఉంటున్న అవతార్‌సింగ్ ఖండా వ్యూహాలే అమృత్‌పాల్ ఎదుగుదల వెనక ఉన్నాయని అనుమానిస్తున్నారు.
అమృత్‌పాల్‌సింగ్ తనకంటూ ఓ ప్రైవేటు సైన్యాన్ని సమకూర్చుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఆనంద్‌పూర్ ఖల్సా పోర్స్- AKF పేరుతో దీన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అతడు ఎక్కడకు వెళ్లినా వీళ్లు వెంటే ఉంటారు. డ్రగ్స్‌కు బానిసై రీహాబిలిటేషన్ సెంటర్లలో చిక్కుకున్న వారిని అమృత్‌పాల్‌సింగ్ చేరదీసినట్లు భావిస్తున్నారు. డబ్బు, డ్రగ్స్ ఆశ చూపి వారిని తనవైపు తిప్పుకున్నట్లు నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి.
పంజాబ్‌ను గతంలో ఖలిస్తానీ ఉద్యమం గడగడలాడించింది. ఆపరేషన్ బ్లూస్టార్, ఇందిర హత్య, ఆ తర్వాత సిక్కులపై దాడులు.. అంతా అల్లకల్లోలం.. కాలక్రమేణా పరిస్థితి మారింది. దీంతో రాష్ట్రం కాస్త సర్దుకుంది. ఖలిస్తానీ ఉద్యమం పలచబడింది. పంజాబ్‌లో శాంతిభద్రతలు మెరుగుపడ్డాయి. ఆ రాష్ట్రాన్ని రణరంగంగా మార్చేందుకు పాకిస్తాన్ తన ప్రయత్నాలు చేస్తూనే వచ్చింది. అమృత్‌పాల్‌సింగ్ కూడా అలా పాక్ విసిరిన ఓ పాచికే.