అయోధ్యలో (Ayodhya) కొలువు దీరబోతున్న రామయ్య (Lord Rama) విగ్రహం (Statue) ఎలా ఉండబోతోంది? ఏ శిలతో కోదండపాణి సుందరరూపం రూపుదిద్దుకోబోతోంది? ఆ శిలలను ఎక్కడ్నుంచి తీసుకొచ్చారు? అయోధ్య రామమందిర నిర్మాణం ఎంతవరకు వచ్చింది?
అయోధ్యలో ఆలయ (Temple) నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. సాధ్యమైనంత త్వరగా ఆలయ పనులు పూర్తి చేసేందుకు యుద్ధప్రాతిపదికన శిల్పులు, సిబ్బంది రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. ఆలయంలో కొలువు తీరబోయే శ్రీరామచంద్రుని విగ్రహ రూపురేఖలను శ్రీరామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్ (Shree Rama Janma Bhoomi Theertha Kshetra Trust) నిర్ణయించింది. రెండురోజుల పాటు జరిగిన సమావేశంలో పలువురు స్వాములు, జియాలజిస్టులు, శిల్పులు, వాస్తు నిపుణుల అభిప్రాయాలను సేకరించి చివరకు కృష్ణశిలతో రామయ్య విగ్రహాన్ని రూపొందించాలని నిర్ణయించారు. విల్లు, బాణం ధరించి విలుకాని రూపంలో ఈ విగ్రహం ఉండబోతోంది. ఇది ఐదేళ్ల వయసులో ఉన్న శ్రీరాముని రూపం. ఐదు అడుగుల ఎత్తు ఉంటుంది. మైసూరుకు (Mysore) చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్‌కు (Arun Yogiraj) విగ్రహ తయారీ బాధ్యతలు అప్పగించారు. కేదార్‌నాథ్‌లో (Kedarnath) ఇటీవల ఏర్పాటు చేసిన 12 అడుగుల ఆది శంకారాచార్య విగ్రహాన్ని ఈయనే రూపొందించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన 28 అడుగుల నేతాజీ సుభాష్ చంద్రబోస్ (Netaji Subhash Chandrabose) విగ్రహం కూడా ఆయన సిద్ధం చేసిందే.
కర్ణాటకలోని ఉడిపి (Udipi) జిల్లా కార్కర్, హెగ్గే దేవనకోటె గ్రామాల నుంచి సేకరించిన కృష్ణశిలనే రామచంద్రుని విగ్రహానికి వినియోగించనున్నారు. ఈ ప్రాంతం నుంచి ఇప్పటికే కొన్ని శిలలను సేకరించి అయోధ్యకు తరలించారు. వీటినే నెల్లికారు రాళ్లు అని కూడా పిలుస్తారు. వాటిలో దేన్ని వినియోగించాలనేది శిల్పి అరుణ్ యోగిరాజ్ నిర్ణయించనున్నారు. వచ్చే మకర సంక్రాంతికి రామయ్య విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని ట్రస్ట్ భావిస్తోంది. నిజానికి నేపాల్‌లోని (Nepal) గండకీ నది (Gandaki River) తీరం నుంచి తీసుకువచ్చిన శాలిగ్రామ శిలలతో బాలరామయ్య విగ్రహాన్ని రూపొందించాలనుకున్నారు.
సుమారు 6కోట్ల సంవత్సరాల వయసున్న పలు శిలలను పూజలు చేసి మరీ అయోధ్యకు తరలించారు కూడా. రామ జన్మభూమి గర్భాలయంలో ప్రతిష్టించే విగ్రహం కోసం రెండు అరుదైన శిలలను ఎంపిక చేశారు. రాజస్థాన్ నుంచి నాలుగు, ఒడిశా నుంచి తీసుకొచ్చిన ఒక శిలను కూడా పరిశీలించారు. కానీ చివరకు కర్ణాటక నుంచి తీసుకొచ్చిన కృష్ణశిలలవైపే ట్రస్టు సభ్యులు మొగ్గుచూపారు. సీతాదేవి, లక్ష్మణమూర్తి విగ్రహాలను గండకీ తీరం నుంచి తెచ్చిన శిలలతో రూపొందిస్తారా.. లేక వాటికి కూడా కృష్ణశిలలనే ఉపయోగిస్తారా అన్నది చూడాల్సి ఉంది. గతంలో చాలా ప్రముఖ విగ్రహాలను కృష్ణశిలలతోనే చెక్కారు. ఇటీవల యాదాద్రి ఆలయంలో కూడా కృష్ణశిలలను వినియోగించారు.
అయోధ్య రామమందిర నిర్మాణ పనులు దాదాపు సగానికి పైగా పూర్తయ్యాయి. 2023చివరి నాటికి రామయ్య ఆలయం సిద్ధమవుతుంది. గర్భగుడిలో విగ్రహాలను ప్రతిష్ఠించి వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి భక్తులకు అనుమతినివ్వాలని ట్రస్టు భావిస్తోంది. రామమందిర పరిసరాల విస్తీర్ణాన్ని 61 ఎకరాల నుంచి 100 ఎకరాలకు పెంచారు కూడా. వేయి కోట్లతో అయోధ్యలో రామమందిరం రూపుదిద్దుకుంటోంది. ఈ ఆలయం ఎప్పుడు పూర్తవుతుందా.. రామయ్య పుట్టిన ప్రదేశంలో ఆయన్ను ఎప్పుడు దర్శించుకుందామా అని భక్తులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.