Chandrayaan-3: చంద్రయాన్ 3 సక్సెస్ గురించి ఇప్పుడు ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటోంది. అంత తక్కువ బడ్జెట్‌తో చంద్రుని మీదకు ల్యాండర్ పంపించడమే కష్టం అనుకుంటే.. సేఫ్‌గా ల్యాండ్ అయ్యేలా చేయడం.. ప్రాజెక్ట్ సక్సెస్ చేయడం అంటే మాములు విషయం కాదు. అందుకే ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు ఇస్రోకు సాహో అంటున్నాయి. ల్యాండర్, చంద్రుని ఉపరితలం మీద అడుగు పెట్టే క్షణం ప్రపంచం అంతా రెండు కళ్లు చేసుకొని చూసింది.
ఆ అద్భుతమైన క్షణాన్ని జీవితకాలపు జ్ఞాపకంగా మార్చుకుంది. చంద్రుడి మీద ల్యాండర్ దిగిన క్షణం నుంచి.. చంద్రయాన్‌కు సంబంధించి ప్రతీ అప్డేట్‌ను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటోంది ఇస్రో. ల్యాండర్‌లోంచి ప్రగ్యాన్ రోవర్ చంద్రుడి మీదకు దిగడం.. ఆ రోవర్ తిరిగిన చోట చక్రం గుర్తులు కనిపించడం.. ఆ వీడియోలను ఇస్రో సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో.. జనాలంతా ఫుల్ ఖుష్ అయ్యారు. ఐతే ప్రగ్యాన్ రోవర్‌కు సంబంధించి కీలక విషయం బయటపెట్టింది ఇస్రో. చంద్రయాన్-3కు పెను ప్రమాదం తృటిలో తప్పింది. రోవర్ వెనక్కి వచ్చేసింది. రోవర్ వెళ్లే దారిలో మూడు మీటర్ల దూరంలో ఒక గొయ్యి కనిపించింది. దీన్ని సైంటిస్టులు ముందుగానే గుర్తించి, వెంటనే అప్రమత్తం అయ్యారు. ఎదురుగా గొయ్యి ఉందని, వెనక్కు రావాలని రోవర్‌కు సందేశం పంపించారు.
సందేశం అందుకున్న రోవర్ వెనక్కి వచ్చేసింది. దీంతో భారీ ప్రమాదం తప్పినట్లు అయింది. రోవర్ ఆ గొయ్యిలో పడిపోయి ఉంటే అనే ఊహే ఇప్పుడు అందరినీ టెన్షన్ పెడుతోంది. నిజానికి చంద్రుడి మీద ఉపరితలం సమతలంగా ఉండదు. గోతుల్లా ఉంటుంది. అందుకే ల్యాండింగ్ కూడా చాలా కష్టంగా మారింది. అలాంటిది ఇప్పుడు గొయ్యి వరకు రోవర్ వెళ్లి మళ్లీ వెనక్కి వచ్చింది. దీంతో భారీ ప్రమాదం తప్పింది.