ROYAL BENGAL TIGER: భార్యకు భర్త.. భర్తకు భార్య.. తోడు నీడలా ఎప్పుడూ ఉండాల్సిందే. తోడు లేకపోతే మనషులకు ఎలాంటి వేదన ఉంటుందో.. పులులకు కూడా అలాగే ఉంటుందట. అందుకోనేమో.. ఓ రాయల్ బెంగాల్ టైగర్ తన తోడును వెతుక్కుంటూ 4 రాష్ట్రాలను చుట్టేసింది. అలుపూ.. సొలుపూ లేకుండా అలా 2 వేల కిలోమీటర్ల దాకా తిరుగుతూనే ఉంది. మరి తోడు దొరికిందా లేదా..? రాయల్ బెంగాల్ టైగర్.. దానికి మంచి ఆహారం కావాలి. లేళ్ళు, దుప్పులు లాంటి జంతువులు పుష్కలంగా దొరకాలి.
అప్పుడే కదా కడుపు కాలకుండా ఉండేది. ఆకలి తీరితేనే కదా హాయిగా నిద్రపట్టేది. ఆకలే కాదు.. పన్లో పనిగా తనకు తోడు కూడా కావాలని వెతుక్కుంటోంది ఈ బెంగాల్ టైగర్. తోడు కోసం నాలుగు రాష్ట్రాలను చుట్టేసింది. అందుకోసం పాపం 2 వేల కిలోమీటర్లు తిరిగింది. చిలుకా ఏ తోడూ లేక.. ఎటేపమ్మ ఒంటరి నడక అన్నట్టుగా తన పెళ్ళాన్ని వెతుక్కుంటోంది బెంగాల్ టైగర్. భార్య కోసం ఈ బెంగాల్ టైగర్.. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో సెర్చింగ్ చేసినట్టు అటవీ శాఖాధికారులు చెబుతున్నారు. మొదట మహారాష్ట్ర నుంచి నడక మొదలుపెట్టింది. అక్కడి నుంచి 2023 జులైలో ఒడిశాలోకి ప్రవేశించింది. అక్కడి నుంచి ఆగస్టులో ఆంధ్రప్రదేశ్‌లోని పార్వతీపురం, శ్రీకాకుళం అడవుల్లో వెతికింది. ఆ టైమ్‌లో స్థానికులు చాలా భయపడ్డారు. మళ్ళీ సెప్టెంబర్ నెలలో ఒడిశాకు వెళ్ళింది. గత రెండు నెలలుగా ఒడిశా-ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లోనే ఈ బెంగాల్ టైగర్ తిరుగుతోంది.
కుమిలి సింగి బీట్‌లో ఏర్పాటు చేసిన కెమెరాలో ఈ బెంగాల్ టైగర్ వెళ్తున్న దృశ్యాలు రికార్డు అయ్యాయి. అటవీశాఖాధికారులు వాటిని సేకరించి వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు పంపించారు. అప్పుడు తెలిసింది.. ఆ బెంగాల్ టైగర్ పెళ్ళాన్ని వెతుక్కోడానికి నాలుగు రాష్ట్రాల్లో 2 వేల కిలోమీటర్లు ప్రయాణం చేసినట్టు. ఇంకా విచిత్రం ఏంటంటే.. 5 నెలలుగా ఇలా సెర్చ్ చేస్తూనే ఉందట. గత నెల రోజుల్లోనే టైగర్ 500 కిలోమీటర్లు దాకా తిరిగినట్టు అధికారులు చెబుతున్నారు. మరి ఇన్ని కిలోమీటర్లు తిరిగినా పాపం ఆ బెంగాల్ టైగర్‌కు ఇప్పటిదాకా తోడు దొరకలేదట.