Seema Ghulam Haider: పబ్‌జీ-ఇండియా ప్రేమకథ.. పాక్ మహిళ కుటుంబ సభ్యుల సంచలన నిర్ణయం..

పెళ్లై, నలుగురు పిల్లలున్న సీమా.. ఇండియాలోని తన ప్రియుడి కోసం పాక్ వదిలివచ్చింది. నలుగురు పిల్లలతో కలిసి దుబాయ్, నేపాల్ ద్వారా ఇండియాలోకి ప్రవేశించింది. ప్రియుడు సచిన్‌తో కలిసి ఇండియాలో ఉంటోంది. పాక్ వదిలి ఇండియా వచ్చిన సీమాను బహిష్కరిస్తున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు

  • Written By:
  • Publish Date - July 16, 2023 / 04:24 PM IST

Seema Ghulam Haider: పాకిస్తాన్ నుంచి పబ్‌జి ప్రియుడి కోసం ఒక మహిళ నలుగురు పిల్లలతో కలిసి ఇండియా వచ్చిన సంగతి తెలిసిందే. పాక్‌కు చెందిన సీమా గులామ్ హైదర్ అనే మహిళకు 2019లో ఇండియాకు చెందిన సచిన్ మీనా అనే యువకుడితో పబ్‌జి ద్వారా పరిచయం పెరిగింది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారింది.

అప్పటికే పెళ్లై, నలుగురు పిల్లలున్న సీమా.. ఇండియాలోని తన ప్రియుడి కోసం పాక్ వదిలివచ్చింది. నలుగురు పిల్లలతో కలిసి దుబాయ్, నేపాల్ ద్వారా ఇండియాలోకి ప్రవేశించింది. 1,300 కిలోమీటర్లు దాటి వచ్చిన తన ప్రియుడు సచిన్‌తో కలిసి ఇండియాలో ఉంటోంది. పాక్ వదిలి ఇండియా వచ్చిన సీమాను బహిష్కరిస్తున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపారు. తమ ముస్లిం సంప్రదాయాల్ని కాదని ఇండియా వెళ్లిపోయిన సీమాను బహిష్కరిస్తున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. సీమా తిరిగి పాకిస్తాన్ రావాలని కోరుకోవడం లేదని ప్రకటించారు. ‘‘సీమా ఇండియాలోనే ఉండిపోవచ్చు. ఆమె ఇప్పుడు ముస్లిం కూడా కాదు. అయితే, పిల్లలను మాత్రం పాక్‌కు పంపించాలి’’ అని ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపారు.

ఒకవేళ ఆమె పాకిస్తాన్ తిరిగివచ్చినా ఆమెను ఎవరూ క్షమించబోరని, అందులోనూ ఒక హిందువు కోసం వెళ్లడం అక్కడి వాళ్లందరికీ కోపం తెప్పించిందని స్థానికులు అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ఇండియాలో ఉండటమే మంచిదని సూచిస్తున్నారు. ఆమె తన పిల్లలు, బ్యాగులతో వెళ్తుంటే తల్లి దగ్గరకు వెళ్తుందనుకున్నామని, కానీ, నెల రోజుల తర్వాత.. తాను ప్రియుడి కోసం ఇండియా వెళ్లినట్లు తెలుసుకుని షాకయ్యామని సీమా ఇంటి చుట్టుపక్కల వాళ్లు చెప్పారు. సీమా పాకిస్తాన్ తిరిగొస్తే శిక్ష విధించేందుకు సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్‌కు చెందిన కొందరు మత పెద్దలు బహిరంగంగానే ప్రకటించారు. మరోవైపు సీమా గ్రామంలో ఉన్న హిందూ దేవాలయాలపై దాడులు చేసేందుకు కూడా కొందరు ప్రయత్నించారు. అయితే, అక్కడున్న కొందరు హిందూ దేవాలయాల్ని, హిందువుల్ని పరిరక్షిస్తామన్నారు.

కాగా, సీమా డాక్యుమెంట్ల విషయంలో సందిగ్ధత నెలకొంది. ఆమె డాక్యుమెంట్లలో సీమా 2002లో జన్మించినట్లు ఉంది. ఆ లెక్కను ఆమెకు ఇప్పుడు 21 ఏళ్లు మాత్రమే ఉండాలి. అయితే, ఇప్పటికే ఆమెకు పెళ్లై, నలుగురు పిల్లలున్నారు. వారిలో పెద్ద బాబు వయసు ఆరేళ్లు. అంటే ఈ డాక్యుమెంట్స్‌లోని వివరాలు తప్పు అయ్యుండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం సీమా ఇండియాలో ఉండేందుకే ఇష్టపడుతోంది. తాను సచిన్‌తో కలిసి ఇక్కడే ఉంటానని, పాక్ వెళ్లనని చెబుతోంది. ఈ విషయం చట్టపరిధిలో ఉంది. కోర్టులో విచారణ అనంతరం సీమా విషయంలో ఒక స్పష్టత వస్తుంది.